వంగ‌వీటి రంగా హత్యకు బాబే మూల కారకుడు

పవన్ మాటలు నమ్మి బాబుకు మద్దతిస్తే.. రంగా ఆత్మ క్షోభిస్తుంది

మన పిల్లల్ని పవన్ కల్యాణ్ కు ఎంతదూరంగా ఉంచితే అంత మంచిది

తన స్వార్థం కోసం కాపులను గంపగుత్తగా అమ్మేసే ప్రయత్నం పవన్ చేస్తున్నాడు

గవర్నర్ వద్దకు వెళ్ళి మూడు పెళ్ళిళ్ళ గురించి చెబుతావా..?

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా

కాకినాడ‌: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జరిగిన గర్జన రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ప్రజల ఆకాంక్షను ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి విశాఖకు వెళ్లిన పవన్ రాష్ట్ర  ప్రజల దృష్టిలో మాత్రం ఒక ద్రోహిగా మిగిలిపోయాడన్నారు. పవన్ కల్యాణ్ మాటలు విని ఏ ఒక్క కాపు సోదరుడు అయినా, చంద్రబాబుకు సహకరిస్తే.. వంగనీటి మోహన్ రంగా ఆత్మ క్షోభిస్తుందన్నారు. స్వర్గీయ వంగవీటి రంగా హత్యతో త‌న‌కు సంబంధం లేద‌ని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా..? అని చంద్ర‌బాబును మంత్రి దాడిశెట్టి రాజా ప్ర‌శ్నించారు. కాకినాడ‌లో మంత్రి దాడిశెట్టి రాజా విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

మంత్రి దాడిశెట్టి రాజా ఇంకా ఏమన్నారంటే..
``చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను డైవర్ట్ చేయడానికి పవన్ కల్యాణ్ పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. అమరావతి రియల్ ఎస్టేట్ బ్రోకర్లంతా కలిసి యాత్ర పేరుతో ఊరూరా అమరావతి మేళం వినిపిస్తున్నారు. అమరావతి రాజధాని కావాలనే కదా వారు యాత్ర  చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ అమరావతిని కూడా రాజధాని చేస్తామని చెబుతుంటే వారు ఎందుకు యాత్రలు చేస్తున్నట్టు..?. అమరావతితోపాటు విశాఖ, కర్నూలు రాజధానులుగా ఉంటే వారికొచ్చే నష్టం ఏమిటి..?. కేవలం అమరావతే రాజధానిగా ఉండాలని, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతోపాటు చంద్రబాబు,  పవన్ లు మాట్లాడటం దిగజారుడుతనం కాదా..? 

- రాష్ట్రం అంతా బాగుండాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ కోరుకుంటుంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అమరావతి మాత్రమే బాగుండాలని కోరుకోవడం, దీనికి పవన్ కల్యాణ్ తన వెనుక తిరిగే ఫ్యాన్స్ ఆవేశాన్ని వాడుకుంటూ, ఫ్యాన్స్ ఆవేశాన్ని ప్యాకేజీ కోసం చంద్రబాబుకు అమ్ముకోవడాన్ని ఏమనాలి..?, దీన్ని ఏ రాజకీయం అనాలి..?

వంగవీటి రంగా హత్యతో సంబంధం లేదని చెప్పగలవా బాబూ..?
ఈ సందర్భంగా కాపు అక్కచెల్లమ్మలకు, అన్నదమ్ములకు నాలుగు మాటలు చెప్పదలచుకున్నాను. కాపుల పోరాటంలో పాల్గొని కేసులు పెట్టించుకుని, ఈరోజుకి కూడా నాతోపాటు చాలామంది  కాపు యువత, కాపు నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రశ్నిస్తాను అని 2014లో పవన్ కల్యాణ్, చంద్రబాబు సహకారంతో పార్టీ పెట్టి, ఆ ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించి, గెలిచిన  తర్వాత కాపులను కూరలో కరివేపాకుల్లా పక్కన పెట్టి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో సహా కాపులందరిపై కేసులు పెట్టారు. కాపుల పట్ల చంద్రబాబు ఎంత అహంభావంతో వ్యవహరించారో అంతా చూశారు. ఆకలి కేకలు అంటూ.. కోనసీమలో కాపు అక్కచెల్లెమ్మలు రోడ్ల మీదకు వస్తే.. వారి మీద కేసులు పెడితే.. వైయ‌స్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, ఆ కేసులను తీసివేశారు. 

- చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను..  స్వర్గీయ వంగవీటి రంగా హత్య కేసులో నీకు సంబంధం లేదా.. ?. సంబంధం లేదని నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా.. ?. ముందుగా దీనికి చంద్రబాబు చేత సమాధానం చెప్పించి, ఆ తర్వాతే కాపుల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడాలి. కులాన్ని ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. మూడోసారి కూడా మోసం చేసి, కాపులను గంపగుత్తగా పవన్ కల్యాణ్ అమ్మేసే  ప్రయత్నం చేస్తున్నాడు. 

- పవన్ కల్యాణ్ మాటలు విని, ఏ ఒక్క కాపు సోదరుడు అయినా, చంద్రబాబుకు సహకరిస్తే.. వంగనీటి మోహన్ రంగా ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే, చంద్రబాబే రంగా హత్యకు మూల కారకుడు. 
పవన్ కల్యాణ్ కు ఒక క్యారెక్టర్ గానీ, సిద్ధాంతంగానీ లేదు.  

- తన అవసరానికి కాపులను వాడుకుంటున్నాడు. మొదటిసారి వాడుకుంటే అమాయకత్వం అనుకోవచ్చు.. రెండోసారి, మూడోసారి వాడుకుంటే.. మూర్ఖత్వం అవుతుంది. కాపుల్లోని ప్రతి అక్క చెల్లెమ్మ, అన్నదమ్ములు ఆలోచించాలి. రంగా హత్య తర్వాత, ఎన్ని వందల కేసులను  కాపుల మీద టీడీపీ ప్రభుత్వం పెట్టింది. ఎన్నేళ్ళపాటు కాపు సోదరులు కోర్టుల చుట్టూ తిరిగారు. ఒకరకంగా కాపుల మీద తన శాడిజాన్ని చూపించాడు చంద్రబాబు. 

- ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా.. ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో వైయ‌స్ జగన్ విశాఖ వెళితే ఆయన్ను ఎయిర్ పోర్టులోనే నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆపేసింది.  ఉత్తరాంధ్ర  ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ విశాఖ వెళితే, అక్కడ అలజడులు సృష్టించాలని చూస్తే.. ఆయన్ను మర్యాదగా పోలీసు ఎస్కార్ట్ తో హోటల్ రూమ్ లో దింపారు. ఇదీ టీడీపీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికీ ఉన్న తేడా. 

గవర్నర్ వద్ద మూడు పెళ్ళిళ్ళ గురించి చెబుతావా..?
గవర్నర్ దగ్గరకు వెళ్ళి ఏం చెబుతావ్ పవన్ కల్యాణ్.. ?. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ సంక్షేమ పరిపాలన అమలు చేస్తుండటంతో,  చంద్రబాబుకు రాజకీయంగా దిక్కు లేకపోవడంతో, ఆయన తరఫున తాను అసాంఘిక శక్తిగా ఏర్పడి రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా చేస్తున్నానని చెబుతావా..? ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు బలంగా కోరుకుంటున్న ఆకాంక్ష అయిన వికేంద్రీకరణను అడ్డుకుని, చంద్రబాబు, ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రమే అమరావతి రాజధాని కావాలని గవర్నర్ కు చెబుతావా..? లేక, అయ్యా, నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను.. అదే అందరూ చేయండి అని రాష్ట్ర ప్రజలకు పిలుపును ఇచ్చానని గవర్నర్ కు చెబుతావా..?

పిల్లల్ని పవన్ కల్యాణ్ కు ఎంతదూరంగా ఉంచితే అంత మంచిది
మన పిల్లల్ని.. పవన్ కల్యాణ్ కు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అతను మనల్ని తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర బేరం పెట్టడమే కాకుండా, నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను, మీరు కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకోండి అంటూ తప్పుడు సలహాలు ఇస్తున్నాడు.  కాపులు పవన్ కల్యాణ్ మాయలో పడి.. చంద్రబాబుకు ఓటు వేస్తే.. రంగా ఆత్మ క్షోభిస్తుంది. నేటి యువత కూడా ఒక్కసారి చరిత్ర తెలుసుకోవాలి. చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో షో చేయడానికి వచ్చాడు. ఆయన రాగానే,  అమరావతి రైతుల యాత్రకు విరామం ప్రకటించారు. ఇప్పుడు పవన్ షో ఆగిపోతే.. అమరావతి షో  ప్రారంభం అవుతుంది. ఇదీ వీరి తంతు. ప్యాకేజీ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ ను పవన్ కల్యాణ్ ఎంతోకాలం చేయలేడు. నీవు సెలబ్రిటీవి అని,  ప్రజలు ఒకసారి, రెండుసార్లు నమ్ముతారేమోగానీ, ఇప్పుడు నీ డ్రామాలను నమ్మే పరిస్థితి లేదు. జనసేనను అసలు మేము పార్టీగానే చూడటం లేదు. దానికి గుర్తు ఉందా, గుర్తింపు ఉందా..?. అమాయక పిల్లల్ని రెచ్చగొట్టి, వారు రెచ్చిపోతే.. ఆ మంటల్లో చలి కాచుకుంటున్నాడు పవన్ కల్యాణ్. కాపులు ఆవేశాన్ని ఉపయోగించుకుని, మళ్ళీ కాపులనే ముంచుతున్నాడు పవన్ కల్యాణ్`` అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top