ఇది చాలా చారిత్రాత్మక సమావేశం

 మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయం

హైద‌రాబాద్‌: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన సమావేశం చాలా చారిత్రాత్మకమైనదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈటల రాజేందర్  సాయంత్రం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఈ సంద‌ర్భంగా బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమావేశంలో పునర్విభజన చట్టంలోని అంశాలపై చర్చించామని చెప్పారు. నదీ జలాలను ఇరు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించి, షెడ్యూల్‌ 9, 10లోని అంశాలను పరిష్కరించే దిశగా చర్చించామని చెప్పారు. నదీ జలాల వినియోగంపై జులై 15 లోగా ప్రాథమిక నివేదిక సిద్ధమవుతుందన్నారు.  రెండు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయమని, సమస్యలు పరిష్కరించుకుంటేనే రాష్ట్రాలు బాగుపడతాయని, తెలంగాణ, ఏపీలు గొప్ప వ్యవసాయ రాష్ట్రాలుగా ఎదగాలని ఈటల ఆకాంక్షించారు.

Back to Top