చంద్ర‌బాబు హ‌డావుడి ఒప్పందంతో రాష్ట్రానికి న‌ష్టం

పోల‌వ‌రం మారిన అంచనాలకు తగ్గట్లుగా కేంద్రం ఆర్దిక సహాయం అందిస్తుందనే నమ్మకం ఉంది

దీర్ఘకాలిక ఫలితాల కోసం, సమగ్ర ఆలోచనలతో ప్రభుత్వ పాఠశాలల పునరుద్దరణ

మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

అమ‌రావ‌తి: చ‌ంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి ఉన్న స‌మ‌యంలో కేంద్రంతో హ‌డావుడిగా ఒప్పందాలు చేసుకోవ‌డంతో రాష్ట్రానికి భారీ న‌ష్టం క‌లిగింద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి పేర్కొన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం అనాలోచితంగా, పర్యవసానాలు, రాష్ట్రానికి కలిగే ఆర్ధిక భారం అంచనావేసుకోకుండా హడావుడిగా చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్రానికి చాలా నష్టం కలిగింద‌న్నారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  పోలవరం నిర్వాసితులు గతంలో 25 వేల కుటుంబాలు కాగా, ఇప్పుడది లక్ష కుటుంబాలయ్యాయని అన్నారు. ప్రారంభంలో లక్ష ఎకరాలు భూసేకరణ అని అనుకుంటే, అది లక్షన్నర ఎకరాలయ్యాయు. ఆ పరిహారం పెద్ద ఎత్తున పెరిగిందని పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం, గత చంద్రబాబు ప్రభుత్వం అన్నిటికి ఒప్పుకుంది. ఇది రాష్ట్రానికి మోయలేని భారమని అన్నారు.  ప్రాజెక్టు అంచనాలు కూడా 2013-14 ఆర్దిక సంవత్సరం లోని ధరల ఆధారంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలు బాగా పెరిగాయని అన్నారు. వాస్తవమైన ఈ అంశాలను కేంద్రం అవగతం చేసుకుందని,  ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చేస్తున్న వాదనలో వాస్తవాన్ని కేంద్రం కూడా గుర్తించింది, అర్ధం చేసుకుందని అన్నారు. మా ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలతాలిస్తాయన్న ఆయన పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన మారిన అంచనాలకు తగ్గట్లుగా కేంద్రం ఆర్దిక సహాయం అందిస్తుందనే నమ్మకం ఉందని ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన అన్నారు. 

అత్యుత్త‌మ రోడ్లు వేస్తాం..

దీర్ఘకాలిక ఫలితాల కోసం, సమగ్ర ఆలోచనలతో ప్రభుత్వ పాఠశాలల పునరుద్దరణ, మంచి విద్యను అందించే ప్రయత్నం చేస్తోంద‌ని మంత్రి బుగ్గ‌న్న అన్నారు.  బాలబాలికలు మంచి ఆరోగ్యంతో, బాగా చదువుకుంటే, అదే సంపదను సృష్టిస్తుందన్న ఆయన గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతి అభివధ్ది కోసమంటూ బడ్జెట్ లో రూ. 5 వేల కోట్లు కేటాయించి, రూ. 50 వేల కోట్ల కు టెండర్లు పిలవడం ఏమిటి..!? అని ప్రశ్నించారు. చంద్రబాబు కాగితాల పై చూపించిన మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలో రోడ్లు వేయలేమేమో కాని, విజయవాడ, గుంటూరు, పరిసర ప్రాంతాలలో అత్యత్తుమ రోడ్లు వేస్తామని అయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్న వాదనలు కూడా సరైనవి కావని అన్నారు.  

గ‌త ప్ర‌భుత్వ బ‌కాయిలు మా ప్ర‌భుత్వం చెల్లిస్తోంది..

గ‌త ప్ర‌భుత్వం పెట్టిన బ‌కాయిలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ చెల్లిస్తోంద‌ని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి తెలిపారు. అమరావతి కి లక్ష కోట్లు కావాలి...! అంత డబ్బు ఎక్కడుంది...!? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన బకాయిలను, నెమ్మదిగా చెల్లిస్తామన్న ఆయన అన్ని అప్పులు చేసి, “పసుపు-కుంకుమ” పేరుతో ఎన్నికల ముందు గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు విపరీత భారాన్ని రాష్ట్రం పై మోపారని అన్నారు. ఏ ప్రాంత ప్రజలు తమను నిర్లక్ష్యం చేశారనే భావనకు లోనుకాకూడదన్నదే ముఖ్యమంత్రి ఆలోచనన్న ఆయన మూడు రాజధానుల ఆలోచనను అర్ధం చేసుకోవడంలోనే చిన్న గందరగోళం ఉందని, పాలనా సౌలభ్యం కోసమే మూడు ప్రాంతాలకు సమ ప్రధాన్యత ఇస్తున్నామని అన్నారు. 90 ఏళ్ల రాయలసీమ ప్రజల ఆకాంక్ష, భావనలకు కార్యరూపమే, కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేసామని బుగ్గ‌న అన్నారు. 
 

Back to Top