విశాఖపట్నం: నాలుగు ప్రాంతాల్లో నాలుగు సిద్ధం బహిరంగ సభలను ఏర్పాటు చేశామని, సభలకు విశేషమైన స్పందన వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సిద్ధం సభకు వచ్చిన లక్షలాది మంది ప్రతిపక్ష పార్టీలకు కనిపించలేదా? అని ఫైర్ అయ్యారు. విశాఖలో మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘నేను మేలు చేస్తేనే ఓటు వేయని సీఎం జగన్ చెపుతున్నారు. లక్షలాది మంది వచ్చి సీఎం వైయస్ జగన్‌కు ఆశీర్వాదం తెలిపారు. పొత్తులు పెట్టుకున్న పార్టీలు గతంలో చాలా తిట్టుకున్నాయి. బీజేపీ, టీడీపీ నేతలు ఎలా తిట్టారో ప్రజలంటా చూశారు. బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చారు. ఇప్పుడు మళ్లీ అవే పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తుల కోసం చంద్రబాబు పవన్ కల్యాణ్ వెంపర్లాడుతున్నారు. మేలు జరిగితేనే మళ్లీ ఆశీర్వదించమన్న దమ్మున్న నేత జగన్‌గారుః* ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్‌ఆర్‌సీపీ కేడర్‌కు, ప్రజలకు మా పార్టీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు నిన్న మేదరమెట్ల సిద్ధం సభ ద్వారా సందేశం అందజేశారు. ఇప్పటి వరకు మా పార్టీ ఆధ్వర్యంలో నాలుగు సిద్ధం సభలు నిర్వహించాం. ఈ సభలకు అశేషంగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలే మా పార్టీ బలం. మా అధినేత జగన్ గారు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు. నేను నాలుగేళ్ల పది నెలల కాలంలో మీ అందరి దయతో.. మీ అందరి మద్దతుతో ..మీ ఆశీస్సులతో పరిపాలన చేశానని.. ఇన్నాళ్ల నా పాలనలో మీ కుటుంబానికి మేలు జరిగిందని అనుకుంటే ..మీరు మళ్లీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండని కోరుతూ పిలుపునిచ్చారు. నాకు తెలిసి రాజకీయాల్లో ఏ నాయకుడూ ఎన్నికల్లో ఈ విధంగా అడగలేదు. ఏదో మాయ మాటలతో మడమతిప్పి ప్రజల్ని మభ్య పెట్టిన నాయకుల్నే చూశాం గానీ.. జగన్‌మోహన్‌రెడ్డి గారిలాంటి నిజాయితీ గల మాట చెప్పి.. ఓటు అడిగే నాయకుడ్ని ఇప్పుడే చూస్తున్నాం. *నిజం చెబితే చంద్రబాబు తల వెయ్యి వక్కలుః* రాజకీయాల్లో కన్నార్పకుండా అబద్దాలు పలికే నాయకుడెవరని అంటే.. చంద్రబాబు నాయుడు పేరు ఎవరైనా టక్కున చెప్పగలుగుతారు. సత్యదూరమైన మాటలు తప్ప ఆయనకు నిజాలు పలికే అలవాటే లేదు. అందుకే, దివంగత వైఎస్‌ఆర్ గారు నాడు చంద్రబాబును ఉద్దేశించి హాస్యంగా ఒక మాట అనేవారు. నిజం చెబితే చంద్రబాబు తల వెయ్యి వక్కలవుతుందని ఆయనకు శాపం ఉందనేవారు. ఆ మాటను ఆయన ఈనాటికీ నిజం చేస్తూనే ఉన్నారు. అదే మా నాయకుడు జగన్ గారు మాత్రం తన ఐదేళ్ల పాలనలో ప్రతీ ఇంటికీ మంచి చేశానని.. ప్రతీ గడపకూ ప్రభుత్వం తాలూకూ సంక్షేమాన్ని అందించానని.. చేసిన మేలును వివరించుకుంటూ.. భవిష్యత్తులోనూ ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే విషయంపై ప్రజాభిప్రాయం స్వీకరిస్తూనే మరోమారు ఆశీర్వదించమని కోరుతున్నారు. అందుకే, జగన్ గారి పట్ల మా పార్టీ కేడర్‌లోనూ.. ప్రజల్లోనూ పూర్తి నమ్మకం వచ్చింది గనుకే, లక్షలాదిగా సిద్దం సభలకొచ్చి ఆయనకు ఆశీర్వాదం తెలుపుతున్నారు. *పొత్తుల పేరిట ఢిల్లీలో వెంపర్లాట సిగ్గుచేటుః* గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ, మరో సెలబ్రిటీ పార్టీ నేతల పొత్తుల ఆరాటం.. ఢిల్లీ చుట్టూ వెంపర్లాడటం అందరం చూస్తూనే ఉన్నారు. బీజేపీ పెద్దల కాళ్ల దగ్గరకు వెళ్లి మీరేం చెబుతారో చెప్పండి.. మా తలుపులన్నీ తెరిచే ఉన్నాయంటూ .. ఆ పార్టీతో పొత్తు కోసం ఎంతగా ప్రాధేయపడ్డారో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. పొత్తులు చేసుకోవడం.. పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లడం ప్రజాస్వామ్యంలో సహజమే గానీ.. ఈ రకమైన వెంపర్లాటతో కాళ్ల బేరాలకు దిగజారిన వాతావరణాన్ని మాత్రం ప్రజలు మొట్టమొదటగా చూస్తున్నారు. వీళ్లేమైనా కొత్త పార్టీ నేతలా అంటే కాదు. ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకుని.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా నేను ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని చంద్రబాబు .. రాష్ట్రంలోని ఆ గుమ్మం ఈ గుమ్మం తొక్కుకుంటూ చివరికి ఢిల్లీగుమ్మంలో పొత్తుకు పడిగాపులు పడటం అనేది రాష్ట్ర ప్రజానీకానికి అత్యంత బాధాకరంగా ఉంది. చంద్రబాబు తీరును అసహ్యించుకుంటూ.. చాలా సిగ్గుచేటుగా చర్చించుకుంటున్నారు. *పొలిటికల్ కట్టప్ప.. వెన్నుపోటుదారు చంద్రబాబుః* చంద్రబాబు నీచ రాజకీయం గురించి బీజేపీ నేతల అభిప్రాయం ఎలా ఉందనేది సోషల్‌మీడియాలో ఈరోజు ఉదయం నేనొక వీడియో చూశాను. (మొబైల్‌లో ఒక వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించి చూపారు) సదరు నేత వచ్చీరాని తెలుగులో కూడా చంద్రబాబు రాజకీయ దిగజారుడుతనాన్ని అర్ధవంతంగా వివరించారు. బాహుబలిలాంటి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన పొలిటికల్ కట్టప్పగా చంద్రబాబును ఆయన పోల్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల వెన్నుపోటుదారుగా చంద్రబాబు పేరు చెప్పుకొచ్చాడు. అదేవిధంగా అమరావతి రైతుల్ని రాజధాని పేరుతో సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబేనని తేల్చి చెప్పాడు. అలాంటి బీజేపీ నేతలతోనే పొత్తులకోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నాడంటే.. ఆంధ్ర ప్రజలంతా పిచ్చోళ్లఅనుకుంటున్నారా..? రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యత ఉందని మీకు తెలియదా..? మరీ, అంత నీచ రాజకీయాలకు దిగజారతారా.?? అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. *రాష్ట్రం తాలూకా తేల్చుకోవాల్సి అంశాలపై ఏం చెబుతారు..?* కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. వాటి గురించి అధికారంలో ఉన్నప్పుడూ చంద్రబాబు ఆలోచించలేదు. ఇవాల్టిటికీ అదే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నప్పుడూ కూడా వాటి గురించి ఆలోచన చేయడంలేదు. ప్రత్యేకహోదా, పోలవరంతో పాటు ప్రధానంగా విశాఖపట్టణం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి బీజేపీతో ఏం మాట తీసుకున్నారు..? రేపోమాపో పొత్తులు పెట్టుకున్న పార్టీల పెద్దలంతా రాష్ట్రానికి వస్తారు కదా..? మరి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ గురించి ఏం చెబుతారో చెప్పమనండి..? రాష్ట్ర ప్రజలకు, విశాఖ వాసులకు స్టీల్‌ప్లాంట్‌పై ఏమని చెబుతారో .. మేమూ చూస్తాం. *బాబుకున్న పిరికి స్వభావం జగన్‌గారిలో లేదుః* అధికారం అనేది శాశ్వతం కాదు.. చరిత్రలో నిలిచిపోయే మహానుభావుల్లో నేనూ ఒకరిగా ఉండాలని కోరుకుంటానంటూ నిన్న సిద్ధం సభలో మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. దానిని కూడా ఏదేదో వక్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతిపక్షలు నానా తంటాలు పడుతున్నాయి. అంటే, మీరు ఏది ప్రచారం చేస్తే.. దాన్ని నిజమని నమ్మేందుకు ప్రజలు అమాయకులనుకుంటున్నారా..? ఆ మాట జగన్ గారు ఎందుకన్నారంటే.. అతని ధైర్యానికి, స్థైర్యానికి నిదర్శనంగా .. మీకొక ఛాలెంజ్ విసిరారు. నేను ఈ ఐదేళ్లు ప్రభుత్వాన్ని సమర్ధంగా నడిపి ప్రజలకు మంచి చేశాను గనుక అందరూ హర్షిస్తారనే ధైర్యంతో మనోస్థైర్యంతో మాట్లాడిన మాటలవి. అంతేగానీ, చంద్రబాబులా పిరికి మాటలు మాట్లాడే స్వభావం జగన్‌గారికి లేదు. *మా ప్రభుత్వానికి ప్రజా మద్ధతు పెరిగిందిః* రాష్ట్ర్రంలో ప్రజల జీవన విధానం మారింది. వారి ఆదాయం పెరిగింది. రాష్ట్ర జీడీపీ పెరిగింది. వ్యవసాయానికి సంబంధించి వాటి ఉత్పత్తులు పెరిగాయి. రైతులకు పంటల పెట్టుబడి పెట్టే ఆర్థికస్థోమత పెరిగి వారు హాయిగా ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరుకుతుంది. ఎరువులు, విత్తనాల కోసం ఎక్కడికో వెళ్లి పడిగాపులు పడకుండా .. ఇంటి ముందు ఆర్బీకే కేంద్రాల్లో నాణ్యమైన వాటిని అందిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి ముంగిటకే ప్రభుత్వ పరిపాలన వచ్చిందో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కాపుసోదరులు అందాల్సిన సంక్షేమం అందుతుందో.. పేద బిడ్డల చదువుకు ఇంగ్లీషు మీడియం రాచబాట దొరికిందో.. అందరూ ఈ ప్రభుత్వం పట్ల చాలా సంతృప్తితో ఉన్నారు. *175కి 175 చోట్లా గెలుపునకు స్పష్టమైన సందేశంః* ఒక వైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలు విజయవంతం కావడం.. మరోవైపు టీడీపీ, సెలబ్రిటీ పార్టీలు బీజేపీతో పొత్తుల కోసం వెంపర్లాడటం వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చారు. ప్రస్తుతమున్న వైఎస్‌ఆర్‌సీపీ స్థానాలు 151 నుంచి 175కి 175 సీట్లును గెలిపించి మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే సందేశమిస్తోన్న వాతావరణమని చెబుతున్నాం. పొత్తులు పేరుతో మూడు పార్టీలు కాదు.. ముఫ్పై పార్టీలు కలిసొచ్చినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఢీ కొట్టలేరనేది స్పష్టం. *గ్రాఫిక్స్ అనే బలుపు భ్రమల్లో బతకమనండిః* చంద్రబాబు బతుకంతా అబద్ధాలేనని అందరికీ తెలుసు. ఆయన్ను భుజానెత్తుకుని మోసే పచ్చమీడియా ఛానెళ్లు, పత్రికలు కూడా అదే పచ్చ కామెర్లతో చూస్తే ఏం చేస్తాం.. మా సభలకు జనాలు రావడంలేదనే భ్రమల్లోనో.. తరలి వస్తున్న ప్రజలంతా గ్రాఫిక్సేననే బలుపుతోనే బతకమనండి. ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభల్లో ఒకటికి మించి ఒకచోట లక్షలాదిగా ప్రజలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలివస్తుంటే.. ఆ అభిమాన వెల్లువను ప్రతిపక్షాలు తక్కువ అంచనా వేసుకుంటే నష్టపోయేది మేము కాదు. వాళ్లేనని గ్రహించాలి. ప్రజల్లోనూ ఎవరు సమర్ధులో.. ఎవరు అసమర్థులో స్పష్టత వచ్చింది కాబట్టే.. మా పార్టీ సభలు అంతగా విజయవంతమవుతున్నాయి.