ప్రజా సంక్షేమానికి పెద్దపీట

గతేడాది కంటే ఈఏడాది బడ్జెట్‌లో సంక్షేమానికి అధిక కేటాయింపులు

సీఎం వైయస్‌ జగన్‌ ప్రేరణ అందరికీ గర్వకారణం

కోవిడ్‌పై మనప్రభుత్వ పోరాటాన్ని బ్రిటీష్‌ హైకమిషన్‌ ప్రశంసించింది

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్, వలంటీర్ల సేవలు అభినందనీయం

బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

 

అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో సంక్షేమానికి అత్యధిక కేటాయింపులు చేసింది. అసెంబ్లీ సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 13,840.44 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు.. ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు.. కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు.. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు.. శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్ల చెప్పున కేటాయించింది.  

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ..

‘కోవిడ్‌ మహమ్మారి ఇంకా ఉనికిలో ఉన్నందున ఈ క్లిష్ట సమయాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యసాధనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఏ విధమైన ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే అసమాన వ్యక్తిత్వం కలిగిన నాయకులు పురాతన కాలం నుంచి మనకు తారసపడుతూనే ఉన్నారు. వారి ఆలోచన విధానం.. గౌరవం కోల్పోయిన జీవితం జీవితమే కాదు, మాట నిలబెట్టుకోని మనిషి.. మనిషే కాదు.. జీవితంలో ప్రప్రథమంగా గుర్తుంచుకోవాల్సినవి జాతి గౌరవం, దేశ కీర్తిప్రతిష్టలు. ఈ ఆలోచనతోనే నేను ఎల్లప్పుడూ ఉంటాను. లాభనష్టాల గురించి ఆలోచన లేదు.

పైకి ఎదగడం, అంచనాలను అధిగమించడం, వజ్ర సంకల్పం, ధృడ నిశ్చయంతో అపారమైన సవాళ్లను ఎదుర్కోవడం మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లక్షణాలు. స్పష్టమైన దృష్టి, సున్నితమైన ప్రవర్తన, సంక్షేమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ఉన్న నమ్మకం, ప్రజాప్రతినిధులకు సీఎం ఇచ్చే ప్రేరణ అందరికీ గర్వకారం.

ఒకవైపు ప్రజల ప్రాణాలు కాపాడటం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా సమతూల్యం చేయడం మన ప్రభుత్వానికి పరీక్ష సమయాలుగా నిలిచాయి. కోవిడ్‌పై పోరాటానికి గుర్తింపు పరీక్ష, చికిత్స విధానాన్ని బాధ్యతగా తీసుకొని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి మన ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రేజ్, టెస్ట్, ట్రీట్‌పై బ్రిటీష్‌ హైకమిషన్‌ ప్రశంసలు కురిపించింది. ఈ కార్యక్రమంలో వైద్యం, పురపాలక, పంచాయతీ రాజ్‌ విభాగాల నుంచి పెద్ద సంఖ్యలో ముందువరుసలో ఉండే ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వైద్యులు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందితో పాటు గ్రామ, వార్డు వలంటీర్లు, ఇతర సిబ్బంది పాల్గొనడం అపూర్వమైన విషయం’ అని అన్నారు.

2021-22 బ‌డ్జెట్‌లో ``రైతు సంక్షేమం``

మేఘం సముద్రాన్ని ఆశ్రయించి నీరు నింపుకుంటుంది. మంచి నీటిని వర్షిస్తుంది. ప్రాణుల దాహార్తిని తీరుస్తుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు అన్నదాతలకు అమితానందం కలిగించే ఓ వర్షించే మేఘం లాంటివారు. రైతుల మొహాల్లో సంతోషం వెలిగించే ఓ తొలకరి చినుకువంటివారు. ఎన్ని కష్టాల్లో చిక్కుకున్నా మంచివాడి స్వభావం మారదు. స్థిరంగా ఉంటుంది. కర్పూరాన్ని మండించినా అది సువాసనలే వెదజల్లుతుంది. అదే విధంగా అన్నదాతకు అన్నీ తానై, వారికి అడుగడుగునా అండగా ఉంటూ మన ముఖ్యమంత్రిగారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం రైతు బాంధవ ప్రభుత్వంగా ముందుకు సాగుతోంది. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అన్నం పెట్టే రైతన్నకు తోడ్పాటుగా నిలిచి భూమిపుత్రుల రుణం తీర్చుకుంటున్నాం.

వై.యస్.ఆర్. రైతు భరోసా - ప్రధానమంత్రి కిసాన్ యోజన
2020-21 సం||లో రూ.13,500 చొప్పున రైతులకు మాత్రమే కాకుండా, కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతులకు (R.O.F.R.) కూడా పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చును. మన ప్రభుత్వం 1 లక్ష 54 వేల కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతుల (R.O.F.R.) కుటుంబాలతో కలుపుకొని మొత్తం 51 లక్షల 50 వేల అర్హత గల రైతు కుటుంబాలకు 6,928 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందచేసింది. డా|| వై.యస్.ఆర్. రైతు భరోసా - ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 2021-22లో 7,400 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందజేయడానికి ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. ఉచిత పంటల బీమా
రైతులపై ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఉచిత పంట బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈ పంట బీమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంచే చెల్లించబడుతుంది. ఖరీఫ్ 2020కి సంబంధించిన బీమాను త్వరలోనే చెల్లిస్తామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బీమా చెల్లింపులను ఇంత వేగంగా చెల్లించడం మరియు నేరుగా రైతుల ఖాతాలలోకి జమచేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే ప్రథమం. డా॥ వై.యస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకానికి 2021 22 సంవత్సరానికి 1802 కోట్ల 82 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అర్హతగల అందరు రైతులకు బీమా సదుపాయాలు అందించుటకొరకు ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ (A.P.GI.C.) అనే ప్రభుత్వ కంపెనీని స్థాపిస్తున్నాం.

వై.యస్.ఆర్. సున్న వడ్డి పంట రుణాలు
14. బ్యాంకులకు విడుదల చేయడానికి బదులుగా అర్హతగల రైతుల బ్యాంకు ఖాతాలలోనే వడ్డీ రాయితీ మొత్తాన్ని పారదర్శకంగా మన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా జమచేస్తోంది. 2014-15 నుంచి 2018-19 వరకు చెల్లించవలసి ఉన్న బకాయిలను 51 లక్షల 84 వేల రైతుల ఖాతాలలోకి రూ. 688 కోట్లు జమ అయ్యేటట్లుగా మన ప్రభుత్వం చెల్లించింది. 2021-22 సం|| కోసం, వై.యస్.ఆర్. సున్న వడ్డీ పంట రుణాలకై రూ.500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

డాక్టర్ వై.యస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు
ప్రభుత్వం 10,544 గ్రామీణ మరియు 234 పట్టణ డాక్టర్ వై.యస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి సమీకృత వ్యవసాయ పెట్టుబడి (ఇన్-ఫుట్) కేంద్రాలు మరియు రైతు విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. డాక్టర్ వై.యస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ మరియు ఉద్యాన వన పంట ఉత్పత్తుల సేకరణ కేంద్రాలుగా కూడా మన ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం, 2020-ఖరీఫ్ సమయంలో రైతు భరోసా కేంద్రాల స్థాయిలో 4000 సేకరణ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. రైతుల రవాణా ఖర్చును ఆదా చేస్తూ గ్రామ స్థాయిలోనే కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

మన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, రూ.5,806 కోట్ల విలువైన 6.46 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ వస్తువులను సేకరించడం జరిగింది. ఇందులో | లాక్ డౌన్ వ్యవధిలోనే 2, 582 కోట్ల విలువైన సేకరణ జరిగింది. ఈ సేకరణ రైతులకు సకాలంలో సహాయాన్ని అందించేందుకు మరియు రైతుల సంక్షేమానికి మన ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణ అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తులలో మార్కెట్ జోక్యం కోసం 3,000 కోట్ల రూపాయలతో 'ధరల స్థిరీకరణ నిధిని' ఏర్పాటు చేసింది. 2021-22 సంవత్సరానికి ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసమై రూ.500 కోట్లు ప్రతిపాదిస్తున్నాను.

డాక్టర్ వై.యస్.ఆర్. వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్స్
రైతుల పరిసర ప్రాంతాలలో నాణ్యమైన పరీక్షా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో 147 ప్రయోగశాలలు, జిల్లా స్థాయిలో 11 ప్రయోగశాలలు, 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సమీకృత ప్రయోగశాలలు నాణ్యమైన పెట్టుబడి (ఇన్-పుట్ల) లభ్యతను నిర్ధారిస్తాయి మరియు తద్వారా పంట ఉత్పాదకతను పెంచడంలో సహాయపడతాయి. ఈ ప్రయోగశాలలు 2021 ఖరీఫ్ చివరి నాటికి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. నేను డాక్టర్ వై.యస్.ఆర్. వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్స్ స్థాపన మరియు పనితీరు కొరకు 2021-22 సం॥కి గాను 88.57 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వ్యవసాయ యాంత్రీకరణ
రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు, రైతు భరోసా కేంద్రాలు స్థాయిలో ఫామ్ గేట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలుగల సదుపాయ కేంద్రాలు (M.P.F.C.) అనే భావనను తీసుకువచ్చింది. గ్రామ స్థాయిలో 10,246 కస్టమ్ నియామక కేంద్రాలు, నియోజకవర్గ స్థాయిలో 151 హైటెక్ హై వాల్యూ ఫార్మ్ మెషినరీ హబ్ ఏర్పాటు చురుకైన పురోగతితో కొనసాగుతున్నాయి. వ్యక్తిగత పనిముట్లు, నీడ్ బేస్డ్ సి. హెచ్.సి.లు, కంబైన్డ్ హార్వెస్టర్లు, ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ యూనిట్ల విలువలు పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణా కేంద్రం (A.M.T.C.) ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడమైనది. వ్యవసాయ యాంత్రీకరణకు 2021-22 సం॥కి గాను 739.46 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పశుగణాభివృద్ధి, పాడి, మ‌త్స్య పరిశ్రమ

పాడిపరిశ్రమ అనగానే 'మిల్మన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ వర్గీస్ కురియన్ గారి అమూల్య మాట‌లు గుర్తుకు వస్తాయి.

"అమూల్ అంటే ఏమిటి. ఇది ఖచ్చితంగా పాల గురించి మాత్రమే కాదు. మన గ్రామీణ వ్యవస్థలోని సామాజిక మరియు ఆర్థిక మార్పులకు ఇది వేగంగా మార్పు అందించేఒక సాధనం. మన రైతులు వారి స్వంత అభివృద్ధిలో పాలుపంచుకునే కార్యక్రమంగా ఇది వృద్ధి చెందింది. త్రిభువన్ దాస్ గారి తోనూ మరియు కైరా జిల్లా రైతులతోనూ సంవత్సరాల తరబడి కలిసి పనిచేసిన సమయంలోనే ఈ విషయం తెలుసుకున్నాను. నిజమైన అభివృద్ధి అంటే ఆవులు, గేదెలు మొదలగు వాటి అభివృద్ధి కాదు, మహిళలు మరియు పురుషుల అభివృద్ధి, అభివృద్ధి సాధనాలను వారి అందుబాటులో ఉంచలేనంత వరకు, అటువంటి అభివృద్ధిలో వారిని భాగస్వాములుగా చేయలేనంత వరకు, నియంత్రణ పూర్తిగా వారి చేతుల్లోనే ఉండే విధంగా వ్యవస్థ సృష్టించ బడలేనంత వరకు మహిళల మరియు పురుషులు అభివృద్ధి సాధ్యం కాదు. అందువల్ల మంచి ప్రభుత్వం అందించ గలిగే మంచి పాలన ఏమిటి? ఏ ప్రభుత్వమైనా పరిపాలించడం తగ్గించుకొని, దీనికి బదులుగా ప్రజల శక్తి సామర్థ్యాలను సమీకరించే మార్గాలను అన్వేషించాలి".

1946 లో కేవలం రెండు డబ్బాల పాలు మరియు కొన్ని పాల ఉత్పత్తిదారులతో ప్రారంభమైన అమూల్, ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ రోజు దేశవ్యాప్తంగా 1 లక్ష 86 వేల పాల సహకార సంఘాలలో 1 కోటి, 66 లక్షల పాల ఉత్పత్తిదారులు ఉన్నారు.

డాక్టర్ వర్గీస్ కురియన్ నేతృత్వంలో జరిగిన క్షీర విప్లవం నుండి స్ఫూర్తిదాయకమైన పాఠాలను నేర్చుకోవడంలో భాగంగా, పాల సహకార సంస్థల పునరుజ్జీవనం మరియు పాల రంగాన్ని బలోపేతం చేయడానికి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమూల్ ప్రాజెక్టు'ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లోని పాల ఉత్పత్తిదారులు సామాజిక-ఆర్థిక అభివృద్ధే కాకుండా, రాష్ట్రంలోని మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించడం, పాల ఉత్పత్తిదారులకు తగిన నగదు ప్రోత్సాహం ఇవ్వడం, వినియోగదారులకు ధరకు తగిన నాణ్యమైన పాలు మరియు పాల ఉత్పత్తులను లభించేటట్టు చేయడం మొదలగునవి. ఈ ప్రాజెక్టు లక్ష్యం. అంతేగాక 27 లక్షల మంది మహిళా రైతులను భాగస్వామ్యం చేయడం మరియు రోజుకు 2 కోట్ల లీటర్ల పాలను సేకరించడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. 9,899 మహిళా పాల సహకార సంఘాల నిర్వహణలో బాధ్యతను పంచుకొనడం మరియు తగిన ధరతోపాటు ఆర్థిక అభివృద్ధిని అందుకొనడమే లక్ష్యంగా, వారికి పాల నాణ్యత మరియు పారదర్శకతను నిర్ధారించే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ (AM CU) మరియు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ (BMCU) లను కలిగి యున్న భవనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విప్లవం ఇప్పటికే 700 గ్రామాల్లో ప్రారంభమైంది మరియు మహిళా పాల ఉత్పత్తిదారులు, రైతులు లీటరు పాలకు రూ.5 నుంచి రూ.17 వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.

జగనన్న జీవక్రాంతి
21. రాష్ట్రవ్యాప్తంగా 2,19,151 గొర్రెల/మేకల యూనిట్ల పంపిణీ కోసం రూ.1,869 కోట్లతో జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం యొక్క లబ్దిదారులకు వై.యస్.ఆర్. చేయూత క్రింద పశువుల సేకరణ, రవాణా మరియు బీమా ప్రీమియం కోసమై 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయబడుతున్నది.

పశువుల రంగం నిరంతరమైన మరియు ఆటంకంలేని ఆదాయాన్ని సృష్టిస్తుంది. మరియు వ్యవసాయ సంబంధిత పేద వర్గానికి జీవనోపాధిని అందిస్తుంది కూడా. వై.యస్.ఆర్. పశువుల నష్టపరిహార పథకం ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమంగా కొనసాగుతుంది. ఈ పథకం ప్రకారం మేలురకం స్వదేశీ జాతి పశువు ఒకదానికి రూ. 30,000లు చొప్పున, సాధారణ జాతి గేదెలు మొదలైన పశుసంపదకు ఒకడానికి రూ.15,000 లు చొప్పున మరియు ఒక్కొక్క గొర్రె లేదా మేకకు రూ. 6,000లు చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించబడుతుంది. పశువుల నష్ట పరిహార నిధి కోసమై 2021-22 సంవత్సరానికి 50 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

మత్స్య రంగం
దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో మన రాష్ట్రం 46.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. భారత దేశం మొత్తం ఉత్పత్తిలో మన రాష్ట్రం వాటా 29.4% గా ఉంది. దేశంలోని మొత్తం రొయ్యల సా గులో మన రాష్ట్రం 5.12 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 68.5% గా ఉంది. 2019-20లో దేశం నుండి 46,663 కోట్ల రూపాయల విలువగల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతులు జరుగగా అందులో రాష్ట్ర 18,846 కోట్ల రూపాయలు (10.4%) గా వున్నది. మత్స్య రంగం 26.50 లక్షల జనాభాకు జీవనోపాధి కల్పిస్తున్నది.

మత్స్యకారుల సంక్షేమం కోసం వై.యస్.ఆర్. 'మత్స్యకార భరోసా పథకాన్ని' ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వం జూన్ 2019 నుండి, చేపల వేట నిషేధ కాలంలో 1,19,875 లబ్దిదారులకు రూ. 332 కోట్లు, 19,796 మంది లబ్దిదారులకు డీజిల్ ఆయిల్పై రూ. 48.17 కోట్ల సబ్సిడీ, మరణించిన 67 మత్స్యకారుల కుటుంబాలకు న ఎక్స్- గ్రేషియాను ఇవ్వడం జరిగింది. 53,550 రొయ్యలు పెంపకం రైతులకు విద్యుత్ సుంకం యూనిట్‌కు రూ.3.86 నుండి రూ.1.50కు తగ్గించబడింది. ఫలితంగా రూ.1,560 కోట్లు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

ఇంతేగాక G.S.P.C. తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 14,927 కుటుంబాలకు పరిహారంగా రూ.75 కోట్లు అందించడం జరిగింది. తీరప్రాంత మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి మరియు వలసలను తగ్గించడానికి, 8 ఫిషింగ్ నౌకాశ్రయాల అభివృద్ధిని రెండు దశలలో చేపట్టడం జరిగింది. రూ.1510 కోట్లతో 4 ఫిషింగ్ నౌకాశ్రయాల నిర్మాణ పనులు నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వద్ద ప్రారంభమయ్యాయి. రెండవ దశలో, రూ. 1365.35 కోట్లతో మరియొక 4 ఫిషింగ్ నౌకాశ్రయాలు - శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖపట్నంలోని పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో రాబోతున్నాయి. ఈ చర్యలతో, 'మహాసముద్రాలు, సముద్రాలు మరియు సముద్ర వనరులను సుస్థిర అభివృద్ధికి పరిరక్షించడం మరియు స్థిరంగా ఉ పయోగించడం' అనే 14వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు అడుగు వేయడం జరిగింది అని చెప్పవచ్చును. 2021-22 సంవత్సరానికి మత్స్య రంగానికి 39.4 కోట్లు ప్రతి పాదిస్తున్నాను.

వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు కేటాయింపుల ద్వారా నాలుగు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (S.D.G.) సాధించగలుగుతున్నాము - అవి ఏమనగా 1వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అన్నిరకాల రూపాలలో పేదరిక నిర్మూలన', 2వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'ఆకలి బాధలు లేకుండా చూడటం', 8వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'నిరంతర, సమగ్ర మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడం మరియు ఉత్పాదకతో కూడిన ఉపాధి మరియు అందరికీ గౌరవప్రదమైన పని కల్పించడం' మరియు 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అసమానతలు తగ్గించడం'.

ప్రజాపంపిణీ వ్యవస్థ

2021 జనవరి 21న మన ప్రభుత్వం, 9,260 సంచార పంపిణీ యూనిట్ల (M.D.U.) ద్వారా అర్హత గల లబ్దిదారులకు వారి గృహాల వద్దనే అవసరమైన నిత్యావసర వస్తువులను ప్రజాపంపిణీ వ్యవస్థ క్రింద పంపిణీ చేసే మునుపెన్నడూ లేని బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి నెలా చౌకధరల దుకాణాల నుండి నిత్యావసర సరుకులను (రేషన్) పొందడానికి బదులు ఇంటి వద్దనే నిత్యవసర సరుకులను (రేషన్)అందించడం వలన రోజువారీ వేతన కార్మికుల, వయోవృద్ధుల మరియు దివ్యాంగుల సమయం మరియు శ్రమ ఈ కార్యక్రమం ద్వారా ఆదా అవుతున్నాయి. స్వయం ఉపాధి పథకం క్రింద షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల మరియు మైనారిటీల నిరుద్యోగ యువతకు 90% ప్రభుత్వ రాయితీతో సంచార పంపిణీ యూనిట్లను (M.D.U.) అందివ్వడం జరిగింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఈ రకమైన చొరవ ఇంతకుముందు జరిగిన నల్ల బజారు వ్యవహారములు, ఎక్కువ శాతం రంగు వెలసిన మరియు నూకలతో కూడిన బియ్యం సరఫరా వంటి అవకతవకలకు స్వస్తి పలకడం ద్వారా ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. రేషన్ ఇంటి వద్దకే పంపిణీ చేయడం ద్వారా 12వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన (S.D.G-12) 'స్థిరమైన వినియోగ ఉత్పత్తి విధానం అవలంబించడం', తద్వారా గొలుసు సరఫరా విధానం వలన జరిగే ఆహార నష్టాల తగ్గింపును సాధించ గలుగుతున్నాము.

27. గత సంవత్సరం అనగా 2020 కోవిడ్ లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను అదనంగా సరఫరా చేయడం కోసం 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3,103 కోట్ల రూపాయలు అదనపు వ్యయం చేయడం జరిగింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో నిత్యావసర వస్తువులను అదనంగా సరఫరా చేయడం కోసమై 754 కోట్ల రూపాయలను మే మరియు జూన్, 2021 నెలలకుగాను ఖర్చుచేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.

ఆరోగ్యం.. పోషణకు బ‌డ్జెట్‌లో ప్రాధాన్య‌త‌

నాణ్యమైన మరియు అందుబాటులోగల ఆరోగ్య సదుపాయాలకు ప్రాధాన్యతను కల్పించడం ప్రభుత్వ ప్రధాన అంశాలలో ఒకటి. డాక్టర్ వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా, ప్రభుత్వ మరియు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులలో ప్రభుత్వం పేద రోగులకునగదు రహిత చికిత్సను ఉచితంగా అందిస్తోంది. దీనికితోడు డాక్టర్ వై.యస్. ఆర్. ఆరోగ్య ఆసరా పథకం ద్వారా వేతన నష్టానికి పరిహారంగా బి.పి.ఎల్. లబ్దిదారులకు ఆపరేషన్ అనంతరం రోజుకు 225 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ పథకాలు మరియు ఔషధాల కోసం 2021 22 సంవత్సరానికి 2,258 కోట్ల 94 లక్షల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాలు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచగలిగే | ఆరోగ్యకరమైన మరియు ఉత్పాదకతతో కూడిన మానవ మూలధనం కలిగి ఉంటాయి. ఈ విధంగా ప్రభుత్వం ప్రజారోగ్య మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకై 'నాడు-నేడు' కార్యక్రమాన్ని ప్రాధాన్యతగా అమలు చేస్తుంది. ఈ కార్యక్రమం క్రింద అవసరమైన చోట ఆసుపత్రుల జాతీయ అక్రిడిటేషన్ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్స్ బోర్డు (N.A.B.H.) మరియు భారత ప్రజారోగ్య ప్రమాణాలకు (I.P.H.S.) అనుగుణంగా, ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రజారోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధన ఆసుపత్రులలో మౌలిక వసతులు మరియు ఉపకరణాల ఏర్పాటు, అదనపు మానవ వనరుల కల్పన ద్వారా ఆధునీకరించ బడతాయి. భారతీయ వైద్య మండలి (M.C.I.) మార్గదర్శకాల ప్రకారం, 16 కొత్త వైద్య కళాశాలలను స్థాపించడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలను మరియు బోధన ఆసుపత్రులను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1,538 కోట్ల 55 లక్షల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

ప్రభుత్వం వివిధ సమయాలలో, వివిధ విషయాలలో కోవిడ్-19 మహమ్మారి నివారణకు తగ్గించడానికి మరియు వీటి నిర్వహణ కోసం రూ.2,246.18 కోట్లు ఖర్చుచేసింది. ప్రయోగశాలల ఏర్పాటుకు ఆరోగ్య పరీక్షలకు, మందులకు, పి.పి.ఇ.కిట్లకు, వెంటిలేటర్లకు, ట్రూనాట్ యంత్రాల చిప్లకు, ఆక్సిజన్ పైప్ లైన్ల ఏర్పాటుకు, వ్యాక్సిన్ల సేకరణకు మొదలగువాటికై ఈ ఖర్చును చేయడం జరిగింది. ఇప్పటివరకు 53 లక్షల 34 వేల మందికి మొదటి విడత టీకాలు, 21 లక్షల 74 వేల మందికి రెండు విడతల టీకాలు వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్-19 మహమ్మారి నివారణకు, అవలంబించిన వివిధ పద్ధతులకు మరియు కోవిడ్-19 మహమ్మారి నుంచి ఉపశమనం పొందేందుకు చేస్తున్న నిర్వహణ వ్యూహాలను 'నీతి ఆయోగ్' ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంతో ప్రశంసించింది అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ సంక్షేమం కోసం 2021-22 సంవత్సరానికి కోట్ల 44 లక్షల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది 2020-21 సం||లో చేసిన కేటాయింపుల కంటే 21.11% ఎక్కువ. ఈ కేటాయింపులు 3వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'ఆరోగ్యకరమైన జీవితాలను నిర్ధారించడం మరియు అందరికీ మంచి ఆరోగ్యాన్ని కల్పించడం' సాధించటానికి ఉద్దేశించబడ్డాయి.    

మహిళలు- బాలల బడ్జెట్

ఏ సమాజమైనా స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే, ఆయా ప్రభుత్వాలు పిల్లలు మరియు మహిళలపై పెట్టే ప్రభుత్వ వ్యయమే కీలకం. మహిళలు మరియు పిల్లల కోసం వార్షిక బడ్జెట్లలో కేటాయించిన కేటాయింపులను గుర్తించడానికి మరియు అంచనా చేయడానికి ఒక పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. అంతేగాక ఇటువంటి కేటాయింపులయొక్క పరిమాణాన్ని అర్థంచేసుకోవటానికి తదుపరి బడ్జెట్లలో కేటాయింపులను ఖర్చులను ట్రాక్ చేయడానికి ఈ యంత్రాంగం వీలుకల్పిస్తుందని, తద్వారా ప్రణాళికాబద్ధమైన మంచి ఫలితాలను రాబట్టవచ్చని ప్రభుత్వఆలోచన. అందువలన 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి జండర్ బడ్జెట్ మరియు బాలల బడ్జెట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది.

పిల్లల అభివృద్ధికి మనం ఇవ్వవలసిన ప్రాముఖ్యతను తెలియజేయడానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలను నేను గుర్తుచేస్తున్నాను.

``పిల్లలను మీ స్వంత శిక్షణ అవసరాలకు పరిమితం చేయవద్దు, వారు జన్మించిన కాలం వేరు``

3 నుంచి 6 సంవత్సరాల మధ్య వయస్సు గల 8.7 లక్షల మంది పిల్లలలో, పౌష్టిక ఆహార సరఫరాతోపాటు, వయస్సుకి తగిన ఆలోచన, సామాజిక మరియు భావోద్వేగ వికాసానికి పునాది వేయడానికి 55,607 అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం 'వై.యస్.ఆర్. ప్రీ-ప్రైమరీ పాఠశాలలను' ప్రవేశపెట్టింది. పిల్లల సమగ్ర అభివృద్ధికి, ఈ క్రమబద్ధమైన విధానం దేశంలోనే ఒక ప్రత్యేకమైన నమూనాగా నిలుస్తుంది. ఈ క్రొత్త విద్యావిధానం, రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి (S.C.E.R.T.) మద్దతుతో సవరించిన ప్రీ-స్కూల్ ‘పాఠ్య-ప్రణాళిక' ఆదేశాలను అనుసరిస్తుంది.

అంగన్వాడీల భౌతిక, మౌళిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, 16,681 అంగన్వాడీలను 9 విభాగాలతో, అనగా మరుగుదొడ్లు, విద్యుత్ శక్తి, వంటగది, తాగునీరు, భవనాలకు రంగులు వేయడం, గ్రీన్ చాక్ బోర్డు, ప్రహరీ గోడ, ఆట పరికరాలు, సురక్షిత నీటి సరఫరా సదుపాయాలతో మెరుగుపరచాలని ప్రతిపాదించడమైనది. అంతేగాక నాడు నేడు కార్యక్రమం క్రింద, రాబోయే 3 సంవత్సరాలలో 27,428 కొత్త భవనాలను నిర్మించాలని తలపెట్టడం జరిగింది. వీటిలో 3,928 పాఠశాల భవనాల నిర్మాణం రాబోయే 3 సంవత్సరాలలో నాడు నేడు పథకం క్రింద పూర్తి చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

అన్నం పెట్టి ఎదుటివారి ఆకలి తీర్చే ప్రతి ఒక్కరూ లోకంలో వందనాలు అందుకోతగినవారే! మన ముఖ్యమంత్రిగారు ఈ కోవకు చెందినవారు. అందుకు |జగనన్న గోరుముద్ద పథకమే సాక్ష్యం. చదువుతోపాటు సరైన పోషకాహారం అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రిగారు పిల్లలకు రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్నం భోజనం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారు. నాణ్యమైన చదువు చెప్పించడంతోపాటు వారికి ఇష్టమైన ఆహారాన్ని ప్రేమగా అందిస్తూ రాష్ట్రంలోని చిన్నారులందరికీ జగన్మోహన్ రెడ్డిగారు అత్యంత ప్రియమైన మేనమామగా మారిపోయారు.

గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు మరియు 6 నుండి 72 నెలల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఉన్న రక్తహీనత మరియు పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి, వై.యస్.ఆర్. సంపూర్ణ పోషణ పథకాన్ని అంగన్వాడి కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నాము. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడి కేంద్రాల ద్వారా 6 నుండి 72 నెలల మధ్య వయస్సు గల 23 లక్షల 70 వేల మంది పిల్లలకు మరియు 6 లక్షల 46 వేల మంది గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు సంపూర్ణ పౌష్టికాహార భోజనం, పాలు మరియు అందజేస్తున్నాము. వీటి అమలు ద్వారా 2వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలయిన 'ఆకలిని అంతం చేయడం, ఆహార భద్రతను సాధించడం మరియు పోషణను మెరుగుపరచడం’లను సాధించగలుగుతున్నాము. 

మహిళా సాధికారత

మహిళల స్థితిగతులు బాగుపడనిదే
సమాజం అభివృద్ధి చెందదు.
ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగురలేదు.

వై.యస్.ఆర్. ఆసరా
 'మహిళల సాధికారత, స్వయం ప్రతిపత్తి, మరియు వారి రాజకీయ, సామాజిక, ఆర్ధిక, ఆరోగ్య స్థితిగతుల మెరుగుదల' అనేవి సుస్థిరమైన సమగ్ర పాలనలో అంతర్భాగంగా ఉంటాయి. సురక్షితమైన జీవనోపాధి మరియు ఆర్థిక భాగస్వామ్య కల్పనల ద్వారా మహిళల ప్రాధాన్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించడమే గాక, అమలు చేసింది. మహిళల స్థితిని మెరుగుపరచడానికి ఒకే సమయంలో అన్ని చర్యలు తీసుకున్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు సఫలీకృతమవుతాయి. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కలగజేయటం, రుణవిషవలయం నుంచి బయటకు తీసుకురావటం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్న 27,168 కోట్ల రూపాయల స్వయం సహాయక సంఘాల యొక్క బ్యాంకు బకాయిలను నాలుగు విడతలుగా తిరిగి చెల్లిస్తామని గౌరవ ముఖ్యమంత్రిగారు వాగ్దానం చేశారన్న విషయం మీ అందరికీ తెలిసినదే. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, మన ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 11న వై.యస్.ఆర్. ఆసరా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అమలులో భాగంగా వివిధ సంక్షేమ సంస్థల ద్వారా మొదటి విడతగా రూ.6,337 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని 8,71 లక్షల స్వయం సహాయక సంఘాల ప్రయోజనాల కోసం 2021 22 సం||లో వై.యస్.ఆర్. ఆసరా పథకం రెండవ విడత క్రింద 6,337 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాము.

వై.యస్.ఆర్. సున్నా వడ్డీ
మన ప్రభుత్వం 2020 ఏప్రిల్ 24న వై.యస్.ఆర్. సున్నా వడ్డీ పథకమును ప్రారంభించింది. ఈ పథకం అమలులో భాగంగా 2019-20 సం॥నకు చెందిన రుణాలపై వడ్డీకి సంబంధించి రూ.1400 కోట్లను బదిలీ చేయడం జరిగింది. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని 8 లక్షల 78 వేల 874 స్వయం సహాయక సంఘాలకు చెందిన 90 లక్షల 37 వేల 254 మంది మహిళలు లబ్ది పొందారు. ఏప్రిల్ 2021 లో ఈ పథకానికి 1,112 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. 2021 22 సంవత్సరంలో 1,112 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. చేయూత
"మహిళలను అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే అభివృద్ధికే మహిళల సహకారం అవసరం" అన్నారు
- ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రెటరీ జనరల్ కోఫీ అన్న‌న్ గారు.

ఆర్థిక స్వాతంత్య్రం, అధికారం పొందిన మహిళలు, వారి కుటుంబాలు, సమాజం మరియు జాతీయ, ఆర్థిక వ్యవస్థలకు ఎక్కువ సహకరిస్తారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030ని సాధించటానికి మహిళాసాధికారత తోడ్పడుతుంది.

2020 ఆగస్టు 12 వై.యస్.ఆర్. చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా మన ప్రభుత్వం తన మరో వాగ్దానాన్ని నెరవేర్చడం జరిగింది. సామాజిక, ఆర్థిక సాధికారత వైపు నడిపించడానికి 45-60 సంవత్సరాల మధ్య వయస్సు గల షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన 23 లక్షల 76 వేల మంది మహిళా లబ్దిదారులకు 4,455 కోట్ల రూపాయలు సహాయాన్ని అందించాము. రెండవ విడత ఆర్థిక సహాయం కూడా త్వరలో విడుదల చేయడానికి ప్రతిపాదిస్తున్నాను. వెనుకబడిన తరగతులు మహిళలకు కూడా ఇదే విధమైన ఆర్థిక సహాయాన్ని అందించుటకు ప్రభుత్వం నిర్ణయించింది.

'దిశ' అమలులో భాగంగా, మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత దిశగా ప్రభుత్వం మహిళా రక్షకభట నిలయాలను 'దిశ రక్షకభట నిలయాలుగా మార్పు చేయడం, 'దిశ మొబైల్ యాప్'ను ఏర్పాటుచేయడం, ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలను బలోపేతం చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 700 మహిళా సహాయక డెస్క్లు ఏర్పాటు చేయబడ్డాయి.

5వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'లింగ సమానత్వం' మరియు 8వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'నిరంతర, సమగ్ర మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, పూర్తి ఉత్పాదకతతో కూడిన ఉపాధిని కల్పించడంలో భాగంగా ఎంతో ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, పోషణ మరియు సంక్షేమం కోసం వనరులను కేటాయించడం ప్రభుత్వ కర్తవ్యం. 2021-22 మొత్తం బడ్జెట్ వ్యయంలో, పిల్లల అభివృద్ధికి 16,748 కోట్ల 47 లక్షల రూపాయలు మరియు మహిళల అభివృద్ధికి 47,283 కోట్ల 21 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

సంక్షేమం- సమానత్వ సాధన

'న్యాయ-అన్యాయాల అంతరం లేకుండా వర్షం అందరిపై సమంగా కురిసినట్టుగానే, మీ వాత్సల్యమును కూడా అందరిపై సమానంగా చూపండి' గౌతమ బుద్ధుడు బోధించాడు అనే విషయం మనందరికీ తెలిసినదే.

సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'స్థిరమైన పురోగతిని నమోదు చేయడం' సమర్థ వంతమైన సామాజిక మౌలిక సదుపాయాలను నిర్మించడం అత్యవసరం. ఈ లక్ష్యం కొరకు పేడ, వెనుకబడిన మరియు బలహీన వర్గాల అవసరాలు మరియు ప్రాధాన్యతలను సమగ్ర పద్ధతిలో పరిష్కరించాలని పిలుపునిచ్చింది. అన్ని వర్గాల పౌరుల సంక్షేమానికీ, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాల వారి సంక్షేమానికి ప్రాధాన్యత నవరత్నాల కార్యక్రమాలు మరియు ప్రభుత్వ ఇతర పథకాలు రూపొందించబడ్డాయని గౌరవ సభకు తెలియజేస్తున్నాను..

వై.యస్.ఆర్. బీమా
2020 అక్టోబర్ 21 నాడు 1 కోటి 41 లక్షల మంది అర్హతగల పేద కుటుంబాలకు ఉచిత బీమా అందించే ఉద్దేశ్యంతో 100% ప్రీమియం ఖర్చును తానే భరిస్తూ ప్రభుత్వం వై.యస్.ఆర్. బీమా పథకాన్ని ప్రారంభించింది. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు నిరాశ్రయులు అవకుండా ఉండాలని ధృడ సంకల్పంతో ప్రభుత్వమే తన సొంత నిధుల నుండి 12,039 మంది మరణించిన కుటుంబాలకు 254 కోట్ల రూపాయలను క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించింది. 2021-22 ఆర్థిక సంవత్సరములో ఈ వైయస్ఆర్ బీమా పథకానికి 372 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను.

వృత్తిదారులకు సంక్షేమ పథకాలు, జీవనోపాధి-ఆర్థిక సహాయం
 వై.యస్.ఆర్. వాహనమిత్ర పథకం ద్వారా ప్రభుత్వం ఆటో, టాక్సీ మరియు మేక్సీక్యాబ్ కలిగి ఉన్న 2 లక్షల 83 వేల మంది డ్రైవర్లకు 283 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది. వై.యస్.ఆర్. నేతన్న నేస్తం పథకం క్రింద ప్రభుత్వం 81 వేల చేనేత కుటుంబాలకు 19 కోట్ల 46 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసింది. జగనన్న చేదోడు పథకం 10 లక్షల చిరు వ్యాపారులకు వారి మూలధన అవసరాల నిమిత్తం మరియు మార్కెట్లో లభించే ఇతర అధిక వడ్డీ రేట్లనుండి ఉపశమనం పొందడానికి, వడ్డీ లేని ఋణాలు రూ.10,000 చొప్పున మొత్తం రూ.1000 కోట్లు అందిస్తున్నాము. జగనన్న చేదోడు పథకం ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, ధోఖీలు మొదలగు 2 లక్షల 85 వేల మంది లబ్దిదారులకు 285 కోట్ల రూపాయల విడుదల చేయడం జరిగింది. ఈ పథకాల ద్వారా 8వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'ఉత్పాదకతతో కూడిన ఉ పాధి మరియు గౌరవప్రదమైన పని కల్పించడం', 1వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'పేదరిక నిర్మూలన' మరియు 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అసమానతల తగ్గింపు' లను సాధించ గలుగుతున్నాము.

ఉప ప్రణాళికలు
అభివృద్ధి సూచికలలోని అంతరాలను తగ్గించడానికి, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు వెనుకబడిన తరగతులకు చెందిన సమాజాల వ్యయం, ప్రయోజనాలు మరియు అభివృద్ధి కొరకై జనాభా ప్రాతిపదికన ఉపప్రణాళికలు రూపొందించబడ్డాయి.

వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళిక
మన ప్రభుత్వం వెనుకబడిన తరగతులను బ్యాక్ వర్డ్ క్లాసెస్ అనికాక బ్యాక్ బోన్ క్లాసెస్ అని పరిగణిస్తుంది. ఈ ప్రణాళికల మెరుగైన అమలు కోసం, 139 ఉప కులాలతో కూడిన వెనుకబడిన తరగతుల సమాజాల (కమ్యూనిటీల) కొరకు 56 కొత్త బిసి కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వం సాధించిన మరో మైలురాయి. మన ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 33,500 కోట్ల రూపాయలను 2 కోట్ల 71 లక్షల 37 వేల 253 వెనుకబడిన తరగతుల చెందిన లబ్దిదారుల కొరకై ఖర్చుచేసింది. వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళికకు 28,237 కోట్ల 65 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను.

కాపు సంక్షేమం
కాపు సామాజిక వర్గం సంక్షేమం మన ప్రభుత్వ విధానాలలో ఒక ముఖ్యమైన విషయం. కాపు సంక్షేమానికై స్పష్టమైన కేటాయింపులు చేయడం జరిగింది. జీవనోపాధి | సహాయమునకై కాపు మహిళలకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తున్నాము. కాపు నేస్తం పథకం క్రింద 2021-22 సంవత్సరంలో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కాపు సామాజిక వర్గ సంక్షేమానికి 3,306 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాలకు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక

2021-22 సం||లో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికకు 17,403 కోట్ల 14 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరపు కేటాయింపులకంటే 22.4% (14,218.76 కోట్లు) ఎక్కువ.

షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక
షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళికకు 6,131 కోట్ల 24 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరపు కేటాయింపులకంటే 27.25% (4,814.5కోట్లు) ఎక్కువ.

అల్పసంఖ్యాక వర్గాల కార్యాచరణ ప్రణాళిక
అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని భారత రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది. అనేక జాతీయ స్థాయి కమిటీలు మరియు నిపుణులు అధికసంఖ్యాక వర్గాల వారితో పాటు అల్పసంఖ్యాక వర్గాల సమాన అభివృద్ధి యొక్క అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ లక్ష్య సాధనకై డా॥ వై.ఎస్. రాజశేఖరరెడ్డిగారు అల్పసంఖ్యాక వర్గాల వారికోసం 4% రిజర్వేషన్లను ప్రారంభించారు. ఇది నిజంగా ఈ వర్గాలవారికి ఒక వరం. అల్పసంఖ్యాక వర్గాల వారికి తగిన వనరులను కేటాయించడం కూడా అంతే ముఖ్యం. మైనారిటీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మైనారిటీలకు కేటాయింపులను బడ్జెట్లో పొందుపరచటం జరిగింది. తద్వారా మైనారిటీల దీర్ఘకాలిక అవసరం తీరింది. ఇది కేటాయింపులు, ఖర్చులను కాలానుగుణంగా గుర్తించటానికి, పర్యవేక్షించడానికి తద్వారా వారి సంపూర్ణ సంక్షేమం మరియు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అల్పసంఖ్యాక వర్గాలకు కోట్ల లక్షల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చుపెట్టడానికి ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. పెన్షన్ కానుక

తన పాదయాత్రలో పింఛనుదారుల దుస్థితిని చూసిన తరువాత, గౌరవ ముఖ్యమంత్రి గారు పింఛను మొత్తాన్ని ఒకేసారి నెలకు రూ.1,000 నుండి రూ. 2,250 లకు పెంచడమేకాక, ప్రతి నెల 1వ తేదీన పింఛనదారుల ఇంటివద్దే గ్రామ మరియు వార్డు వాలంటీర్ల ద్వారా అందచేస్తున్నాము. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిగ్రస్తులైన పింఛనుదారులకు 10,000 రూపాయలు అందిస్తున్నాము. పెన్షన్ల పద్దు ముందు ప్రభుత్వంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. ఈ ప్రతిపాదిత కేటాయింపుల ద్వారా 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అసమానత తగ్గింపులు' మరియు 1వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'పేదరిక నిర్మూలన' లక్ష్యాలను సాధించగలుగుతున్నాము.

విద్య

ఇహమునందు బుట్టి ఇంగీతమెరుగని
జనుల నెంచిచూడ స్థావరములు

జంగమాదులనుట జగతిని పాపము
విశ్వదాభిరామ వినురవేమ.

మానవుడిగా పుట్టినందుకు జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం లేనివాడు పశు పక్ష్యాదులతో సమానం. కాబట్టి జ్ఞానార్జనే మానవజన్మ పరమార్థం అంటున్నాడు. జ్ఞాని వేమన.

జగనన్న అమ్మ ఒడి
చదువు విలువ తెలిసిన ప్రభుత్వమిది. పిల్లల్ని బడికి పంపడంలో అమ్మల పాత్ర ఏమిటో తెలిసిన ప్రభుత్వమిది. అందుకే పిల్లలకు బడి, గుడి, నుడి అమ్మ ఒడియే అని తలంచి 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన మన ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న లక్షలమందికి ఉపయోగపడేలా వారి మాతృమూర్తుల ఖాతాల్లోఏటా పదిహేను వేల రూపాయలు జమచేస్తోంది. విద్యార్థనకు పేదరికం అడ్డు రాకూడదని, గౌరవ ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్ముతారు. వరుసగా రెండవ సంవత్సరం, జగనన్న అమ్మఒడి పథకం క్రింద ప్రభుత్వం 44 లక్షల 49 వేల మంది తల్లులకు 15 వేల రూపాయలు చొప్పున అందించడంతో 84 లక్షల మంది పిల్లలు లబ్దిపొందారు. వరుసగా 2021-22 సం||లో జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 6,107 కోట్ల 36 లక్షల రూపాయల ఆర్హతకలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీచేయబడుతుంది.

నాడు-నేడు : పాఠశాలలకు మౌళిక సదుపాయాల కల్పన

"ప్రపంచాన్ని మార్చటానికి మీరు ఉపయోగించ గలిగిన అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య" అన్నారు నెల్సన్ మండేలా.

మన బడి-నాడు నేడు పథకం క్రింద మన ప్రభుత్వం, 4వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'నాణ్యమైన విద్య మరియు జీవిత కాల అభ్యసన అవకాశాలు కలిగించడం' సాధించే దిశలో పాఠశాలలలో 9 మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. మొదటి దశలో 15,715 పాఠశాలలు ఇప్పటికే ఆధునీకరించ బడ్డాయి. 2021 ఏప్రిల్ 15న ప్రారంభమయ్యే ఈ పథకం రెండవ దశలో భాగంగా 16,345 విద్యాసంస్థలు ఆధునీకరించబడతాయి. ఈ పథకం కోసం 2021-22 సం॥లో 3,500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా 1 నుండి 10 వ తరగతి వరకు విద్యార్థులకు గుడ్డు, చిక్కి మొదలైన పోషక పదార్థాలను కూడా అందించడానికి ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రారంభించింది. ఈ అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. జగనన్న విద్యాకాసుక పథకం క్రింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో 1 నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రెండు/మూడు జతల స్కూల్ యూనిఫారములు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు, పాఠ్య పుస్తకాలతో పాటు నోటు మరియు వర్కుపుస్తకాలు మొదలైన వాటితో కూడుకున్న ఒక కిట్ను అందిస్తున్నాము. ఈ విద్యా సంవత్సరం నుండి అందరు విద్యార్థులకు ఒక ఆంగ్ల-తెలుగు నిఘంటువును కూడా ఇవ్వడానికి మన ప్రభుత్వం సంకల్పించింది.

జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన

విద్య అంటే విషయాలను బట్టీ పట్టడమే కాదు, మనస్సును ఆలోచింప చేసే దిశగా శిక్షణ - అల్బర్ట్ ఐన్‌స్టీన్‌

ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను పొందడానికి వీలుగా ఆహారం, వసతి గృహ ఖర్చులను భరించడానికి, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడానికి ఈ పథకాలు ఉద్దేశించబడినవి. కాలేజీ యాజమాన్యాలు పారదర్శకతగా వ్యవహరించటం కోసం ఈ పథకాల ద్వారా విడుదలయ్యే నిధులను ఆర్హత కలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీచేస్తున్నాము. 2020-21 సం॥సకు గాను జగనన్న విద్యాదీవెనకు 2,500 కోట్ల రూపాయలు, జగనన్న వసతిదీవెనకు 2,223 కోట్ల 15 లక్షల రూపాయల కేటాయింపులను ప్రతిపాదించడమైనది.
మొత్తం 2021-22 సం||కి మాధ్యమిక మరియు ఇంటర్మీడియట్ విద్యకు మొత్తం 24,624 కోట్ల 22 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదించడమైనది.

ఉన్నత విద్య

జాతీయ విద్యా విధానం-2020 కి అనుగుణంగా, 2020-21 విద్యా సంవత్సరం నుండి సవరించిన యు.జి. ప్రోగ్రామ్ పాఠ్యాంశాలను ఇంజనీరింగ్, బి.ఎ., బి.ఎస్.సి., బి.కామ్. మరియు ఇతర పట్టభద్రుల కోర్సులలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సవరించిన పాఠ్యప్రణాళిక, 'ఫలితం ఆధారితమైనదే కాకుండా జీవిత నైపుణ్యం, నైపుణ్య అభివృద్ధి మరియు నైపుణ్య మెరుగుదల అంశాలను కలిగి ఉంటుంది. విస్తృతమైన ఎంపికలతో కూడిన 'ఛాయిస్ బెస్ట్ క్రెడిట్ సిస్టమ్' మరియు విద్యార్థుల ఉపాధిని పెంచడానికి పది నెలల తప్పనిసరి ఇంటర్న్షిప్ అనేది సవరించిన పాఠ్యాంశాల యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇదే కాకుండా, మన రాష్ట్రంలో 2018-19 సం॥లో 32.4% గా ఉన్న ఉన్నత విద్యలో గల స్థూల నమోదు నిష్పత్తిని, 2024-25 నాటికి 70% మరియు 2035 నాటికి 90% వరకు పెంచే వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఉన్నత విద్య యొక్క నాణ్యతను నిర్ధారించడానికి, రాబోయే 5 సంవత్సరాలలో అన్ని .. విశ్వవిద్యాలయాలు మరియు 50% కళాశాలలు నేషనల్ అసెస్మెంట్ మరియు అక్రిడిటేషన్ కౌన్సిల్ (N.A.A.C.) చేత గుర్తింపు పొందాలనే ఉద్దేశ్యంతో 'క్వాలిటీ అస్యూరెన్స్ సెల్' ను స్థాపించడం జరిగింది. 2021-22 సం॥లో ఉన్నత విద్య కోసం 1,973 కోట్ల 16 లక్షల రూపాయలు కేటాయింపును ప్రతిపాదించడమైనది.

యువజన సంక్షేమం - నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి
మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు క్రీడా విభాగాల్లో రాణిస్తున్నారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా, 36 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇంకా 79 క్రీడా వికాస కేంద్రాల పనులు పురోగతిలో ఉన్నాయి. కడపలోని డాక్టర్ వై.యస్. ఆర్. స్పోర్ట్స్ స్కూల్ "ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" గా గుర్తించబడింది.

ఈ రంగాల ద్వారా 4వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'సమగ్ర మరియు సమానమైన నాణ్యమైన విద్యను నిర్ధారించడం' మరియు 'అందరికీ జీవితకాల అభ్యాస అవకాశాలను ప్రోత్సహించడం మరియు 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అసమానతల తగ్గింపు' లక్ష్యాలను సాధిస్తున్నాము.

గృహనిర్మాణ
సంతృప్తికరమైన గృహకల్పన అవసరం తీరనప్పుడు, వ్యక్తుల మరియు కుటుంబాల శ్రేయస్సుపై ఇది ఎంతో గణనీయమైన ప్రభావం చూపిస్తుందనే విషయం అందరికీ తెలిసినదే. అవసరమైన మేరకు గృహాల కల్పన అనేది ఎప్పటి నుండో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడుతోంది. ఇది ఇతర ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను ఆనందంగా అనుభవించడంలో ఒక కీలక పాత్ర వహిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంట్ల చొప్పున, పట్టణ ప్రాంతాలలో 1 సెంటు చొప్పున రూ.23,535 కోట్లు మార్కెట్ విలువగలిగిన 30 లక్షల 76 వేల ఇళ్ళ స్థల పట్టాలను మహిళా లబ్దిదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇది 2014 జూన్ నుండి 2019 ఫిబ్రవరి మధ్య కాలంలోగత ప్రభుత్వం పంపిణీ చేసిన 4,63,697 ఇళ్ళ పట్టాలతో పోలిస్తే ఆరు (6) రెట్లు ఎక్కువ అని గౌరవ సభకు తెలియచేస్తున్నాను.

28 లక్షల 30 వేల లబ్దిదారులందరికీ రెండు దశలలో రూ.50,940 కోట్లు ప్రాజెక్టు విలువగల 28 లక్షల 30 వేల ఇండ్లను నిర్మించాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శక్తి నివ్వటమే గాక ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది. వై.యస్.ఆర్. జగనన్న కాలనీల పేరున 17,005 లే-అవుట్లలో ఇండ్ల స్థలాలు పంపిణీ చేయబడ్డాయి. ఈ లే-అవుట్లలో నీటి సరఫరా, విద్యుత్, అప్రోచ్ రహదారులు, అంతర్గత రహదారులు, కాలువలు మరియు ఇతర సామాజిక మౌళిక సదుపాయాలను ప్రభుత్వం అందిస్తోంది. పట్టణ ప్రాంతాలలో అర్హత కలిగిన మహిళా 6,000 టిడ్కో గృహాలకు సంబంధించిన 21,345 కోట్ల రూపాయల విలువగల అమ్మకపు ఒప్పందాలను కూడా మన ప్రభుత్వం అందచేస్తోంది. 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'నగరాలు మరియు మానవ నివాసాలను కలుపుకొని, సురక్షితంగా, సుస్థిరంగా మార్చడం మరియు అసమానతలను తగ్గించడం', లకు అనుగుణంగా 2021-22 సం||గాను గృహ నిర్మాణం మరియు మౌళిక సదుపాయాల కల్పనకు 5,661 కోట్ల 57 లక్షల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

గ్రామీణాభివృద్ధి
రాష్ట్రం సమర్థవంతంగా అభివృద్ధి చెందాలంటే గ్రామీణ జీవితాల సమగ్రాభివృద్ధి. తప్పనిసరి. అనగా గ్రామాలలో విద్య, ఉపాధి అవకాశాలు, మౌళిక సదుపాయాలు, గృహనిర్మాణం, పౌర సౌకర్యాలు మరియు పర్యావరణ పరిస్థితులు అభివృద్ధి చెందాలి. గ్రామాలలో ఉత్పాదకతను మరింత పెంచడానికి ఆధునిక పద్ధతులు మరియు నైపుణ్యాలు గ్రామస్థులకు ఎప్పటికప్పుడు తెలిసి ఉండాలి. వ్యవసాయ ఆధునీకరణ, గ్రామీణ మౌళిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడం, విద్య మరియు ఆరోగ్యం పెంపు దిశగా చర్యలు చేపట్టడం, ఆదాయ మద్దతును చేకూర్చడం, సమర్థవంతమైన సమన్వయ యంత్రాంగాలతోసహకారం చేకూర్చడం ద్వారా గ్రామీణ అభివృద్ధికి మా ప్రభుత్వం విస్తృత బహుళ రంగ విధానం ద్వారా ఎంతో కృషి చేస్తూ ఉంది. స్థిరమైన జీవనోపాధిని సాధించడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధిని విస్తరించి మన్నికైన ఆస్తులను సృష్టించడానికి, 24 లైన్ విభాగాలతో 'మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద ప్రభుత్వం వివిధ కన్వర్జెన్స్ కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2020-21 సం॥లో 2,593 లక్షల పనిదినాల కల్పనతోపాటు, 5,957 కోట్ల 60 లక్షల రూపాయల విలువగల వేతనాలు పంపిణీ చేయబడ్డాయి. ఇంతేగాక 68,367 వ్యవసాయ చెఱువుల త్రవ్వకం మరియు 29,965 నీళ్ల ట్యాంకుల నుండి పూడికలను తొలగించడం జరిగింది. భవన నిర్మాణ సామగ్రిని అందించే సహకారంలో భాగంగా 235 కిలోమీటర్ల సి.సి. రోడ్లు ఏర్పాటు, పాఠశాలలకు 502 కిలోమీటర్ల ప్రహరీ గోడల నిర్మాణం, 2,406 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం, 459 వై.యస్.ఆర్. ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం, 577 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పూర్తిగావించడమైనది. వీటికి గాను 3,600 కోట్ల రూపాయలను ఖర్చు చేయడమైనది. ఇంతేగాక 56,762 ఎకరాలలో ఉద్యానవన మొక్కల పెంపకం, 10,700 కిలోమీటర్ల పొడవుగల రోడ్లకు ఇరువైపుల మొక్కల పెంపకం, 3,553 కిలోమీటర్ల పొడవుగల జగనన్న కాలనీలో ప్లాంటేషన్ చేయుటకు నిర్మాణ సామగ్రి అందించడం జరిగింది. ఈ విధంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా పరిపాలన ఖర్చుతో కూడుకొని 10,200 కోట్ల 60 లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది.

రాష్ట్రంలోని 162 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలలో, 1 లక్ష మంది రైతులకు లబ్దిచేకూర్చే విధంగా 2.5 లక్షల ఎకరాల భూమిని నీటిపారుదల క్రిందకు తెచ్చేందుకు వై.యస్.ఆర్. జలకళ కార్యక్రమంలో భాగంగా 2 లక్షల బోర్లను ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2021 22 సం||లో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 18,580 కోట్ల 70 లక్షల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 11.19% ఎక్కువ.

పట్టణాభివృద్ధి
ఆసియా మౌళిక పెట్టుబడుల బ్యాంకు (AIIB) అందిస్తున్న సహాయంలో భాగంగా రూ.5,000 కోట్ల వ్యయంతో, పట్టణ స్థానిక సంస్థలలోని 3.3 మిలియన్ల - పట్టణ జనాభాకు త్రాగునీరు అందించడానికి, ఆంధ్రప్రదేశ్ పట్టణ నీటి సరఫరా ప్రాజెక్టును మా ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా, జాతీయ సేవా స్థాయి ప్రమాణాలు ప్రకారం నీటి సరఫరా, పారిశుధ్యం, వరద నీటి నివారణ కాలువలు, రహదారులు, ఉద్యానవనాలు మొదలైన మౌళిక సదుపాయాలు సేవలను అందించడానికి మరియు పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, 110 పట్టణ-స్థాయి సంస్థలలో 'క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్' (C.II.P.) అమలు చేయడం జరుగుతుంది.

120 పట్టణ స్థానిక సంస్థలలో 560 వై.యస్.ఆర్. పట్టణ వైద్య కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం చేపట్టింది. 'అమృత్ పథకం' క్రింద వివిధ పట్టణ స్థానిక సంస్థలలో రెండు దశలలో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ మరియు వరద నీటి నివారణ కాలువల నిర్మాణం వంటి వివిధ పనులను చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులన్నియు 2021 డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని అంచనా.

మన ప్రభుత్వం పట్టణాభివృద్ధి కార్యక్రమాల ద్వారా 6వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అందరికి పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం మరియు 11వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'నగరాలు మరియు మానవ ఆవాసాలను సురక్షితంగా, సుస్థిరంగా సమగ్రంగా రూపొందించుట'ను సాధించే దిశగా ముందుకు వెళ్తుంది. అన్ని పట్టణ స్థానిక సంస్థలలో మౌళిక సదుపాయాలు మరియు సేవలు ఏర్పాటు చేయడంవలన పట్టణ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. 2021-22 సం||లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 8,727 కోట్ల 8 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 7.2% ఎక్కువ.

అడవులు పర్యావరణం
అభివృద్ధి చెందుతున్న జీవవైవిధ్యం కోసం మరియు పౌరులకు స్థిరమైన జీవన స్థలాన్ని సృష్టించడం కోసం, హరితాంధ్ర ప్రణాళిక దిశగా ప్రభుత్వం అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించదలచింది. ఇది భారీ కార్బన్ సింక్ గా కూడా పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రిగారు 2020 జూలై 22న, 71వ వనమహోత్సవమును ప్రారంభించారు. దీని ద్వారా, 13వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'వాతావరణ మార్పులను మరియు దాని ప్రభావాలను ఎదుర్కోవడానికి అత్యవసర చర్యలు తీసుకోవడం' మరియు 15వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'భూసంబంధ పర్యావరణ వ్యవస్థల యొక్క స్థిరమైన వినియోగాన్ని రక్షించడం, పునరుద్ధరించడం మరియు ప్రోత్సహించడం, అడవులను స్థిరంగా నిర్వహించడం, ఎడారీకరణను ఎదుర్కోవడం మరియు భూసార క్షీణతను ఆపడమేకాక యథాస్థితికి తీసుకురావడం మరియు జీవవైవిధ్య నష్టాన్ని ఆపడం'లో భాగంగా జగనన్న పచ్చతోరణ కార్యక్రమం క్రింద 9.5 కోట్ల విత్తనాలను నాటడం జరిగింది. 2021-22 సం||లో పర్యావరణ, అటవీ, విజ్ఞాన, సాంకేతిక విభాగానికి 806 కోట్ల 47 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

సాగునీటి వనరులు
ప్రభుత్వం 54 జలయజ్ఞం ప్రాజెక్టులను చేపట్టగా, వాటిలో 14 పూర్తయ్యాయి. మిగిలిన 40 ప్రాజెక్టులు పూర్తయిన తరువాత, పెద్ద మరియు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల క్రింద 27 కోట్ల 62 లక్షల ఎకరాలు కొత్త నీటిపారుదల సామర్థ్యం కల్పించబడటమేకాక 5 కోట్ల 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. బహుళార్ధసాధక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టులో, 66.86% హెడ్ వర్కులు, 1.6 కుడి ప్రధాన కాలువ మరియు 69.96% ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయని మరియు పనులు వేగంగా జరుగుతున్నాయని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

శ్రీకాకుళం జిల్లాలోని 9 మండలాలలో, 45,000 ఎకరాల విస్తీర్ణంలో నీటిపారుదల సామర్ధ్యాన్ని సృష్టించే బొడ్డేపల్లి రాజగోపాల్ రావు వంశధార ప్రాజెక్టు 86% పూర్తయింది. ఇది 2021 జూలై నాటికి పూర్తవుతుందని అంచనా వేయబడింది. వంశధార మరియు నాగవాళి నదుల అనుసంధానం; మహేంద్రతనయ నదిపై ఆఫ్-షోర్ రిజర్వాయర్; సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ మరియు గజపతినగరం బ్రాంచ్ కాలువ; శ్రీ గొర్లె | శ్రీరాములు నాయుడు మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ 2వ దశ, పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ దశ, కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్: నెల్లూరు మరియు సంగం ఆనకట్టలు; గండికోట-చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్టులు; హంద్రీ-నీవ సుజల స్రవంతి ప్రాజెక్ట్; శ్రీ కృష్ణ దేవరాయ గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొదలగునవి మన ప్రభుత్వం అమలు చేస్తూన్న ఇతర ప్రధాన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి అధిక శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు 2021-22 సం॥లో పూర్తవుతాయని తెలియచేస్తున్నాను.

మన ప్రభుత్వం జలయజ్ఞం క్రింద నీటిపారుదలకొరకు నీటి లభ్యతను మెరుగుపర్చడం ద్వారా 9వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'స్థితిస్థాపకతతో కూడిన మౌళిక సదుపాయాల కల్పన, సమగ్ర మరియు స్థిరమైన పారిశ్రామీకరణను మరియు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు 2వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'ఆకలిని తీర్చడం, ఆహార భద్రతను సాధించడం, పోషణను మెరుగుపర్చడం మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం'లను సాధించే దిశగా చర్యలు చేపడుతూ ఉంది. 2021 22 సం||లో నీటి పారుదల శాఖకు 13,237 కోట్ల 78 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదించడమైనది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12.13% ఎక్కువ..

పరిశ్రమలు మరియు మౌళిక సదుపాయాలు
రాష్ట్రాన్ని వేగవంతమైన పారిశ్రామికీకరణ మార్గంలో నడిపించడానికి పెట్టుబడిదారులు ఆటంకాలను తొలగించి వారితో స్నేహపూర్వక విధానాలు అవలంభించి అనుకూలమైన వ్యాపార వాతావరణం, బలమైన పారిశ్రామిక మౌళిక సదుపాయాలు కల్పించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబింపచేస్తూ 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వే’ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. పారిశ్రామిక అభివృద్ధి విధానం 2020 23 ద్వారా, పారిశ్రామిక అభివృద్ధి కోసం వై.యస్.ఆర్. జగనన్న బడుగు వికాసం, విధానాలు మరియు పెట్టుబడుదారులకు జీవితకాలం ఉపయోగపడే ఎండ్-టు-ఎండ్ వ్యాపార నైపుణ్య కేంద్రమైన వై.యస్.ఆర్. ఎ.పి.-వన్ మొదలగు ఉత్తమ విధానాలను ప్రభుత్వం చేపట్టింది.

2020-21 సం॥లో కోవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ, మన రాష్ట్రం, ప్రపంచ మరియు దేశీయ పెట్టుబడిదారులకు నిరంతర ఆసక్తిని కలిగించగలిగింది. దీని ఫలితంగా లక్షల రూపాయలు పెట్టుబడులు రాగా, 39,578 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. ఈ విధంగా 17వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన ‘అమలు చేసే విధానాలను బలోపేతం చేయడం మరియు స్థిరమైన అభివృద్ధి కొరకు ప్రపంచ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం' చేరుకుంటాము. అదనంగా, 117 పెద్ద కంపెనీలు తమ తమ కంపెనీల ద్వారా రూ.31,668 కోట్ల పెట్టుబడితో పాటు 67,716 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడతాయి.

కడప జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాలలో, రూ.25 వేల కోట్ల పెట్టుబడితో, 2 లక్షల 50 వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా 'మెగా ఇండస్ట్రియల్ హబ్'ను మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇదే సమయంలో, స్థిరమైన పట్టణ మరియు పారిశ్రామిక మౌళిక సదుపాయాలను సృష్టించడానికి పారిశ్రామిక నడవలైన (కారిడార్లు) విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక నడవ (V.C.I.C.), చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవ (C.B.I.C.) మరియు హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక నడవ (H.B.I.C.) లతో వివిధ పారిశ్రామిక, నోడ్లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.

కోవిడ్-19 మహమ్మారి కలిగించిన కష్టనష్టాలను తొలగించడానికి, ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (M.S.M.E.)ల కోసం పునర్నిర్మాణ ప్యాకేజీని ప్రవేశపెట్టి, 11,238 యూనిట్లకు గాను, 904 కోట్ల 89 లక్షల రూపాయల ప్రోత్సాహకాలను విడుదల చేసింది. విద్యుత్తుపై లాక్డౌన్ సమయంలో కనీస డిమాండ్ ఛార్జీలను కూడా 3 నెలల పాటు మా ప్రభుత్వం మాఫీ చేసింది. 'వై.యస్.ఆర్. నవోదయం పథకం క్రింద 2,807 కోట్ల రూపాయల విలువైన 1 లక్ష 2 వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల రుణ ఖాతాలను పునరుద్ధరించడమైనది.

రాష్ట్రంలో మూడు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 2021 మార్చి 28 నుండి ఉయ్యాలవాడ నరశింహారెడ్డి ఓర్వకల్ విమానాశ్రయం షెడ్యూల్డ్ విమానాల సమన్వయంతో హైదరాబాద్ మరియు విశాఖపట్నంలకు వాణిజ్య సేవలను ప్రారంభించింది. 2021-22 సం॥లోగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు దగదర్తి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు భూసేకరణ పూర్తవుతుందని భావిస్తున్నాము.

ఆర్థిక మరియు ప్రాంతీయ అభివృద్ధి ప్రయత్నాలకు వ్యూహాత్మక దృష్టిని తీసుకురావడానికి 'కాన్సెప్ట్' సిటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ 'కాన్సెప్ట్' సిటీలు ప్రభుత్వ తోడ్పాటుతో, ప్రైవేటు రంగం నేతృత్వంలో ఆర్థికాభివృద్ధికే ఒక ప్రత్యేకమైన మరియు సమగ్రమైన నమూనాలు అవుతాయని చెప్పవచ్చు. మొదటి దశలో ఒక్కొక్క కాన్సెప్ట్ నగరానికి 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం చొప్పున, మూడు కాన్సెప్ట్ నగరాలుగా అనంతపురం, తిరుపతి మరియు విశాఖపట్నంలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.

2021-22 సం||లో పారిశ్రామిక మరియు మౌళిక సదుపాయాల అభివృద్ధికి 3,673 కోట్ల 34 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది 9వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'స్థితిస్థాపక మౌళిక సదుపాయాలను నిర్మించడం, సమగ్ర మరియు స్థిరమైన పారిశ్రామికీకరణ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం' లను సాధించడానికి సహాయపడుతుంది.

రవాణా మరియు రహదారి మౌళిక సదుపాయాలు

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD), పునరావాస మరియు పునర్నిర్మాణ ప్రణాళిక (R.R.PLAN). వామపక్ష ప్రభావిత ప్రాంతాలలో రహదారి అనుసంధాన ప్రాజెక్టులు (R.C.P.I.W.F), విదేశీ ఋణ సహాయ (R.A.P.) ప్రాజెక్టుల గ్రామీణ రహదారులను బలోపేతం చేయడం, బి.టి. యేతర రహదారులను బి.టి. ప్రమాణాలకు తగ్గట్టుగా మెరుగుపరచడం, మండల ప్రధాన కార్యాలయాలను అనుసంధానించే సింగిల్ లేన్ రహదారులను డబుల్ లేన్ రహదారులగా వెడల్పు చేయడం మరియు వంతెనల నిర్మాణం వంటి పనులను ప్రభుత్వం చేపట్టింది. 'న్యూ డెవలప్మెంట్ బ్యాంక్' రుణ సహాయం ద్వారా 6,400 కోట్ల రూపాయలతో మా ప్రభుత్వం రెండు ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. 2021-22సం॥లో రవాణా, రోడ్లు, భవనాల శాఖకు 7,594 కోట్ల 6 లక్షల రూపాయలు కేటాయింపును ప్రతిపాదించడమైనది.

ఇంధన రంగం
ప్రభుత్వం రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్తును 18 లక్షల 40 వేల వ్యవసాయ పంపు సెట్లకు సరఫరా చేయడమేగాక, 21 లక్షల 73 వేల షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల దేశీయ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తోంది. వీటితోపాటు గ్రామీణ ఉద్యానవన నర్సరీలకు, ధోభీ ఘాట్లకు, దారిద్ర్యరేఖకు దిగువనున్న (B.P.L.) రజక సంఘాలకు, చాలా వెనుకబడిన కుల సంఘాలకు, చేనేత కార్మికులకు, క్షౌరశాలలకు, బంగారు అనుకరణ ఆభరణాల యూనిట్లకు కూడా ప్రత్యక్ష నగదు బదలీ పథకం ద్వారా రాయితీ విద్యుత్ను అందిస్తున్నాము. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రాయితీ విద్యుత్ను అందించడం ద్వారా 7వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన, 'సరసమైన, నమ్మకమైన, స్థిరమైన మరియు ఆధునిక విద్యుత్ శక్తి అందించటం' ను సాధిస్తున్నాము.

ఇంధన రంగంలో సంస్కరణ ఆధారిత చర్యలను ముందుకు తీసుకొనిపోవడం ద్వారా, ఉచిత విద్యుత్ కోసమై ప్రత్యక్ష నగదు బదలీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. రైతులు వినియోగించే విద్యుత్తు యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని కొలవడానికి, వ్యవసాయ పంపు సెట్లకు పొలాలలో మీటర్లను ఏర్పాటు చేసి తత్సంబంధిత విద్యుత్ వినియోగ ఖర్చు సొమ్మును రైతు ఖాతాకు నేరుగా జమ చేయాలని ప్రభుత్వ సంకల్పం.
2021-22 సం||లో, నేను ఇంధన రంగానికి 6,637 కోట్ల 24 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పరిపాలన
16వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'శాంతియుత మరియు సమగ్ర సమాజాలను ప్రోత్సహించడం, అందరికీ న్యాయం కల్పించడం మరియు అన్ని స్థాయిలలోసమర్థవంతమైన, జవాబుదారీ మరియు సమగ్ర సంస్థలను నిర్మించడం'లకు అనుగుణంగా ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల వ్యవస్థలను ప్రారంభించింది. ఈ సంస్థల ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరైంది. రెవెన్యూ సేవలు, భూ దస్తావేజుల సేవలు, ధృవపత్రాల జారీ మొదలైన అనేక సేవలు గ్రామ మరియు వార్డు సచివాలయాలతో అనుసంధానించబడ్డాయి. అంతేకాకుండా, రాష్ట్రంలో పునః సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు, నిజమైన హక్కుదారులకు నవీకరించబడిన ప్రాథమిక రికార్డులను అందించడానికి, పునర్వవ్యవస్థీకరణ కార్యకలాపాలను వ్యవస్థీకృత పద్ధతిలో నిర్వహించడానికి, భూమి లావాదేవీల రికార్డులను సమయానుసారంగా ప్రభుత్వం తయారు చేసింది.

2021, ఏప్రిల్ 12, ఉగాది రోజున ప్రభుత్వం, కులం, మతం, ప్రాంతం వివక్ష లేకుండా, రాజకీయాలకు అతీతంగా, అవినీతి జాడలేకుండా, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసినందుకుగాను మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హతగల ప్రతి పౌరుని వద్దకు వచ్చేలా చూసినందుకు 2 లక్షల 23 వేల మంది గ్రామ మరియు వార్డ్ వాలంటీర్లు 228 కోట్ల 74 లక్షల రూపాయల నగదు పారితోషకంతో పాటు సత్కరించింది.

2020 సంవత్సరములో మన గౌరవ ముఖ్యమంత్రిగారిని దక్షిణ ఆసియాలో నున్న మానవ అభివృద్ధి ప్రాంతీయ డైరెక్టర్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం కలిసిన సందర్భములో, వివిధ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలుపుతామని ఈ బృందం హామీ ఇవ్వడం జరిగింది. అంతేగాక, రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిగారు 3,648 కిలోమీటర్ల 'పాదయాత్ర' చేపట్టడం ద్వారా అట్టడుగుస్థాయిలోనున్న ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని విద్య, ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాలలో వారు చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచ బ్యాంక్ బృందం ప్రశంసించింది. గ్రామ స్థాయి నుండే డేటాను అందుబాటులో ఉంచి, వార్డ్ మరియు గ్రామ సచివాలయాల ద్వారా ఇ-గవర్నెన్స్ అమలు చేయడం సరైన దిశలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని కూడా ఈ బృందం అభిప్రాయపడింది. ప్రస్తుతంప్రపంచ బ్యాంక్ మద్దతుతో 250 మిలియన్ల డాలర్ల ఎస్.ఎ.ఎల్.టి. (SALT), ఇ.ఎ.పి. ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్లో అభ్యసన సంబంధ పరివర్తన ప్రాజెక్టు చేయబడుతోంది. ప్రాథమిక స్థాయిలో పునాది బలపరచడానికి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య పరస్పర అవగాహన పెంచడానికి మరియు పాఠశాలల నిర్వహణను మెరుగుపరచటానికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.

ఆర్థిక వృద్ధి తీరుతెన్నుల సమీక్ష
2019-20 లెక్కలు

2019 ఏప్రిల్ 1 నుండి 2020 మార్చి 31 వరకు గల ఆర్థిక సంవత్సరానికి గాను, ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారి అంతిమ లెక్కల ప్రకారం రెవిన్యూ లోటు 60.5 కోట్లు, ద్రవ్యలోటు 39,684 కోట్లు గాను ఉంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (G.S.D.P.) పై, రెవిన్యూ లోటు 2.71% గాను, ద్రవ్యలోటు 4.08% గాను ఉంది.

సవరించిన అంచనాలు 2020-21
సవరించిన అంచనాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ వ్యయం రూ.1,52,990 కోట్లు, మూలధన వ్యయం రూ.18,797 కోట్లు, 2020-21 సం॥లో రెవెన్యూ లోటు సుమారు రూ.34,927 కోట్లు కాగా, ఇదే కాలానికి ద్రవ్య లోటు రూ.54,369 కోట్లు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 3.54% మరియు 5.1%గా ఉన్నాయి.

బడ్జెటు అంచనాలు 2021-22
87. 2021-22 ఆర్ధిక సంవత్సరానికిగాను, నేను రూ.2,29,779,27 కోట్లు వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవిన్యూ వ్యయం రూ.1,82,196.54 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. రుణాలను తిరిగి చెల్లించడం కొరకు మరియు మూలధన పంపిణీలకు గల కేటాయింపులతో కలిపి మొత్తం మూలధన వ్యయమును సుమారు రూ.47,582.73 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. రెవెన్యూ లోటు సుమారు రూ.5,000.05 కోట్లు మరియు ద్రవ్య లోటు సుమారు రూ.37,029, 79 కోట్లుగా అంచనా వేయడమైంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GS.D.P.) లో ద్రవ్య లోటు 3.4%గాను, రెవెన్యూ లోటు 0.47% గాను ఉంటుంది.

ముగింపు మాటలు
ఐక్యరాజ్య సమితి ద్వారా నిర్దేశించబడిన, 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందంజలో ఉండటమే కాకుండా, మన ప్రభుత్వం కొత్త ఒరవడితో చేపట్టిన అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఆరోగ్యశ్రీ మరియు రైతు భరోసా వంటి పథకాలను కూడా లక్ష్య సాధన దిశగా ముందుకు తీసుకు వెళ్తుంది.

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల సమిష్టి కృషి మరియు సహకారం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రిగారి నాయకత్వంలో రూపుదిద్దుకుంటోంది. మన నాయకుని విశేషమైన శ్రమతో కూడిన ప్రయత్నాలు, నిర్ణయాత్మక విధానాలు మరియు సదుద్దేశంతో కూడిన చొరవ ద్వారా రాబోయే తరతరాలు 'తమ సొంత ఇల్లు' అని సగర్వంగా భావించేలా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుంది. మన రాష్ట్ర పౌరుల భవిష్యత్తుపై పెట్టుబడులు పెట్టడం మరియు వారి నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడానికి వారికి అధికారం ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క నిరంతర ప్రయత్నంగా కొనసాగుతుంది.

కోవిడ్-19 మహమ్మారి మన ఓర్పుకు పరీక్ష పెట్టింది. ప్రపంచం గతంలో ఎన్నో కష్టసమయాలను చూసింది. మిగిలిన వాటికి, ఈ సంక్షోభానికి తేడా ఏమిటంటేప్రస్తుత సంక్షోభం మొత్తం ప్రపంచాన్ని దాదాపు ఒకేసారి ముంచెత్తింది. అందువల్ల ఇటువంటి ప్రతికూలతలను ఎదుర్కోవడానికి స్థానిక సమాజాలే కాక ప్రాంతీయ ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. ఈ మహమ్మారిని సమిష్టిగా ఎదుర్కొనే సమయంలో ప్రజలు అరుదైన నాయకత్వ లక్షణాలను ఆదర్శప్రాయమైన ధైర్యాన్ని మరియు కరుణతో కూడిన నిస్వార్థ సేవను ప్రదర్శించడాన్ని చూస్తున్నాము. ఇదంతా ఉజ్వల భవిష్యత్తుకై ఆశావహ దృక్పథం తో మానవ జాతి చేసే నిరంతర ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఒక రాష్ట్రంగా మనంకూడా చీకటి అంచున ఉన్న వెలుతురుపై దృష్టిని కేంద్రీకరించి ఈ మహమ్మారి నిర్మూలనకై ఇదే తరహాలో సమిష్టిగా పోరాడుదాము.

జై ఆంధ్రప్రదేశ్.. జై హింద్.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top