తాడేపల్లి: వాస్తవాలు తెలుసుకోకుండా ఎందుకు రాతలు రాస్తున్నారో అర్థం కావడం లేదు.. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు పనికిమాలిన వార్తలన్నీ రాస్తారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎల్లో మీడియాపై ధ్వజమెత్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, కరకట్ట రోడ్డును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సైతం సిద్ధం చేసిందన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డును కాజా వరకు పొడిగించాలని, కరకట్ట రోడ్డును రూ.150 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు తాత్కాలిక భవనాల పేరుతో అసెంబ్లీ, సచివాలయం, కోర్టు కట్టి.. యాక్సెస్ రోడ్డు కూడా వేయకపోవడం దుర్మార్గమని, ఐదు సంవత్సరాలు ఏం చేశారని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీడ్ యాక్సెస్ రోడ్డు చంద్రబాబు హయాంలో పెట్టిన గ్రాఫిక్స్‌లో ఒక భాగమని, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి.. బాండ్స్ అమ్మి అరకొరగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించారన్నారు. అదేదో చంద్రబాబు చేసిన అద్భుతం అన్నట్లుగా అప్పట్లో ఎల్లోమీడియా రాతలు రాసిందని గుర్తుచేశారు. అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన రైతులకు 1000, 1200 గజాల స్థలాలను అభివృద్ధి చేసి ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించిందని, దాన్ని నెరవేర్చడానికి వైయస్ జగన్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ ప్రాంతంలోని ప్లాట్లు ఇచ్చిన వారికి నీరు, రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పించాలి కాబట్టి.. లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే మొదటి విడతలో రూ.3 వేల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకురాబోతున్నామని వివరించారు. చంద్రబాబు హయాంలో కరకట్ట రోడ్డు నిర్మాణానికి రూ.550 కోట్లు అంచనాలు వేశారని, చంద్రబాబు ఇంటి నుంచి మంతెన సత్యనారాయణ ఆశ్రమం దాటి రెండు కిలోమీటర్ల వరకు రెండు పక్కలా రాతిగోడ కట్టడానికి రూ.300 కోట్లు పెట్టారన్నారు. ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయదల్చారో ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు. రోడ్డు నిర్మించారా అంటే అదీ లేదని ఎద్దేవా చేశారు. రోడ్డును మణిపాల్ ఆస్పత్రి వరకు తీసుకురావాలంటే.. ఆరు కిలోమీటర్లు పొడిగించాలని, మధ్యలో రెండు బ్రిడ్జీలు నిర్మించాలని, ఆ ఆరు కిలోమీటర్ల రోడ్డుకు సంబంధించిన భూసేకరణ కూడా చంద్రబాబు చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు అమరావతి రోడ్డును ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు.. ఎవరైనా అడ్డుపెట్టారా..? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్తుంటే.. పచ్చ పత్రికలు దిగజారి రాతలు రాయడం సమంజసం కాదని, వాస్తవాలు తెలియకపోతే తెలుసుకొని రాయాలని సూచించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, దుబారా ఖర్చులు, ప్రజాధనం వృథా చేయడం సీఎంకు ఇష్టం లేదన్నారు. ఏ పని చేసినా నిర్దిష్టమైన కార్యాచరణతో చేస్తామని పునరుద్ఘాటించారు.