శ్రీకాకుళం : ఆత్మవిశ్వాసంతో బతకడమే అసలైన మార్పు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సంక్షేమ ప్రభుత్వం ఇది అని, అంతా ఆశీర్వదించాలని ఆయన కోరారు. సింగుపురం- 2 గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు.. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన కొన్ని స్థానిక సమస్యలను విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త భవనం ఏర్పాటు, ప్రారంభం అన్నవి తనకెంతో ఆనందంగా ఉన్నాయని అన్నారు. మంచి కార్యాలయం ఉండడం వల్ల ప్రజలకే కాకుండా పనిచేసే వారికి కూడా ఓ మంచి వాతావరణంలో ఉండడం వల్ల, ఆయా వ్యక్తుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. ఆ విధంగా ఉండడం వల్ల ఆ అధికారి, ఆ ఉద్యోగి మరింత సమర్థంగా పనిచేయడం సాధ్యం అవుతుందని అన్నారు. ఇంకా మంత్రి ఏమన్నారంటే.. - మన రాజ్యాంగం చెప్పినటువంటి కర్తవ్యాన్ని ఈ ప్రభుత్వం నిర్వర్తిస్తుంది అని మొన్న కూడా ప్లీనరీలో చెప్పాను. - ఈ దేశంలో పౌరులైనందుకు, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరకు పథకాలు ఇస్తున్నాం. - ఐదేళ్ల కాలంలో పేదలకూ, బడుగులకూ సాయం అందించాలన్న సంకల్పంతోనే ఎన్నికల హామీలు ఇచ్చారు. వాటిని నిర్వర్తిస్తున్నారు. - హాయిగా ప్రజలు జీవించేందుకు ఉన్న ఆదేశిక సూత్రాలను మన ప్రభుత్వం అమలు చేస్తోంది. - 30 శాతం మందికి మన రాష్ట్రంలో చదువు లేదు. వారికి విద్యా సంబంధిత సౌకర్యాల లేమి నిన్నమొన్నటి వరకూ వేధించింది. వాటిని దూరం చేసేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. - ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య చదివేంత వరకూ అన్ని రకాల సౌకర్యాలూ ఇస్తున్నాం. నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నాం. అదేవిధంగా నాడు నేడు లో భాగంగా పాఠశాలల రూపురేఖలే మార్చేశాం. విద్యా కానుకలో భాగంగా కాళ్లకు బూట్లు నడుముకు బెల్టు, బ్యాగు, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో సహా ఇలా అన్నింటినీ అందించాం. - అందరూ చదువుకోవాలి ఎందుకంటే ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు అందరికీ దక్కాలి అని భావిస్తూ ఈ ఐదేళ్ల పాలన సాగుతోంది. - పథకాల వెనుక ఉద్దేశం, లక్ష్యం అర్థం చేసుకుని రానున్న కాలంలో ఇదే ప్రభుత్వాన్ని లబ్ధిదారులు ఎన్నుకోవాలి. లేదంటే అసలు పథకాలే వృథా అంటున్న వ్యక్తులు గద్దెనెక్కి ఇప్పటి లక్ష్యాలన్నింటినీ నీరుగారుస్తారు. - ఓటు కోసమే ఇవన్నీ చేస్తున్నాం అని అనుకోవడం కానీ విపక్షాలు ఆ విధంగా ప్రచారం చేయడం కానీ అర్థ రహితం. - ముందు పథకాల నెరవేర్పు వెనుక ఉన్న అసలు లక్ష్యం గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు ప్రజలకు వివరించాలి. అప్పుడు విపక్షాల దుష్ప్రచారం ఆగుతుంది. - జీవించే హక్కు పరిరక్షించేందుకు, ఆత్మగౌరవంతో గడిపేందుకు ఇదొక చక్కని అవకాశం. ఇది కదా మార్పు అంటే.. ! ఆత్మవిశ్వాసంతో బతకడమే సిసలు మార్పు. - గొట్టా బ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథకానికి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాం. దీంతో వేసవిలో కూడా పంటల సాగు సాధ్యం. 3 పంటలకూ అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది వేసవిలో చల్లని నీరు వంశధార నుంచి రావడం ఖాయం. పంటల కాలువలు జలకళలను సంతరించుకోవడం ఖాయం.