చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారు

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు

పాఠశాలలు మూసివేశారని తప్పుడు ప్రచారం

వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది

కోవిడ్‌ సమయంలోనూ కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయి

ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని బాబు అనుకుంటున్నారు

8 రాష్ట్రాల్లో రాజధానిలో కాకుండా హైకోర్టులు వేరే ప్రాంతాల్లో ఉన్నాయి

రాయలసీమలో కోర్టు పెడతామంటే వద్దంటున్నారు

రాయలసీమకు చంద్రబాబు ఏం మేలు చేశారో చెప్పాలి

అప్పులపైనా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు

చంద్రబాబుతో పోలిస్తే మేం తక్కువ అప్పులే చేశాం

తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు కర్నూలు పర్యటనలో వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. పాఠశాలలు మూసివేశామని, పరిశ్రమలు రాలేదని, ఉద్యోగాలు ఇవ్వడం లేదని, అప్పులు మేం మాత్రమే చేస్తున్నామని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కర్నూలు సభలో చంద్రబాబు చేసిన ఆరోపణలను మంత్రి బుగ్గన తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

 ఎవరిని బెదిరిస్తున్నారు?:
    కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబుగారి వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యకరం. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని తనే చెప్పుకుంటారు. ఈ రెండు రోజుల కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చెప్పింది ఏమిటంటే, తనను గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటాను అని. మరి ఆయనను 2019లో ఓడించారు కదా? మరి ఇప్పుడు ఆయన ఎవరిని బెదిరిస్తున్నారు?
    ఏ రాజకీయ నాయకుడు అయినా ఏం చెబుతారు. తాను గతంలో ఏం చేశాను? మళ్లీ గెలిస్తే ఏం చేస్తాను అనేది చెబుతారు. అప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. నన్ను గెలిపిస్తే రాజకీయాల్లో ఉంటాను అంటే, ఎవరికి నష్టం? తులసీతీర్థం పోస్తే నేను బ్రతుకుతా. కాబట్టి మీరంతా తులసీ తీర్థం పోయాలని చెప్పడం.

పచ్చి అబద్ధాలు. అసత్య ప్రచారాలు:
    చంద్రబాబుగారివి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు. 6 వేల స్కూళ్లు మూత. 4 లక్షల పిల్లలు బడి మానేశారని అన్నారు. అవి పచ్చి అబద్ధాలు. 73 ఏళ్ల వయస్సు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి అలా మాట్లాడొచ్చా?
అంటే తానేం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న అహంకారం. నిజానికి ప్రతి దానికి రికార్డులు ఉంటాయి కదా?
    నిజానికి 2017లో అప్పటి సీఎం చంద్రబాబుగారు 2906 స్కూళ్లు మూయించారు. అందులో 1759 ప్రైమరీ స్కూళ్లు కాగా, మిగిలినవి హైస్కూళ్లు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 42 లక్షల విద్యార్థులు ఉండగా, 2019 నాటికి ఆ సంఖ్య 37 లక్షలకు పడిపోయింది. 2019లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, విద్యా రంగంపై, ప్రభుత్వ స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య మళ్లీ 42 లక్షలకు పెరిగింది.

పారిశ్రామిక రంగం:
    అదే విధంగా తన హయాంలోనే రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చాయని చంద్రబాబు చెప్పుకుంటారు. కానీ వాస్తవాలు చూస్తే..
    చంద్రబాబుగారి గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో భారీ, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే రాగా, కోవిడ్‌ సంక్షోభంలో, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి తలకిందులైన సమయంలో కూడా మా ప్రభుత్వ హయాంలో, పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈ గణాంకాలన్నీ డిపీఐటీ (డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌) చెప్పినవే. ఇదీ వాస్తవం.

ఉద్యోగావకాశాలు:
    ఇక ఉద్యోగాల గురించి కూడా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఆయన తన హయాంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చి, ఆ 5 ఏళ్లలో వాస్తవంగా ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34 వేలు మాత్రమే. అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి 2.10 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వబోతున్నాం. అందులో 6511 పోలీసు శాఖలోనూ, 3673 కోర్టు శాఖలో.
    ఇవే కాకుండా ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు, వలంటీర్లు, ఆప్కాస్‌ ద్వారా ప్రతి నెలా కచ్చితంగా జీతాల చెల్లింపుతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చాం. అప్పట్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వేతనాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది.

కర్నూలు హామీలన్నీ గాలిలోనే..:
    చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఆ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని కర్నూలులో నిర్వహించి ఎన్నెన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు.
    కోయిలకుంట్లలో సిమెంట్‌ ఉత్పత్తుల హబ్, న్యూక్లియర్‌ ఫ్యుయెల్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎఫ్‌సీ), ఆలూరులో జింకల పార్కు, శ్రీశైలంలో పులుల పార్క్, సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లు, రైల్వే వ్యాగన్ల మరమ్మతుల వర్క్‌షాప్‌.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చాడు. వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ వారు, ఇవన్నీ తమ పార్టీ అధినేతను అడగాలి.
    నిజానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే పరిశ్రమలు వచ్చాయి. సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లు వచ్చాయి. అదే విధంగా హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ వచ్చింది. 

మాకు సంస్కారం ఉంది:
    చంద్రబాబు తన హయాంలో రాయలసీమకు కానీ, కర్నూలుకు కానీ చేసిందేమీ లేదు. మొత్తం అన్యాయం తప్ప. నిజానికి రాయలసీమ వాసులు, కర్నూలు జిల్లా వాసులు సంస్కారవంతులు కాబట్టి, చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం లేదు. ఇది వాస్తవం.
    శ్రీబాగ్‌ ఒప్పందం తర్వాత, కర్నూలులో రాజధాని ఏర్పాటైంది. ఆ తర్వాత విశాలాంధ్ర ఏర్పాటు తర్వాత రాజధానిని 1956లో హైదరాబాద్‌కు తరలిస్తే, మా దగ్గర ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. అదే ఇవాళ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే చంద్రబాబు వద్దంటున్నారు. ఉత్తరకోస్తా వెనకబడిన ప్రాంతం కాబట్టి, విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తామంటే కూడా విమర్శలు చేస్తున్నారు. దేశంలో చాలా చోట్ల, 8 చోట్ల హైకోర్టులు రాజధానుల్లో లేవు. 

చంద్రబాబు సిగ్గుపడాలి:
    శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే కూడా అడ్డగిస్తున్నారు. ఇందుకు చంద్రబాబు సిగ్గుపడాలి. ఆయన రాయలసీమలో పుట్టినా, ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించడం లేదు.

మద్యంపైనా అసత్యాలు:
    మద్యం డిస్టిల్లరీలు జగన్‌గారివా? ఇది కూడా పచ్చి అబద్ధం. నిజానికి చంద్రబాబు హయాంలోనే డిస్టిల్లరీలకు అనుమతి ఇచ్చారు. 20 డిస్టిల్లరీల్లో 14 డిస్టిల్లరీలకు చంద్రబాబే అనుమతి ఇచ్చారు. మిగిలినవి అంతకు ముందు నుంచి ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిల్లరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అయినా మా ప్రభుత్వంపై నిందలు వేస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.

మీరు ‘పాలనాయుడు’ అవుతారు:
    డోన్‌ నుంచి నేను అప్పుల మంత్రిని అని పదే పదే విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు. ఏ దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా అప్పులు చేసేది, ఆ ప్రక్రియలో పని చేసేది ఆర్థిక మంత్రి మాత్రమే. దేశంలో ఎవరూ అప్పులు చేయడం లేదా? మీ హయాంలో అప్పులు చేయలేదా?
    నిజానికి మా ప్రభుత్వ హయాంలో అప్పు ఏటా సగటున 15 శాతం మాత్రమే పెరిగింది. అదే మీ హయాంలో అప్పులు ఏటా సగటున 20 శాతం వంతున పెరిగాయి. మరి యనమల రామకృష్ణుడిని పెద్ద అప్పుల మంత్రి అనాలా?
    మీ హయాంలో అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. మీ హయాంలో ఏపీ డైయిరీని నాశనం చేసి, హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకున్నారు. అప్పు చేసిన వారు ఒకవేల అప్పుల మంత్రి అయితే, మీరు పాలనాయుడు అవుతారు. మీరు లేచింది మొదలు అబద్దాలు చెబుతారు కాబట్టి, మిమ్మల్ని అబద్ధాల నాయుడు అనాలి. మీ వయసుకు తగినట్లు మాట్లాడుతున్నారా?
మీకు పాలసీ ఉంటే, దానిపై మాట్లాడండి. 

ఇవాళ మీరెక్కడ ఉంటున్నారు:
    చంద్రబాబు ఎవరి ఇంటికో పోతే, మూడు రోజులకు ఆ ఇంటి ప్రహరీ కూలగొట్టామట. కాబట్టి నా ఇంటిని, నా జీవితాన్ని కూలుస్తానని అన్నాడు. చంద్రబాబుగారు ఏమి మాటిలివి? 14 ఏళ్లు సీఎంగా పని చేసిన నీవు, బహిరంగ సభలో అలా మాట్లాడతావా? ఆర్థిక మంత్రి ఇల్లును, నన్ను కూలుస్తానని అన్నావు.
    అయ్యా చంద్రబాబుగారు మా పూర్వీకులు 100 ఏళ్ల క్రితం, 1923లో మా ముత్తాతగారు కట్టారో, నేను మా ఊళ్లో అదే ఇంట్లో ఉంటున్నాను.
అలాగే 100 ఏళ్ల తర్వాత నాకు సొంత ఇల్లు కూడా లేదు. నేను ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాను. అదే మీరు మీ సొంత ఊరు నారావారిపల్లెలో 1923లో మీ ఇల్లు ఎలా ఉంది? మరి ఈరోజు 100 ఏళ్ల తర్వాత మీరు ఎలాంటి భవనంలో ఉంటున్నారు. అంటే మీకు తెలివి ఎక్కువై, అంత సంపాదించుకున్నారా?
    మీరు మీ సొంత ఊరికి కనీసం ఏడాదికి ఒకసారి అయినా వెళ్తున్నారా? కానీ మేము కుటుంబ సభ్యులు అందరం కలిసే ఉంటున్నాం. అదే 100 ఏళ్ల క్రితం కట్టిన ఇంట్లోనే ఉంటున్నాం.

రోడ్డు ఆక్రమిస్తే కూల్చడం తప్పా?:
    మేము ఎక్కడా ఇళ్లు కూల్చలేదు. డోన్‌లో పట్టణ ప్రణాళిక. 60 అడుగుల రోడ్‌ ఆ ప్రణాళికలో ఉంది. ఆ రోడ్‌లో ఆ లేఅవుట్‌కు సంబంధించిన ఒక ఫిర్యాదు కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు వచ్చింది. 2022, సెప్టెంబరు 22న ఫిర్యాదు వచ్చింది. అది ఏమిటంటే, ఆ 60 అడుగుల రోడ్‌ ఉన్న లేఅవుట్‌లో సెంటర్‌లో ఒక గోడ కట్టారని. 30 అడుగుల రోడ్‌తో ప్లాట్లు వేశారని. దీంతో కుడా అధికారులు ఈ ఏడాది అక్టోబరు 17న ఆ ప్రదేశాన్ని తనిఖీ చేసి, రోడ్డు మధ్య కట్టిన గోడ కూలగొట్టాలని. అక్టోబరు 26న నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత ఆ నోటీసుకు అక్టోబరు 31న డెవలపర్‌ రిప్లై ఇచ్చారు. పాములు, తేళ్లు వస్తున్నాయి కాబట్టి, గోడ కట్టామని. అయితే అది నిబంధనలకు విరుద్ధం కాబట్టి, గోడ కూల్చాల్సిందే అని కుడా అధికారులు మరోసారి ఈ నెల 11న నోటీసు ఇచ్చారు. అయినా గోడను కూల్చకపోవడంతో, మొన్న 15వ తేదీన కుడా అధికారులు ఆ గోడ కూల్చేశారు. 
    దీని తప్పు పట్టిన చంద్రబాబు, నాపై పిచ్చి విమర్శలు చేశారు. నా ఇల్లు కూలుస్తానని, నా జీవితాన్నే కూల్చేస్తానని అన్నారు. ఏమి మాటలివి?
అంటే ఎక్కడ ఆక్రమణలు జరిగినా, చట్ట విరుద్ధంగా ఆక్రమించినా, ఎక్కడ రోడ్లు ఆక్రమించి గోడ కట్టినా, ప్లాట్లు చేసినా ఏమీ అనకూడదు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించినా ఏమీ అనకూడదు. పైగా నీతి సూక్తులు. ఎవరైనా ఇలా మాట్లాడతారా? నీ ఇంటిని కూలుస్తా. నీ జీవితాన్ని కూలుస్తా అంటారా?.

జీవితాలు కూల్చడం ఆయనకు అలవాటు:
    చంద్రబాబుకు జీవితాలు కూల్చడం అలవాటు. తన మామ జీవితాన్ని, బావమరిది హరికృష్ణ జీవితాన్ని కూల్చేశాడు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి. భాష, పద్ధతి మార్చుకోవాలి. మీ వయసుకు తగ్గట్లు వ్యవహరించండి. ఎప్పుడైనా, ఎక్కడైనా నిజాలు మాట్లాడండి. అబద్దాలు మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మబోరు.
ఎంత నిజం ఉంటే అంతే మాట్లాడండి. దాన్నే ప్రజలు చూస్తారు.

ఫ్రస్టేషన్‌లో కూరుకుపోయారు:
    రాజకీయాల్లో హుందాతనం ఉంటుంది. ప్రవర్తన అనేది ఉంటుంది. ఒక పద్ధతి ఉంటుంది. ఆ విధంగా ప్రవర్తించాలి కానీ, 73 ఏళ్ల వయసులో ఏమిటీ మాటలు? నా ఇల్లు కూల్చేస్తానని, నా జీవితాన్ని కూల్చేస్తానని.. ఏమిటా మాటలు? ఆశ్చర్యకరమైన భాష, అంతకు మించి అర్ధం లేని గణాంకాలు.. చంద్రబాబు మాటలు చూస్తుంటే, ఆయన ఫ్రస్టేషన్‌లో కూరుకుపోయినట్లు అనిపిస్తోంది.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top