సభలో చంద్రబాబు ప్రవర్తించిన తీరు దుర్మార్గం

చర్చకు ఆటంకం కలిగిస్తూ దుష్ట సంప్రదాయానికి తెరతీశారు

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి

రూల్‌ 77 ప్రకారం బాబుపై చర్యలకు తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన 

అసెంబ్లీ: టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు శాసనసభలో ప్రవర్తించిన తీరు అత్యంత గర్హనీయమని, సభా మర్యాదలు, పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ వెల్‌లో బైఠాయించి సభా నిర్వహణకు ఆటంకం కలిగించిన తీరు దుర్మార్గమని రాష్ట్ర ఆర్థిక శాఖ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రవర్తనను ఖండించారు. రూల్‌ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో బుగ్గన మాట్లాడుతూ.. తుపాన్‌ ప్రభావంపై సభలో చర్చించాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. సలహా ఇవ్వాలనే ఆలోచన లేదు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగాలనే ఆలోచన లేదు. కేవలం వీడియోలు అడ్రస్‌ చేసుకుంటూ వారికి సంబంధించిన మీడియా సంస్థల ద్వారా విపరీతమైన పబ్లిసిటీ చేసుకునేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని మంత్రి బుగ్గన దుయ్యబట్టారు.  

చంద్రబాబు అన్ని రకాల హద్దులు దాటుతూ తన బాడీ లాంగ్వేజ్‌తో అసభ్యకరంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దీన్ని ఇంతటితోనే అరకట్టాల్సిన బాధ్యత ఉందని, సభా మర్యాదలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. రూల్‌ 77 కింద తీర్మానానికి అనుమతించాల్సిందిగా స్పీకర్‌ను అర్జించారు. ‘చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఈ రోజు శాసనసభలో ప్రవర్తించిన తీరు అత్యంత గర్హనీయం, సభా మర్యాదలు, పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ వెల్‌లో బైఠాయించి సభా నిర్వహణకు ఆటంకం కలిగించిన తీరు దుర్మార్గం. అత్యంత ప్రాధాన్య అంశంగా నివర్‌ తుపాన్‌ ప్రభావంపై చర్చకు ఆటంకం కలిగిస్తూ చంద్రబాబు దుష్ట సంప్రదాయానికి తెరతీశారు. అకారణంగా దిగజారుడుగా ఆయన ప్రవర్తించిన తీరును సభ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బాధ్యులైన వారి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి బుగ్గన కోరారు. 

తాజా వీడియోలు

Back to Top