అమరావతి: దేశంలోని 100 విశ్వవిద్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాలయాలు కూడా చోటు పొందేలా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసన మండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండాలని సీఎం సూచించారని తెలిపారు. రాష్ట్రంలో 46 వేల స్కూళ్లు నాడు-నేడు కింద అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మన బడి నాడు-నేడు రెండో దశ పనులు జరుగుతున్నాయి. సింగిల్ టీచర్ ఉన్న స్కూల్‌లో సైతం మన బడి నాడు-నేడు అమలు జరుగుతోందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లలో విద్యకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉండేలా చర్యలుచేపడతామన్నారు. బైజూస్ 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ ఇస్తామని కోరితే సీఎం అంగీకరించారని తెలిపారు. బైజూస్‌కు ప్రభుత్వం ఒక రూపాయి కూడా చెల్లించలేదని స్పష్టం చేశారు. టెండర్ల ప్రకారమే పారదర్శకంగా ట్యాబ్‌లు కొనుగోలు జరిగిందని ఉద్ఘాటించారు. బైజూస్ కంటెంట్ అంశంలో కొన్ని పత్రికలు అవాస్తవాలను రాస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.