ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినవన్నీ అక్షర సత్యాలే..

ఆర్థిక‌, అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

ప్రభుత్వం చేసిన లావాదేవీల నిబద్ధతను కాగ్‌ ప్రశ్నించనే లేదు

కేవలం విధానపరమైన అభ్యంతరాలనే కాగ్‌ వ్యక్తం చేసింది

విధానపరమైన జాప్యాలకు మీరు హడావుడిగా ప్రైవేటు వ్యక్తి సారథ్యంలో స్థాపించిన సీఎఫ్‌ఎంఎస్‌ కారణం కాదా?

టీడీపీ వ‌దిలిపెట్టి వెళ్లిన‌ బకాయీలను చెల్లించడం తప్పంటారా?

రాష్ట్ర విభజన, టీడీపీ ఆర్థిక అస్తవ్యస్థ‌ పాలన, కోవిడ్‌ మహమ్మారి వంటి కారణాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తిన్నది.

మా ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ వస్తోంది

శాసనసభను అవమానిస్తున్నందుకు టీడీపీ సభ్యులకే ప్రివిలేజి నోటీసులివ్వాలి

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో వాస్తవాలను పూస గుచ్చినట్లు వివరించార‌ని ఆర్థిక‌, అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. గత టీడీపీ పాలనలో జరిగిందేమిటో.. గత మూడున్నర ఏళ్ల కాలంలో తన పరిపాలనలో ఆర్థిక నిర్వహణ ఎలా జరిగిందో.. జరుగుతున్నదో చక్కగా అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ వివరించారని చెప్పారు. కాగ్‌ తన నివేదికలో 2020–21 సంవత్సరపు ఆర్థిక పరిస్థితిపైనా, అంతకు ముందు 2015–16 నుంచి 2020–21 సంబంధించిన ఆర్థిక అంశాలపైనా వ్యాఖ్యలు చేసిందని మంత్రి బుగ్గ‌న గుర్తుచేశారు. ఈ మేర‌కు మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

కాగ్‌ తన నివేదికలో పొందు పర్చిన అంశాల్లో తొలి నాలుగేళ్ల టీడీపీ పరిపాలనలోని ఆర్థిక వ్యవహారాలపైనే అనే విషయం గ్రహించాలి. ఈ నివేదికలో టీడీపీ పాలనలో జరిగిన ఆర్థిక ఉల్లంఘనలు, అవకతవకలు ఉన్నాయి. టీడీపీ పాలనలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ 17,000 కోట్లు అదనంగా అప్పు చేస్తే దానిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించి తీవ్రంగా తప్పుబట్టింది. టీడీపీ పాలనలో అతిక్రమించి చేసిన అదనపు అప్పులను ఒక కారణంగా చూపి, ఇపుడు మా పాలనలో అప్పులు చేయరాదని నిర్దేశించింది. ఎఫ్‌ఆర్‌బీఎంను ఉల్లంఘించి అప్పులు ఎక్కువగా ఎవరు చేశారనేది ప్రజలు గ్రహించ లేదనుకుంటున్నారా? 

కాగ్‌ నివేదికలో పొందు పర్చిన ప్రత్యేక బిల్లుల అంశం 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదే. ఈ ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌ ప్రభావం ఎంతగా ఉండిందో ప్రజలకు బాగా తెలుసు. ఈ నివేదికలో ప్రధానంగా పేర్కొన్న అంశం లావాదేవీల సర్దుబాట్లకు సంబంధించిన అంశమే. ప్రత్యేక బిల్లులపై ఆర్థిక మంత్రి హోదాలో నేను గతంలోనే సవివరమైన సమాధానం చెప్పాను. 

సీఎఫ్‌ఎంఎస్‌ రిపోర్టింగ్‌ విధానంలో బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లను గుర్తించడం కోసం మాత్రమే ప్రత్యేక బిల్లులు అని పేరు పెట్టడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరుగవని యనమలకి బాగా తెలుసు, కానీ ఆయన మాత్రం దురుద్దేశ్యంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వారిని గందరగోళ పరిచేందుకు లేని పోని అభాండాలు వేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం 2018–19లో ఇదే విధంగా 98,049 బుక్‌ అడ్జస్ట్‌మెంట్స్‌ ట్రాన్సాక్షన్లను ప్రత్యేక బిల్లులుగా చూపింది మర్చిపోయారా? అపుడు ఆర్థిక మంత్రి మీరే కదా.. యనమల ! 

మీరంటున్న రూ 26,839 కోట్ల ప్రత్యేక బిల్లులు నగదు లావాదేవీలు కావు. అవి కేవలం బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ మాత్రమే.   ఈ లావాదేవీల సర్దుబాట్లకు కారణం సీఎఫ్‌ఎంఎస్‌లో సెంట్రలైజ్‌డ్‌ ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌ మాడ్యూల్‌ లేక పోవడమే. ఇదే విషయం నేను అనేక సార్లు చెప్పినా మీరు మళ్లీ మళ్లీ చెప్పిన అబద్ధాలే  చెప్పి ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే అదే నిజమై పోతుందని మీరు భ్రమ పడుతున్నారు. ఇలాంటి అర్థం లేని విమర్శలకు  ఎన్ని సమాధానాలు చెప్పినా ఏం ప్రయోజనం?

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన లావాదేవీల నిబద్ధతను కాగ్‌ ప్రశ్నించనే లేదు. కేవలం విధానపరమైన విషయంలో మాత్రమే వారు అభ్యంతరం లేవ నెత్తారు. ఈ సమస్యలన్నీ కూడా సీఎఫ్‌ఎంస్‌ వ్యవస్థను పటిష్టంగా రూపొందించక పోవడం వల్లనే తలెత్తాయి. ఈ ప్రత్యేక బిల్లుల ప్రక్రియ సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థలో ఉత్పన్నమైన ప్రాథమిక లోపాల వల్లనే  2020–21లో వినియోగించడం జరిగింది. దానిని సరిదిద్ది ,గత 9 నెలలుగా కాగ్‌ సలహాల మేరకు స్పెషల్‌ బిల్లుల విధానం అనేది లేకుండా ‘నిల్‌ అడ్జస్ట్‌మెంట్‌ బిల్లుల’ పద్ధతిలో  జమాఖర్చుల నిర్వహణ జరుగుతోంది.

రూ 9,124.57 కోట్లకు సంబంధించిన  16,688  బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఈ ఎంట్రీలు ఎందుకు చేయాల్సి వచ్చిందో యనమల కాగ్‌ నివేదిక సాకుగా చేసుకుని రాద్ధాంతం చేస్తున్నారు. వాస్తవానికి కాగ్‌కు ఈ విషయంపై వివరణ ఇవ్వడం జరిగింది. ఇందులో రూ 5,454.54 కోట్ల మేరకు 16 ఎంట్రీలు ఎందుకు జరిగాయంటే.... రైతు భరోసా పథకానికి ఆధార్‌కార్డుతో ముడిపడే విధంగా ఉన్న చెల్లింపులు రిజర్వు బ్యాంకుకు సంబంధించిన  ఈ–కుబేర్‌ ద్వారా లబ్దిదారులకు చెల్లించాలని ప్రయత్నించినపుడు ఆ సిస్టమ్‌ పని చేయక లావాదేవీలు రికార్డు అయ్యాయి.   యనమల చెబుతున్నట్లు ఇందులో ఎక్కడా ట్రెజరీ కోడ్‌ ఉల్లంఘన జరుగలేదు. కాగ్‌ తన నివేదికలో కేవలం విధానపరమైన విషయంలో మాత్రమే అభ్యంతరం లేవ నెత్తింది. 

16,672 లావాదేవీల సర్దుబాట్లు ఒక పీడీ ఖాతా నుంచి మరో పీడీ ఖాతాలోకి మార్చేటపుడు తలెత్తిన∙లోపాలు మాత్రమే! ఏపీ ఫైనాన్స్‌ కోడ్‌ 271 (4) ఆర్టికల్‌ ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో ఆయా పీడీ అకౌంట్లలో ఖర్చుకాకుండా మిగిలిన నిధులను ఈ బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్స్‌ ద్వారా ట్రెజరీ అధికారులు నిధులను పూర్తిగా మురిగి పోయేటట్లుగా చేస్తారు.  దీనికి సంబంధించి పదే పదే నేను వివరణలు ఇస్తున్నా టీడీపీ నేతలు, విజ్ఞులైన యనమల ముందు బధిర శంఖారావం  చందంగా మారిపోయిందని చెప్పడానికి చింతిస్తున్నాను. 

కాగ్‌ నివేదికలో రూ 8,891.33 కోట్లు శాంక్షన్‌ ఆర్డర్స్‌ లేకుండా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి డెబిట్‌ అయ్యాయనేది మరో అంశం. ఇందుకు సంబంధించి కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సవివరమైన వివరణను కూడా ఇచ్చింది.  ఏప్రిల్‌ 2020 సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను రీవాలిడేషన్‌ చేయడంలో లావాదేవీల సర్దుబాట్లు జరిగాయి. ఈ లావాదేవీలు చేయడానికి ఏపీ సీఎఫ్‌ఎస్‌ఎస్‌ – సీఈఓకు అధికారం ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో సింగిల్‌ నోడల్‌ ఎకౌంట్‌ (ఎస్‌ఎన్‌ఏ) విధానం అమలులోకి రావడంతో ఈ లావాదేవీలు చేయాల్సిన అవసరం  రాదని స్పష్టం చేస్తున్నాను. 

యనమల.. మీ పాలన పుణ్యమా అని స్థానిక సంస్థలు చాలా కాలంగా డిస్కంలకు (విద్యుత్‌ సంస్థలకు ) కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. ఆ బకాయీలు ఇంచుమించు రూ 5,000 కోట్లకు చేరాయి. ఆ విధంగా డిస్కంలు ఆర్థిక సంక్షోభంలోకి వెళుతున్నాయి.  ఈ బకాయీల వల్ల డిస్కంలు గత్యంతరం లేక స్థానిక సంస్థలకు కరెంటు సరఫరా నిలుపుదల చేస్తున్న తరుణంలో మా ప్రభుత్వం ప్రజల పట్ల జవాబుదారీతనంతో 

వారికి కష్టం కలిగించ కూడదని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వాటి బకాయీలన్నింటినీ 14 వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించింది. కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల్లో ఉన్న ప్రొవిజన్‌నే ఇందుకు వాడుకున్నాం. విద్యుత్‌ సంస్థలకు బకాయీలు చెల్లించకుండా ఉండి  ఇదే విషయంపై కాగ్‌ తీవ్రంగా విమర్శించి ఉండేది.  

స్థానిక సంస్థల కరెంటు బిల్లుల చెల్లింపును కూడా యనమల వెనుకా ముందూ చూసుకోకుండా రాద్ధాంతం చేస్తున్నారు. అయితే మేం తీసుకున్న చర్యలను సమర్థిస్తూ.. అలా చేయడం సబబని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఇటీవల మన ప్రభుత్వానికి లేఖ రాసింది. స్థానిక సంస్థలను కాపాడు కోవడం కోసం, వాటి పరిధిలోని ప్రజలకు కరెంటు కోత లేకుండా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులతో కరెంటు బిల్లులను చెల్లించింది. ఇలాంటి సమస్యలు వివిధ రాష్ట్రాల్లో తలెత్తుతూ ఉండటం వల్ల కచ్చితంగా కరెంటు బిల్లులను క్రమం తప్పకుండా చెల్లించే ఒక మెకానిజమ్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. 
    
2020–21లో అతి తక్కువ వృద్ధి రేటు నమోదైందని కాగ్‌ వెల్లడించినట్లు యనమల చెబుతున్నారు. అయితే ఆ ఆర్థిక సంవత్సరం పూర్తిగా కరోనాతో దేశమంతా అతలాకుతలం అయి ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా చూపిందనే విషయాన్ని యనమల కావాలనే తెలిసి విస్మరించి మాట్లాడుతుండటం సబబేనా?

కాగ్‌ నివేదికలో ద్రవ్యలోటు, రెవెన్యూలోటు మన రాష్ట్రంలో బాగా లేదని, సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. దురదృష్టకరమైన రాష్ట్ర విభజన , అనంతర టీడీపీ ఆర్థిక అస్తవ్యస్త పరిపాలన , కోవిడ్‌ మహమ్మారి విలయతాండవం వంటి కారణాల వల్ల  మన ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిన్నది. అర్థిక పరిస్థితి ఇలా దెబ్బ తిన్నప్పటికీ మా ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ చేస్తూ గతంలో తలెత్తిన ఇబ్బందికరమైన పరిస్థితులను చక్కదిద్దుతూ వస్తోంది. 

అదే మా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ ప్రసంగంలో సవివరంగా వివరించారు. ఇదు సహించలేక టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఏమీ లేనిదానికి అబద్ధాలు చెప్పారని, ప్రివిలేజి నోటీసులు ఇవ్వాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. కాగ్‌ నివేదికలో 2020–21 సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 11 శాతం, రెవెన్యూ లోటు 34 శాతంగా ఉందని పేర్కొంది. 

2020–21 సంవత్సరంలో ఎందుకిలా జరిగిందో... రాష్ట్ర ప్రజలకు తెలియని అంశం కాదు. ఆనాడు కోవిడ్‌ మహామ్మారి దేశవ్యాప్తంగా విజృంభించింది. మన రాష్ట్రంలో కూడా విలయతాండవం చేసింది. రాష్ట్రంలో జనజీవితం అతలాకుతలం అయింది. తత్ఫలితంగా ఆదాయవనరులకు బాగా గండి పడింది. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సుమారు రూ 8 వేల కోట్లు తగ్గింది. కరోనా సమయంలో మహామ్మారి కట్టడికి అదనంగా రూ 7,130 కోట్లు వ్యయం చేసింది. 

రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలందరూ తమ ఇళ్లల్లో నుంచి కదల లేక పోయారు. అంతే కాదు, పేద, మధ్య తరగతి కుటుంబాలు కోవిడ్‌ వల్ల ఉపాధి కోల్పోయి సురక్షితంగా ఉండటానికి తాపత్రయపడ్డారు. ఇలాంటి తరుణంలో వారందరి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. ఓ వైపు ఆదాయవనరులు పడిపోతున్నా... ఏ మాత్రం జంకకుండా సాహసంతో డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ 57,512 కోట్లు జమ చేసి వారిని ఆదుకున్నాం. ఇంత మొత్తంలో ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో జమ చేసిన సందర్భం ఎక్కడా కోవిడ్‌ సమయంలో లేనే లేదు.

ద్రవ్యలోటు 39 నుంచి 59 శాతానికి చేరుకున్నట్లుగా యనమల చెబుతున్న లెక్కలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో తెలియదు. వాస్తవానికి 2021–22 ద్రవ్యలోటు  2018–19 కంటే సుమారు రూ 10,000 కోట్లు తక్కువ. రూ 18,975 కోట్లు మూలధనం వ్యయం చేశామనేది వాస్తవం. అందులో రూ 6,278 కోట్లు ఇళ్ల పట్టాల కోసం చేసిన భూసేకరణపై చేసిన వ్యయం. భూసేకరణ అనేది మీ ప్రభుత్వం మూలధన వ్యయంగా పరిగణించారు కదా!
ఈ విషయం యనమలకి తెలిసినా... లేక తెలిసి విస్మరించినా... రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అంతే కాదు. లబ్ది పొందిన లబ్దిదారులకు ఇంకా బాగా తెలుసునని చెబుతున్నాను. 

సభను ఏకపక్షంగా నిర్వహిస్తున్నామని యనమల విమర్శించడం విడ్డూరంగా ఉంది. యనమల గారూ.... మీకు రాజకీయ భిక్ష పెట్టి , ఒక తండ్రిగా, ఒక గురువుగా చేరదీసి పెద్దమనిషిని చేసిన ఎన్టీ రామారావుకే మీరు స్పీకర్‌గా ఉంటూ  నామం పెట్టిన మహానుభావులు మీరు. ... ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించిన చంద్రబాబు పార్టీకి దొడ్డి దారిన సహకరించిన  అప్రజాస్వామిక వాది మీరు. మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి, చట్ట సభల ఔన్నత్యాన్ని గురించి మాట్లాడే వారే!

దివంగత కోడెల శివప్రసాద్‌రావు స్పీకర్‌ గా ఉన్నప్పుడు  మీరు శాసనసభా వ్యవహారాల మంత్రిగా ఉండి మా సభ్యురాలు ఆర్‌.కే రోజమ్మను నిర్దాక్షిణ్యంగా సంవత్సరం పాటు అసెంబ్లీకి రాకుండా బహిష్కరింప చేసిన అప్రజాస్వామిక వాది మీరు కాదా? ఏడాది పాటు ఒక సభ్యురాలిని సస్పెండ్‌ చేయడం అనేది చట్ట సభలోని ఏ రూల్‌ కింద చేశారో చెప్పగలరా! యనమల గారూ? 

ప్రతి రోజూ వాయిదా తీర్మానాలను ప్రతిపాదించి సభను అడ్డుకోవాలనే సంస్కృతిని ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరు మొదలు పెట్టారో సెలవివ్వగలరా రామకృష్ణుడు గారూ! పోడియంపైకి ఎక్కడం, కాగితాలు చించి స్పీకర్‌ ముఖంపై విసరడం చట్ట సభల ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగించినట్లే నని మీ నాయకుడు చంద్రబాబుకు ఏనాడైనా హితవు చెప్పారా?
    
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన తరువాత, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తరుణంలో... తాము అధికారంలో లేమే! అన్న కడుపు మంటతో ఇలాంటి అప్రజాస్వామిక , వితండ విధానాలను అనుసరించింది మీ నాయకుడు చంద్రబాబు కాదా! అప్పట్లో మీరు సభలో ఒక సీనియర్‌ సభ్యుడుగా ఉంటూ ఏనాడైనా ఇది వలదని మీ నేత చంద్రబాబుకు చెప్పగలిగారా? అని సూటిగా ప్రశ్నిస్తున్నాను.

తాజా వీడియోలు

Back to Top