అనంతపురం: ``గతంలో బడుగు, బలహీనవర్గాలు కేవలం పాలితులుగానే ఉన్నారు తప్ప, పాలకులుగా లేరు. కానీ, వైయస్ జగన్ ప్రభుత్వంలో నిజమైన సామాజిక న్యాయం జరిగింది. బడుగు, బలహీన వర్గాల వారికి కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారు`` అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సామాజిక న్యాయభేరి వైయస్ఆర్ సీపీ బస్సుయాత్ర అనంతపురంలో ముగిసింది. ఈ సందర్భంగా అనంతలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ``వైయస్ జగన్ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైయస్ జగన్ పాలన కొనసాగింది. మంత్రివర్గంలో 70 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వడమే కాకుండా, కీలకమైన హోం వంటి శాఖలు కూడా వెనుకబడిన వర్గాలకే ఇచ్చారు. అలా ఇవ్వాలంటే ఎంతో ధైర్యం కావాలి. నిజం చెప్పాలంటే ఆ వర్గాల వారు సీఎంగా ఉన్నా, ఆ పని చేసే వారు కారు. పాలనలో సంస్కరణలు అమలు చేస్తున్నప్పుడు, మార్పులు తీసుకొస్తున్నప్పుడు అనేక మంది విమర్శలు చేస్తారు. కానీ ఆ తర్వాత అందరూ వాటిని అంగీకరిస్తారు. సీఎం వైయస్ జగన్ విపక్షనేతగా ఉన్నప్పుడు ఏడాదిన్నరకుపైగా అన్ని వర్గాల వారిని కలిశారు. ఆ స్థాయిలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పుడు ప్రజలను చాలా దగ్గర నుంచి చూశారు. వారి స్థితిగతులను క్షుణ్నంగా పరిశీలించారు. వారి బాధలు స్వయంగా చూశారు. అర్ధం చేసుకున్నారు. అందుకే వారి జీవితాలు మార్చాలని నిర్ణయించారు. ఆ దిశలో సంస్కరణలకు నడుం కట్టారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పారు. సామాజిక న్యాయం అయినా ఏదైనా రాజకీయ అధికారం ద్వారానే సాధ్యమని అన్నారు. అప్పుడు విద్యాపరంగా కూడా ఎదగొచ్చు. అందుకే సీఎం వైయస్ జగన్ ఆ వర్గాల వారికి రాజకీయ అధికారం ఇచ్చారు. పాలనలో భాగస్వాములను చేశారు. అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉండగా, పక్కనే ఉన్న కేరళ మొదటి స్థానంలో ఉంది. అంత దారుణ పరిస్థితులు ఇక్కడ. అంటే గత ప్రభుత్వాలు ఆ దిశలో కృషి చేయలేదు. మన దగ్గర నిరక్షరాస్యులు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలోనే ఉన్నారు. అందుకే వారిని విద్యావంతులను చేయడం కోసం సీఎం వైయస్ జగన్ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. నాడు–నేడులో ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా మార్చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తమ పాలకులను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిలో వారి బలం ఉంది. కాబట్టి ఆట వర్గాలు ఒకటి ఆలోచించాలి. ఎవరికి అధికారం ఇవ్వాలి అని. తమ కోసం ఎంతో చేస్తున్న వైయస్ జగన్‌ని సమర్థించాల్సిన అవసరం ఆ వర్గాలకు ఉంది. మన కోసం పని చేస్తున్న ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన చైతన్యం మనలో లేదా? ఆలోచించాలి. గత ప్రభుత్వం ఏం చేసింది? క్యాపిటల్ సిటీ అని చెప్పి, విజయవాడ దగ్గర ఏర్పాటు చేసి, తమ వర్గం వారికి మేలు చేయాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబు చూశారు. అలాంటి వారికా మళ్లీ అధికారం ఇవ్వాలా? ఒక్కసారి ఆలోచించండి.`` రాష్ట్రంలో తగిన నిష్పత్తిలో అందరికీ అధికారం ఉండాలి. కేవలం ఒక వర్గం పాలకులుగా, మరో వర్గం పాలితులుగా ఉండకూడదు. అలా ఉంటే ఏదో ఒక రోజు ఉద్యమాలు తప్పవు. రాష్ట్రంలో గతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే ఆ సమస్య పరిష్కారం చేశారు. దీంతో గ్రామాల్లో అందరూ ప్రశాంతంగా జీవించగలిగారు. సీఎం వైయస్ జగన్ సమ సమాజ స్థాపన కోసం కృషి చేస్తున్నారు. ప్రతి పని చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. పేదలకు సీఎం డబ్బులు పంచుతున్నారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. అది మీకు ఇష్టం లేకపోతే, ఆ విషయం చెప్పండి. మీరు అధికారంలోకి వస్తే అవన్నీ ఆపేస్తామని చెప్పండి. పేదల పథకాలను అపహాస్యం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సీఎం వైయస్ జగన్ సమాజంలో పేదలకు, బడుగు, బలహీనవర్గాలకు ఒక గౌరవం ఇవ్వాలని నిరంతరం కృషి చేస్తున్నారు. ఏ పథకం కోసం అయినా, ఎవరైనా, ఎవరి దగ్గరికైనా వెళ్లి అడుగుతున్నారా? అలాగే లంచం ఇవ్వాల్సి వస్తోందా?.. లేదు కదా. ప్రతి ఒక్క పథకం అర్హత ఉంటే, నేరుగా ఇంటి గడప వద్దకే వస్తోంది కదా? కులం, మతం, వివక్ష లేకుండా అర్హత ఉంటే నేరుగా పథకంలో డబ్బు ఖాతాలో జమ చేస్తున్నారు. ఆ విధంగా గౌరవంగా అర్హులకు పథకాలు అందిస్తున్నారు. ఇదీ వైయస్ జగన్ పరిపాలన విశిష్టత. పథకం ఇవ్వడం మాత్రమే కాదు. అది గౌరవంగా ఇవ్వడం అనేది ముఖ్యం. అదే సీఎం వైయస్ జగన్ చేస్తున్నారు. మనం ఎవరికి అధికారం ఇవ్వాలనేది ఆలోచించండి. దొంగలకు కీ ఇస్తే మొత్తం దోచుకుంటారు. అదే వైయస్ జగన్‌కి ఇస్తే, మనం మరింత అభివృద్ధి చెందుతాం. బడుగు, బలహీనవర్గాలు ఎంతో బాగు పడతాయి. మనల్ని తప్పుదోవ పట్టించడానికి మీడియాలో కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఆలోచించి ఓటేయాలి.