ఏపీలో కరోనా తగ్గుముఖం

రోజు రోజుకు డిచార్జ్‌ అయ్యే సంఖ్య పెరుగుతోంది

కరోనా టెస్టుల్లో దేశంలో ఏపీనే నంబర్‌ వన్‌

మిలియన్‌ జనాభాకు 1919 మందికి పరీక్షలు

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నట్లు ఎల్లో మీడియా దుష్ర్పచారం

విపత్కర పరిస్థితిలో టీడీపీ నేతలు ఎలాంటి సహాయం చేయడం లేదు

కరోనా విషయంలో సీఎం వైయస్‌ జగన్‌ చెప్పింది అక్షరసత్యం

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే ఏపీలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తూ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని తెలిపారు. కరోనా పరీక్షలను బట్టి పాజిటివ్‌ కేసులు చూడాల్సి ఉంటుందని, రోజు రోజుకు కరోనా పేషెంట్లు డిచార్జ్‌ అయ్యే సంఖ్య పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మంత్రి బుగ్గన చెప్పారు. ప్రతిరోజు కరోనాపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షలు నిర్వహిస్తూ కరోనాను కట్టడి చేస్తున్నారన్నారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందే అంటూ డబ్ల్యూహెచ్‌వో పేర్కొందని, సీఎం వైయస్‌ జగన్‌ చెప్పింది అక్షర సత్యమన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం యంత్రాంగం అహర్నిషలు శ్రమిస్తోందన్నారు. ఒక యుద్ధం మాదిరిగా కరోనా రోగులను యంత్రాంగం గుర్తిస్తూ..వారికి పరీక్షలు చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. మిలియన్‌ జనాభాకు 1919 మందికి కరోనా పరీక్షలు చేస్తున్నామన్నారు. పాజిటివ్‌ కేసులను చేసే పరీక్షలను బట్టి చూడాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,02,460 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. ఇందులో 1463 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయన్నారు. ఇప్పటి వరకు 423 మంది డిచార్జ్‌ అయినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 33 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారని తెలిపారు. చనిపోయిన వారంతా కూడా ఎక్కువ వయసు ఉన్న వారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారే అన్నారు. వివిధ రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో మరణాల సంఖ్య 1.4 శాతమే అన్నారు. రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొన్ని కారణాల వల్ల పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిందని, ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. కర్నూలులో 4.08 శాతం, గుంటూరులో 4.03 శాతం, కృష్ణా జిల్లాలో 4.23 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.  గడిచిన 24 గంటల్లో 60 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు మంత్రి బుగ్గన వివరించారు.

ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి బుగ్గన ధ్వజమెత్తారు. ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని, దీనివల్ల వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నామన్నారు. రాష్ట్రంలో 9 ల్యాబ్‌లు, 19 మిషన్ల ద్వారా కరోనా పరీక్షలు చేస్తున్నామని, ప్రతి రోజు 1900 మందికి పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. 9717 మంది పరీక్షల్లో పాల్గొంటున్నారని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, గ్రామ వాలంటీర్లు నిరంతరం శ్రమిస్తున్నారు కాబట్టే రోజు రోజుకు డిచార్జ్‌ అయ్యే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1026 మంది యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో 7.7 శాతం పాజిటివ్‌ కేసులు, 4.3 శాతం మరణాలు ఉన్నాయని, గుజరాత్‌లో 6.8 కేసులు, 4.8 శాతం మరణాలు ఉన్నాయన్నారు. ఏపీలో 1.4 శాతం పాజిటివ్‌ కేసులు, 2.01 శాతం మరణాలు ఉన్నాయని, సెకండరీ కాంటాక్ట్‌ నుంచి 1 శాతం మాత్రమే వైరస్‌ వ్యాప్తి చెందినట్లు  బుగ్గన వివరించారు. ప్రతిపక్షాలు ప్రజల్లో భయాందోళన కలిగించేలా వ్యవహరిస్తున్నాయని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం, వైయస్‌ఆర్‌సీపీ నేతలు, పలువురు దాతలు పేదలకు సహాయం చేస్తుంటే టీడీపీ నేతలు ఎక్కడా కూడా సహాయం చేసినట్లు లేదని విమర్శించారు. చంద్రబాబు హైదరాబాద్‌లోని ఇంద్రభవనంలో దాక్కొని ఎవరికి ఉపయోగం లేని లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి వల్లే రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top