శ్రీకాకుళం: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విరుద్ధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలోని దండి వీధిలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం పై కొందరు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని,రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు విరుద్ధంగా అసత్య ప్రచారం సాగుతున్నదని అన్నారు. మీ ప్రతినిధిగా మీకు నిజాలు చెప్పాల్సిన బాధ్యతతో తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఇంకా ఆయనేమన్నారంటే..
2019 ఎన్నికల ముందు వైయస్ జగన్ చేపట్టిన తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప్రజల కష్ట,నష్టాలు దగ్గర నుంచి గమనించారు. అధికారంలోకి వస్తే ఫలనాది పూర్తి చేస్తాను..అమలు చేస్తాను..అని చెప్పి మేనిఫెస్టోలో పొందు పరిచి అమలు చేశారు. అదేవిధంగా ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఇచ్చిన మాట ప్రకారం హామీలు అన్నీ అమలు చేస్తున్నాం. కానీ ఇవాళ మేం కూడా అధికారం లోకి వస్తే ఇవి ఇస్తాము అని చెపుతున్నారు విపక్ష నేతలు. అంతేకాని వారి స్టాండ్ ఏంటో స్పష్టం చేయడం లేదు. ఇక చాలా మంది విపక్ష నాయకులు చెబుతున్న విధంగా పథకాల అమలు కారణంగానే ధరలు పెరుగుతున్నాయి అని చెప్పడం అర్థ రహితం. ధరలు దేశం మొత్తం మీద పెరిగాయి.
పెట్రో,డీజిల్ తో సహా పలు ధరలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. ఒక్కసారి పక్క రాష్ట్రాలతో పోల్చి చూడండి. వాస్తవమేంట న్నది మీకే తెలుస్తుంది. సమాజంలోని ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ప్రభుత్వం బడుల ను చూస్తే అర్థం అవుతుంది. విద్యార్థులకు అవసరం అయిన అన్ని సదుపాయాలు అందిస్తున్నాము. బుక్స్,షూస్,బ్యాగ్,బెల్ట్, ట్యాబ్స్ అందించడంతో పాటు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తున్నాం."
8వ తరగతి విద్యార్థులకు టాబ్స్ ఇచ్చామంటే అర్థం వారికి ఆధునిక సాంకేతికత అందించాలని,నాణ్యమయిన విద్యా బోధన వారు అందుకోవాలని..అంతేకాని ఇవన్నీ ఓట్ల కోసం కాదు. అయినా వారిది రిది ఓటు వేసే వయసు కానే కాదు. ప్రపంచంలో ఉన్న ఉన్నత అవకాశాలను అందుకునేందుకు పేదరికం అడ్డు కాకూడదనే భావజాలంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇదే సమయాన మన జిల్లాలో టీడీపీ చేసిన శాశ్వత అభివృద్ధి పని ఒక్కటైన చూపించగలరా ? అని ప్రతిపక్షాలకు ప్రశ్నిస్తున్నాను.
ఉద్దానం ప్రాంతానికి స్వచ్ఛమయిన తాగునీటిని అందించేందుకు రూ.700 కోట్లతో పనులు చేపడుతున్నాం. పలాసలో హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం దిద్దాం. ప్రస్తుతం అక్కడ సంబంధిత పనులు కూడా జరుగుతున్నాయి. రూ.3000 కోట్లతో భావనపాడులో సీ - పోర్టు నిర్మాణం చేపడుతున్నాం. అదేవిధంగా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగుట్ల పాలెంలో రూ.300 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్నాం. వంశధార నిర్మాణం కోసం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్-తో సీఎం వైయస్ జగన్ చర్చలు జరిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణం ఆలస్యం అవుతుండడంతో గొట్టా దగ్గర రూ.180 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి మండు వేసవిలో జిల్లా రైతాంగానికి నీరు అందించనున్నాం.
గడిచిన 135 సంవత్సరాలుగా రాజధానికి దూరంగా ఉన్న జిల్లా మనది. రాజాం వచ్చి ఒకటే రాజధాని అది కూడా అమరావతి అని చంద్రబాబు అంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి రాజధాని అని చంద్రబాబు అంటున్నారు. మా తాతలు 850 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి అప్పటి రాజధాని చెన్నైకు వెళ్లారు. తర్వాత మా తండ్రులు 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి అప్పటి రాజధాని కర్నూలుకు వెళ్లారు. తరువాత మా తరం 850 కి.మీ. ప్రయాణం చేసి రాజధాని హైదరాబాద్ కు వెళ్ళాం. ఇప్పుడు సీఎం జగన్ వైజాగ్ లో ఏర్పాటు చేయాలని అడుగులు వేస్తుంటే..విపక్ష పార్టీ నేతలంతా అడ్డంకులు పెడుతున్నారు. రాజధాని విశాఖ అయితే ఉదయం పని మీద వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మన ప్రాంత ప్రజలకు, మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన జిల్లా ఎప్పుడూ వెనుకబాటుతనానికి దారి తీస్తూ ఉంది. ఈ ప్రాంత బిడ్డలు జిల్లా వదిలి పొట్ట కూటికోసం పక్క జిల్లాకు వెళ్తు న్నారు. పరిపాలన రాజధాని వైజాగ్ ను సాధించేందుకు అవసరం అయితే రాజీనామా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని సీఎం వైయస్ జగన్ కి తెలిపాను. కానీ ఆయన వద్దని వారించారు. ఇవాళ నా దృష్టికి వచ్చిన స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ను. విశ్రాంత ఉద్యోగులకు భవన నిర్మాణం చేపడతాం. అదేవిధంగా డ్రైనేజీలు మరమ్మతులతో పాటు పబ్లిక్ టాయిలెట్స్ మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తాం..అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేశు, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతీ, సాధు వైకుంఠం రావు, జేఎం శ్రీను, రంగాజీ, చల్లా శ్రీనివాసరావు, నక్క రామరాజు, ధర్మాన రఘు, ఖాన్, మండవిల్లి రవి, ధనుంజయ్, మహా లక్ష్మీ గాయత్రీ, ఆశ దీపికా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు