తప్పు చేసినవారెవరైనా శిక్ష అనుభవించాల్సిందే

దమ్ముంటే నిరూపించమని.. దర్యాప్తును అడ్డుకోవడం విడ్డూరం 

అమరావతి భూకుంభకోణంపై ఆధారాలన్నీ ఉన్నాయి

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో చంద్రబాబు, లోకేష్‌ల పాత్ర

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం

అమరావతి: అమరావతి పేరుతో చెప్పి పేద ప్రజలను దోచుకుతిన్నారని, రాజధాని పేరుతో భారీ అవినీతి జరిగిందని, ఇందులో చంద్రబాబు, లోకేష్, వారి తాబేదారులు, తొత్తుల ప్రమేయం ఉందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందనన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల పరీక్షలపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు దమ్ముంటే నిరూపించండి అని మాట్లాడిన టీడీపీ నేతలే ఇప్పుడు దర్యాప్తు అవసరం లేదని కోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పు చేసిన వారికి శిక్షపడేలా న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 

అమరావతిలో భారీగా భూకుంభకోణం జరిగిందని, అందులో పలానా వ్యక్తుల ప్రమేయం ఉందని అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరించారని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. దమ్ముంటే నిరూపించండి అని టీడీపీ నేతలు మాట్లాడారని, అసెంబ్లీలో చర్చ తరువాతే సిట్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. భూకుంభకోణంపై దర్యాప్తు నివేదికను ఏసీబీ అధికారులకు అందజేసి విచారణ చేయమని చెప్పామన్నారు. 

 ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో చంద్రబాబు, లోకేష్‌లతో పాటు వారి తాబేదారులు ఉన్నారని, అన్నింటినీ ఆధారాలతో సహా బయటపెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని పలానా ప్రాంతంలో వస్తుందని లీకులు ఇచ్చి అమరావతి చుట్టూ వేలాది ఎకరాలను వారి తాబేదారులతో చంద్రబాబు కొనుగోలు చేయించారన్నారు. దానికి సంబంధించిన సాక్షాలు, ఆధారాలు ఉన్నాయన్నారు. తప్పు చేసినవారు తప్పించుకునే ప్రసక్తే లేదని, కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ఏ విషయానైనా రాజకీయం చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఆలయాల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలపై కూడా రాజకీయం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు.  
 

తాజా వీడియోలు

Back to Top