విజయవాడ: దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఏపీలో ఆ పార్టీ లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఉనికి కోసమే బీజేపీ విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీ కాబట్టి బహిరంగ సభ నిర్వహించుకుంటోందన్నారు. విజయవాడలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తాపత్రయపడుతూ బీజేపీ ఈ రోజు సభ నిర్వహిస్తోందన్నారు. ఉనికి కాపాడుకోవడానికి పెట్టే సభ తప్ప ఏమీ ఉపయోగం లేదన్నారు. గత నాలుగురోజులగా బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోనే నీతి ఆయోగ్ రాష్ట్రాలకి ర్యాంకులు ఇచ్చిందని.. బీజేపీ పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ ఏ ర్యాంకులో ఉంది.. మన రాష్ట్రం ఏ ర్యాంకులో ఉందో చూసామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఎందుకు వెనుకుబాటులో ఉందో ముందు దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటిఎస్ అనేది స్వచ్ఛంద పథకం.. ఎవరిపై బలవంతం లేదని పదే పదే చెబుతున్నా తప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి బొత్స అన్నారు.