సేవాత‌త్ప‌ర‌త‌కు తార్కాణం వ‌లంటీర్లు

రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 

అంపోలు సిస్టం కాలేజ్ గ్రౌండ్ లో "వ‌లంటీర్ల‌కు వంద‌నం"

ఐదేళ్లలో చంద్ర‌బాబు ఐదు సార్లు మాట‌లు మార్చారు 

శ్రీ‌కాకుళం: సేవాత‌త్ప‌ర‌త‌కు తార్కాణం వ‌లంటీర్లు అని, వారి సేవ‌ల కార‌ణంగా ఈ ప్ర‌భుత్వం గౌర‌వం మ‌రింత పెరిగింద‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. అంపోలు సిస్టమ్ కాలేజీ గ్రౌండ్ లో గ్రామ, వార్డు వ‌లంటీర్ల‌కు సేవా మిత్ర, సేవా ర‌త్న, సేవా వ‌జ్ర పేరిట న‌గ‌దు పుర‌స్కారాలు అంద‌జేస్తూ..వలంటీర్ల‌కు వంద‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ మంత్రి ధర్మాన  ఏమన్నారంటే...

ఇష్టప‌డి చేసే ఏ వృత్తి అయినా,గుర్తింపు ద‌క్కిన రోజే ఆ ప‌ని చేసిన వారికి సంతృప్తి ఇస్తుంది. అందుకే వ‌లంటీర్స్ సేవలకు పురస్కారాల అందజేస్తున్నాం. వారి సేవ‌ల‌ను గుర్తించి గౌర‌విస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ త‌మ‌కు అప్ప‌గించిన ప‌నులు నిరంత‌రాయంగా చేస్తూ.. ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు అన్న‌వి పాలకుడి ఆలోచనకు అనుగుణంగా కొన్ని కొత్త వ్య‌వ‌స్థ‌ల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తారు. అందుకు తగ్గట్టుగా ప్ర‌ణాళిక‌లు అన్న‌వి ఉంటాయి.

వైయ‌స్ జ‌గ‌న్ వ‌య‌స్సులో చిన్న కావ‌చ్చు కానీ ప‌రిపాల‌న సంబంధ నిర్ణ‌యాల్లో చాలా దూరాలోచ‌న‌లు క‌లిగి ఉన్నారు.  అందుకు ఆయ‌న్ను అభినందిస్తున్నాను. చంద్రబాబు పాలన లో తప్పుడు పద్ధ‌తులు అమలు చేసి,తాత్కాలిక ప్రయోనాజం కోసం పాకులాడే వారు. రాజ్యాంగ విరుద్ధంగా ఆ రోజు పాల‌న ఉండేది. సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ప్రభుత్వం అందించినవి ప్ర‌జ‌ల‌కు అందాలి అంటే తలవంచుకు ఉండాలి. అలానే ఇంటి మీద తెలుగు దేశం పార్టీ జెండా కట్టాలి. ఆ రోజు ప‌థ‌కాల వ‌ర్తింపు విష‌య‌మై కలెక్టర్ దగ్గరకు వెళ్లినా సరే ఊర్లో ఉండే జన్మ భూమి కమిటీ సభ్యులను కలవాలి అని చెప్పేవారు. చంద్ర‌బాబు విష‌య‌మై ఆ రోజు ప్రజలందరూ విసిగిపోయారు. గొప్ప పాలకుడు అని ఓటు వేస్తే కొంప ముంచాడ‌ని విసిగి పోయారు. కానీ ఇవాళ ప్ర‌జ‌లంతా స్వేచ్ఛ‌గా బ‌తికే విధంగా,గౌరవం,ఆత్మ విశ్వాసంతో మెలిగే విధంగా పాలన అందిస్తున్నారు సీఎం జగన్. ఆ రోజు వ‌లంటీరు వ్య‌వ‌స్థ‌ను మేం దుర్వినియోగం చేస్తున్నామ‌న్నారు. ప్ర‌జ‌ల ప‌ర్స‌న‌ల్ డేటా ను మిస్ యూజ్ చేస్తున్నామ‌ని లేనిపోని మాట‌లు చెప్పారు. ప్ర‌జ‌ల‌లో భ‌యాందోళ‌న‌లు పెంచారు. అదేవిధంగా వ‌లంటీర్లు భ‌ర్త‌లు అనుమానించే విధంగా వివాహిత‌ల‌తో ప్ర‌వ‌ర్తిస్తు న్నార‌ని కూడా అభియోగాలు మోపారు.

మ‌రో పెద్ద మ‌నిషి ( ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉద్దేశిస్తూ) వ‌లంటీర్ల‌పై అర్థం లేని ఆరోప‌ణ‌లు చేశారు. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ కు సంబంధించి వారిపై లేని,పోని ఆరోప‌ణ‌లు చేశారు. అదే పెద్ద మనిషి మహిళలను వివిధ ప్రాంతాల‌కు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని అర్థం లేని మాట‌లు చెప్పారు. వారంతా ఏసీ గ‌దుల‌లో పులులు. నిన్న‌టికి నిన్న శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌నకు వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ యువ నాయ‌కుడు లోకేశ్ .. పలాస ఆస్ప‌త్రి ముందు నిల్చొని ఏమి అభివృద్ధి జరగలేదు అని అన్నారు. ఆయనకు ఎవరో ఏదో రాసి ఇస్తే అది చదవడం తప్ప ఏమీ తెలియదు. వీరంద‌రికీ విరుద్ధంగా లక్ష్యంతో పని చేసే వ్యక్తి జగన్. సమాజంలో వలంటీర్ల పేరిట కొత్త వ్యవస్థ తీసుకు వచ్చి,ఉన్నత స్థితికి తీసుకు వెళ్లారు. తాను అనుకున్న‌దే సీఎం జగన్ చేస్తున్నారు. 

ఈ రోజు గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల కన్నా ఎక్కువగా వలంటీర్స్ తో స‌త్సంబంధాలు కలిగి ఉన్నారు. ఇంట్లో సొంత బిడ్డలు కన్నా ఎక్కువగా వారు సేవలు అందిస్తున్నారు. ఇది కదా ఈ ప్రభుత్వం తీసుకు వచ్చిన గొప్ప సంస్కరణ.  ప్రభుత్వం పంపించిన ప్రతినిధిగా,ప్ర‌జా సేవకుడిగా, మీరు ఎప్ప‌టికీ ఎన్న‌టికీ మోసం చేయరు అన్న గొప్ప నమ్మకం వలంటీర్ల మీద ఉంది. ఎన్నో ఏళ్లుగా పాల‌న వ్య‌వ‌స్థ‌ల్లో ఉన్న రుగ్మతలకు పరిష్కారం వలంటీర్ వ్య‌వ‌స్థ. సామాన్య ప్ర‌జ‌ల నిజ జీవితంలో ఎన్నో మార్పులు చేసిన హీరో వైయ‌స్‌ జగన్ ఒక్కరే.

గత ప్రభుత్వం  హయాంలో విద్య లో 22 వ స్థానంలో ఉండేవాళ్ళం. సంపద కలిగిన రాష్ట్రం అయి ఉండి కూడా విద్యలో వెనుకబడి ఉండేవాళ్ళం. అలాంటి రాష్ట్రం ఈ రోజు ఫ‌లితాల సాధ‌న‌లో 97 శాతానికి చేరుకుంది. ఇది సీఎం జగన్ చేసిన కృషి.  ఇది కదా నిజమైన పరిపాలన. విద్య కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి,స్కూల్స్ లో ఎన్నో మార్పులు చేశాం. విద్యార్థులకు నాణ్య‌మైన రీతిలో పౌష్టికాహారం అందిస్తున్నాం. ధనవంతుల పిల్లలులానే ప్ర‌భుత్వ బ‌డుల‌కు వ‌చ్చే పిల్ల‌ల‌కు ఏ ఇబ్బందీ రాకుండా ఉండేందుకు మంచి యూనిఫాం,బుక్స్,బెల్ట్,బ్యాగ్ ఇలా అన్నీ ఇచ్చాం. 8వ తరగతి విద్యార్థుల‌కు ట్యాబ్స్ ఇచ్చాం. ప్రపంచంతో పోటీ పడాలి అని  ఇంటర్నేషనల్ బాకలారియాట్ (ఐబీ) సిల‌బ‌స్ ను,సీబీఎస్ఈ సిల‌బ‌స్ ను తీసుకు వచ్చాం. ఇవ‌న్నీ ఈ ఐదేళ్ల‌లోనే తీసుకు వ‌చ్చాం. పాలకుడికి లక్ష్యం ఉన్ననాడే ఇవి సాధ్యం. జగన్ విద్యా వ్యవస్థను పాడు చేశాడు అని టీడీపీ యువ నాయ‌కుడు లోకేశ్ అంటున్నారు. నాటి సీఎం చంద్రబాబు హయాంలో 14 వ స్థానంలోఉంటే,ఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి అందించిన సంస్కరణల కార‌ణంగా నాలుగో స్థానంలోకి వచ్చింది.

చంద్రబాబు సభకు వస్తున్న జనం మొహాలు చూస్తుంటే.. మాకేంటి ఈ బాధ ? అనేలా ఉన్నారు. అదే అనంత‌పురం జిల్లా,రాప్తాడు లో జరిగిన సిద్ధం సభ చూస్తే సీఎం జ‌గ‌న్ పాల‌న ఏ విధంగా ఉంది అన్న‌ది అర్థం అవుతుంది. 

5 ఏళ్లలో చంద్రబాబు 5 సార్లు మాటలు మార్చారు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ మానిఫెస్టో చూసి,జగన్ మానిఫెస్టో అమ‌లుకు సాధ్యం కాదు అని చెప్పారు. అయినా జనం జగన్ కు ఓటు వేసి సీఎంను చేశారు. కానీ ఆ రోజు చంద్ర‌బాబు మాత్రం వైయ‌స్ జగన్ పాలనలో సంక్షేమ ప‌థ‌కాలు ఎక్కువ కాలం ఉండ‌వు.. ఆర్నెల్ల‌లో ముగించేస్తారు అని ఆరోజు అన్నారు. జ‌గ‌న్ పాల‌న‌కు రెండేళ్లు అయ్యాక రాష్ట్రం మ‌రో శ్రీ‌లంక అవుతుంద‌ని అన్నారు. ఏమీ జరగలేదు అని గ్రహించి,రాజమండ్రి లో పెట్టిన సభలో సీఎం వైయ‌స్ జగన్ కన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పారు. అమ్మ ఒడి పేరిట బ‌డికి వెళ్లే వారికి ప్రోత్సాహ‌కంగా ఒకరికి కాదు,త‌ల్లికి వంద‌నం పేరిట ఇంట్లో ఉన్న వాళ్ల అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం అని అన్నారు. గృహిణుల‌కు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అని చెబుతున్నారు. ఇంత కంటే ఎక్కువ ఇచ్చేస్తాం అని చెబుతున్నారు. విప‌క్ష నేత చంద్రబాబు చెప్పినట్టుగా చేస్తే ఏడాదికి రూ.1.24 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది." 

స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నప్ప‌టికీ అభివృద్ధి ఫలాలు అందని కుటుంబానికి తోడుగా ఉంటున్న ప్రభుత్వ విధానాలను తప్పుగా చిత్రీకరించిన వారికి మళ్ళీ ఓటు వేస్తే మీ ప‌రిస్థితి ఏంటి ? ఒక్క‌సారి ఆలోచించండి. వైద్యం కోసం ఖ‌ర్చు చేయలేక, స్మశానంకి ఎప్పుడు వెళ్తామో అని వేచి చూసే వాళ్ళు. కానీ ఈ రోజు పేదవాడికి ధైర్యం వ‌చ్చింది. త‌మ‌కు ఈ ప్రభుత్వం తోడుగా ఉంది అని ప‌క్కాగా అనిపిస్తోంది. ఇందుకు కారణం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం విధానం కాదా..? వలంటీర్ కన్నా మంచి సాక్ష్యం ఎవ‌రు ఉన్నారు ? ఈ ప్రభుత్వం చేసిన ఇన్ని మంచి పనులు చెప్పేందుకు..ఎన్నో తార్కాణాలు ఉన్నాయి.
 
మన ప్రభుత్వ అజెండా ప్రకారం ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు మనం ఏర్పాటు చేసిన వలంటీరు వ్యవస్థ‌లు ఉన్నాయి. మీరు గమ నిస్తే..మీరు గమనించిన ఈ తేడాను కళ్లకు కట్టినట్టుగా మీ గ్రామంలోని ప్రతి రైతన్నకూ చూపవచ్చు.  ప్రతి అక్కచెల్లెమ్మకూ  చెప్ప‌వ‌చ్చు. ప్రతి గ్రామంలో ఆసుపత్రినీ,బడినీ మార్చాయి. మనం ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థ ప్రతి గ్రామంలోని రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ.. ఉంది. రైతన్నకు కొండంత అండగా గ్రామస్థాయిలో నిలబడుతోంది.
ఈ వ్యవస్థల కారణంగా ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేకుండా రూ.3వేలు అవ్వా,తాతల చేతుల్లో నెల మొద‌టి రోజు పొద్దున్నే అందిస్తున్నాం.  ఆదివారమైనా,సెలవురోజైనా వీరంతా క్షేత్ర స్థాయిలో ప‌ని చేస్తూ పింఛ‌ను ఇస్తున్నారు. ఇతర పౌరసేవలు కూడా ఇవాళ మీ ఇంటికే వ‌చ్చి అందిస్తున్నారు. ఇవన్నీ మనం చేసిన మార్పులు. మనం తీసుకుచ్చిన వ్య‌వ‌స్థల వల్లే సాధ్యమవు తుంది. మీరు గ్రామాల్లో ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ప్ర‌తి మార్పునూ చెప్ప‌గ‌ల‌గాలి. అలానే వ‌లంటీరు వ్య‌వ‌స్థ‌పై విప‌క్షం చేస్తున్న అబ‌ద్ధ‌పు ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ తమీమ్ అన్సారియా-ఐఎఎస్, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు,  రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు అంధవరాపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, డిపి దేవ్, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ రావు డిసిఎంఎస్ గొండు కృష్ణ, గ్రామ/వార్డు సచివాలయం నోడల్ ఆఫీసర్ వాసు దేవ్ రావు, ఎంపీపీలు గొండు రఘురాం, అంబటి నిర్మల, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి,  జెడ్పీటీసీ మార్పు సుజాత, రుప్పా దివ్య, ఏఎంసీ చైర్మన్ ముకళ్ళ తాత బాబు,  ఎంపీడీవోలు, ఎంఆర్వో లు, అర్బన్, రూరల్, గార వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షలు సాధు వైకుంఠ రావు, చిట్టి జనార్ధన రావు, పీస గోపి, వార్డు ఇంచర్జ్లు, సర్పంచ్లు, ఎంపిటిసిలు,  అనుబంధ విభాగాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top