విశాఖపట్నం: సుప్రీంకోర్టు, హైకోర్టులపై తమకు గౌరవం, రాజ్యాంగంపై విశ్వాసం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రూపంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అన్ని అంశాలు వివరించారని తెలిపారు. దేశంలో రాజ్యాంగంపై గౌరవం ఉన్న వ్యక్తులు స్పందించాలని, తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రభుత్వ సలహాదారులు అజేయ్ కల్లం ఇప్పటికే వివరించారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అన్ని జిల్లాల ప్రజలు హర్షిస్తున్నారు.. రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని జిల్లాల ప్రజలు హర్షిస్తున్నారని.. చంద్రబాబు, అతని పెయిడ్ అర్టిస్టులు మాత్రమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నారని దుయ్యబట్టారు. ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని చిత్రాలు ప్రజలకు చూపించారని ఎద్దేవా చేశారు. త్వరలోనే సిట్ దర్యాప్తు పూర్తి.. విశాఖ భూ కుంభకోణంపై త్వరలోనే సిట్ దర్యాప్తు పూర్తవుతుందని, దేనిపైనైనా విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మాన్సాస్ వ్యవహారం కుటుంబ తగదా.. ప్రభుత్వానికి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తెలిపారు. అబద్ధాలు చెప్పడానికి అశోక్ గజపతిరాజు వ్యక్తిత్వం ఏమైందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధమవుతుందని, త్వరలో ఆఫీస్ కూడా ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.