రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా డబ్బు ఆదా అయితే మంచిది కాదా?

పోలవరంపై ప్రతిపక్షం విమర్శలకు మంత్రి బుగ్గన కౌంటర్‌

కమీషన్ల కోసమే టీడీపీ ఎక్కువ అంచనాలతో పోలవరం పనుల అప్పగింత

గతంలో చంద్రబాబు ప్రశంసించిన సంస్థకే ఇప్పుడు పోలవరం పనులు

రాష్ట్రాన్ని చంద్రబాబు  అప్పులపాలు చేశారు

 చంద్రబాబు తరచుగా నోరు జారుతున్నారు

హైదరాబాద్‌: రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా డబ్బు ఆదా అయితే మంచిది కాదా? అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రశ్నించారు. ప్రజాధనం ఆదా అవుతుంటే సంతోషించాల్సింది పోయి విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు. పోలవరంపై ప్రతిపక్షం విమర్శలకు బుగ్గన కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు ఏమాత్రం మారలేదని, అతని బోధలు మారలేదని సినిమా పాటను వినిపించారు. హైదరాబాద్‌లో మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు.  పోలవరంకు కొత్త ఏజెన్సీ ఎలా వచ్చిందని, ఇదే ఏజెన్సీ ఎల్‌2లో ఉన్నారని, అప్పుడు చేయనిది ఇప్పుడేందుకు చేస్తున్నారని, కాళేశ్వరంలో ఇదే ఏజెన్సీ ఎక్కువ రేట్లకు చేస్తుందని, పోలవరంలో ఎలా చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారని గుర్తు చేశారు. సేప్టీ యాక్సేప్ట్‌ చేశారా అని మమ్మల్ని ప్రశ్నించారని తెలిపారు. 2014 నుంచి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను రకరకాలుగా మార్చుకుంటూ వచ్చారన్నారు. పాతరేట్‌ కంటే తక్కువ రేటుకు రివర్స్‌ టెండరింగ్‌లో వైయస్‌ జగన్‌ పోలవరాన్ని చేపడుతుంటంతో చంద్రబాబు అక్కుసతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నాడు పోలవరం నుంచి నీళ్లు తెస్తున్నామని, ఎక్కడ చూసినా పసుపు పచ్చ నీళ్లు చల్లారని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో పట్టిసీమ చేపట్టిన వాళ్లే ఇవాళ పోలవరాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ఇదే ఏజెన్సీకి 14 శాతం అదనంగా ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ పారదర్శకంగా రివర్స్‌ టెండరింగ్‌తో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు ప్రశంసించిన సంస్థకే పోలవరం పనులు అప్పగించామన్నారు.

చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చే సంపద అంతా కూడా రెవెన్యూ రూపంలోనే ఉంటుందన్నారు. 2014-15 ఓన్‌ ట్యాక్స్‌ రూ.42,618 కోట్లు, ఆ తరువాత ఏడాది 39 వేల కోట్లు, 2016లో 44 వేల కోట్లు, జీఎస్టీ వచ్చిన తరువాత 2017లో 49 వేల కోట్లు పెరిగిందన్నారు.  చంద్రబాబు దిగిపోయేసమయంలో రూ.43 వేల పెండింగ్‌ బిల్లులు పెట్టారన్నారు. సివిల్‌ సప్లైయింగ్‌లో రూ.20 వేల కోట్లు అప్పులు చేశారన్నారు. ఎక్కడికి వెళ్లు బకాయిలే ఉన్నాయన్నారు. సూదికి, దూదికి బిల్లులు పెండింగే పెట్టారన్నారు. ఆశావర్కర్లు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా చంద్రబాబు దిగిపోయారన్నారు. మన అభివృద్ధి లక్ష్యాల్లో పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, చదువులు, ఆడవాళ్లకు, మగవాళ్లకు సమానత్వం, తాగునీరువంటి 17 లక్ష్యాలు ఉంటాయన్నారు. టాప్‌ ఐదు రాష్ట్రాల్లో ఒక్క అంశంలో మాత్రమే ఏపీ టాప్‌లో ఉందన్నారు. చింతమనేని అరాచకాలు అప్పుడే మరిచిపోయారా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మద్యంపాన నిషేదం దిశగా అడుగులు వేస్తున్నారని లిక్కర్‌ ధరల పెంపుపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని తప్పుపట్టారు. 4380 మద్యం దుకాణాలకు గాను 3 వేలకు తగ్గించామని తెలిపారు. పర్మిట్‌ రూమ్‌లను ఎత్తేశామని తెలిపారు. దాదాపు 16 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయని చెప్పారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. 1990 ముందర ఇంగ్లీష్‌ కాలేజీలు లేవా అని ప్రశ్నించారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ను ఇంగ్లీష్‌ మీడియం చేయడంతో ప్రతిపక్ష నాయకులకు కడుపు మండిందన్నారు. వారి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారని ప్రశ్నించారు. చంద్రబాబు తానే ఇంగ్లీష్‌ నేర్పించానని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.  చంద్రబాబే అందరికి ఇంగ్లీష్‌ నేర్పించారని ఎద్దేవా చేశారు. లోకేష్‌, దేవినేని ఉమా, చింతమనేని, బుద్ద వెంకన్నలకు ఇంగ్లీష్‌ నేర్పించాలని సూచించారు. రంగులు వేసేది నేర్పించింది మీరు కాదా చంద్రబాబు అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో బడికి, గుడికి పచ్చ రంగు వేసింది మీరు కాదా అన్నారు. రూ.10 వేలు ఎలక్ర్టానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసినా ఓట్లు వేయకుండా రూ. 1000 ఇచ్చిన వారికి ఓట్లు వేశారని చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎకానమిస్టు, విజనరీ అంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. నీరు- చెట్టు పేరుతో వేల కోట్ల కొల్లగొట్టారని, ఈ పనులపై విచారణ కొనసాగుతుందన్నారు. 

Read Also: సీఎం జగన్ కొత్త 'కాన్సెప్ట్' ఇదే

Back to Top