గత ఐదేళ్ల్లలో ఐటీ అభివృద్ధికి చేసిందేమీ లేదు

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అమరావతి: గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఐటీ ఇన్సెటీవ్స్‌పై ఆర్థిక మంత్రి సభలో మాట్లాడారు. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసి ఉంటే వైజాగ్‌ అంతో ఇంతో అభివృద్ధి చెందేదని చెప్పారు. విభజన అనంతరం ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు విశాఖ అనుకూలమైన ప్రాంతమన్నారు. ఉద్దేశపూర్వకంగా టీడీపీ అభివృద్ధి చేయలేదన్నారు. ఐటీ సంస్థలన్నీ కూడా టీడీపీకి నచ్చిన చోట పెట్టాలంటే పారిశ్రామికవేత్తలకు నచ్చలేదన్నారు.

టీడీపీ హయాంలో రూ.1006 కోట్లు కేటాయిస్తే..ఖర్చు చేసింది రూ.464 కోట్లు మాత్రమే అన్నారు. మేం కేటాయించింది రూ. 453 కోట్లు అని వివరించారు. తేడా ఏమైనా ఉందా అని ప్రశ్నించారు.ఐటీ పరిశ్రమలకు ఇన్సెటివ్‌ 2014–15లో రూ.212 కోట్లు కేటాయించగా రూ.1.20 కోట్లు ఖర్చు చేశారన్నారు. 2016–2017లో ఇన్సెటివ్‌ రూ.220 కోట్లు కేటాయిస్తే..రూ.2. 33 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. 2017–18లో రూ.25 కోట్లు కేటాయించారు. రూ.15.64 కోట్లు ఖర్చు చేశారు. 2018–2019లో రూ.400 కోట్లు ఇన్సెటివ్స్‌ కేటాయించారని, ఖర్చు చేసింది మాత్రం రూ.18.54 కోట్లు ఖర్చు చేశారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఐటీ ఇన్సెటివ్స్‌కు రూ.4500 కోట్లు ఐదేళ్లలో కేటాయించి..రూ.39 కోట్లు ఖర్చు చేశారని బుగ్గన వివరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తానే ప్రపంచానికి టెక్నాలజీ నేర్పించారని ఇదే సభలో చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రకృతితో యుద్ధమన్నారని, హుద్‌హుద్‌ మనల్ని చూసి భయపడుతుందన్నారని చంద్రబాబు వ్యాఖ్యలను సభలో ప్రస్తావించారు. 
 

Back to Top