ఏ ఒక్కరూ అన్నం లేక పస్తులు ఉండకూడదు

ఆ ప్రకారమే సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు

రేపటి నుంచి మరోసారి రేషన్‌ పంపిణీ చేయనున్నాం

రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు

త్వరలోనే అందుబాటులోకి వైయస్‌ఆర్‌ జనతా బజార్లు

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరూ తినడానికి తిండి లేక పస్తులు ఉండకూడదనేది సీఎం ఆలోచన అని, అందరికీ రేషన్‌ పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కోవిడ్‌-19 నియంత్రణకు ఒకపక్క చర్యలు తీసుకుంటూనే మరోపక్క రైతులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి బొత్స వివరించారు. గంటగంటకు సమీక్షలు జరుపుతూ అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసిన అనంతరం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..

దేశంలోనూ, రాష్ట్రంలోనూ అందరూ కూడా కేంద్రం ఇచ్చిన సూచనలను, మన రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలను ఈ రోజుకు ప్రజలంతా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. మళ్లీ ఈ రోజు ప్రధానమంత్రి సందేశంలో 20వ తేదీ వరకు కొనసాగించాలని, తరువాత కొన్ని ప్రాంతాల సడలింపులతో మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని ప్రధాని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో సీఎం వైయస్‌ జగన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా జిల్లాల్లో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి సీఎం సమీక్ష జరిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేస్తూ మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారు 60 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ పంటల కొనుగోలు విధానంపై చర్చించి తగు సూచనలు చేశారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా రైతుల వద్దకే వెళ్లి ధాన్యం సమీకరించాలని ఆదేశించారు.

ఒకటి నుంచి నిన్నటి వరకు ఇచ్చిన రేషన్‌ అందరికీ అందిందా.. లేదా అని తెలుసుకున్నారు. రేపటి నుంచి మళ్లీ రేషన్‌ పంపిణీ చేయనున్నాం. ఆ నేపథ్యంలో గతంలో రేషన్‌ పంపిణీలో ఎదురైన ఇబ్బందులు అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం వైయస్‌ జగన్‌ పలు సూచనలు చేశారు. రేషన్‌ షాపులకు అనుబంధంగా కౌంటర్లు పెంచడం, లబ్ధిదారులకు వేర్వేరు కలర్‌లతో కూడిన కూపన్లు ఇవ్వడంతో పాటు ఏ రోజు, ఏ సమయంలో రేషన్‌ తీసుకోవాలో కూడా ఆ కూపన్లలో సమాచారం అందించాం. ఆ రకంగా చేస్తే భౌతికదూరం పాటించే వీలుంటుందని, ఎండాకాలం కాబట్టి రేషన్‌ కోసం వచ్చే లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా షామియానాలు కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

గ్రామ, వార్డు సచివాలయాలు వచ్చిన తరువాత అర్హులు రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనలను పరిశీలించి ఐదు రోజుల్లో కార్డులు జారీ చేయడం ప్రభుత్వ విధానం. అది ప్రారంభించే సమయంలో కరోనా రావడం, కొన్ని సాంకేతిక ఇబ్బందులు రావడంతో అమలు చేయలేకపోయాం. వీలైనంత వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఐదు రోజుల్లో రేషన్‌ కార్డు జారీ చేసి రేషన్‌ అందించాలని సీఎం ఆదేశించారు. ఏ ఒక్కరూ అన్నం కోసం ఇబ్బందులు పడకూడదు.. ఎవరూ బాధపడకూదు అని సీఎం ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు. ఎంతమందికి తినడానికి ఏర్పాట్లు చేయగలమో అంతమందికి రేషన్‌ ఇచ్చేయండి అని ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 1000 అందరికీ అందించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశించారు.

అరటి, టమాట, బత్తాయి, మామిడి వీటన్నింటినీ ఆయా ప్రాంతాల్లో మార్కెటింగ్‌ సౌకర్యాలు చూసుకొని రాష్ట్రంలో మెప్మా గ్రూపుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. పక్కరాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఉత్పత్తులు పంపించే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి గంట గంటకు సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష సమావేశాలు జరుపుతూ అధికారులు సూచనలు చేస్తున్నారు. గత 21 రోజులుగా సీఎం వైయస్‌ జగన్‌ కోవిడ్‌-19 నియంత్రణకు సమీక్షలు జరుపుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయరంగంపై దృష్టిపెట్టారు.

వైయస్‌ఆర్‌ జనతా బజార్లకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. మన రాష్ట్రంలో పండే ఏ పంట అయినా మన మార్కెట్ల ద్వారా మనం అమ్ముకునేట్లుగా వెసులుబాటు చేయడం. అంతేకాకుండా ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులను, కూరగాయలను అందుబాటులోకి తెచ్చేందుకు ఒక నెట్‌వర్క్‌ను తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ఒక విధానంతో త్వరలోనే ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో వైయస్‌ఆర్‌ జనతా బజార్లను ఏర్పాటు చేసుకోవాలి. కరోనా సమస్య నుంచి బయటపడాలంటే శాశ్వత విధానంతో ముందుకు వెళ్లాలి. జనతా బజార్ల ఆవశ్యకతపై దృష్టిపెట్టి ఒక విధానం రూపొందించాలని ఆదేశించారు.

మన రాష్ట్రంలో 473 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరులో 109 కేసులు, కర్నూలు, నెల్లూరు తరువాతి స్థానంలో ఉన్నాయి. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి వాటిని కంటైన్‌మెంట్‌ జోన్‌ చేసి అన్ని నిత్యావసర సరుకులు ఇళ్లకు చేర్చే ఏర్పాట్లు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఏ ఒక్కరికి ఆరోగ్యం బాగులేకపోయినా వారిని గుర్తించి వైద్య పరీక్షలు చేయడమే కాకుండా అవసరమైన మెడిసిన్‌ కూడా అందించాలని సీఎం ఆదేశించారు.

నిత్యావసర సరుకులు అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి షాపులో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు విక్రయాలు జరిపేలా ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. అధిక ధరలకు అమ్మితే కేసులు పెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ కలెక్టర్లకు సూచించారు.

గత ప్రభుత్వం పెట్టిన బకాయిలతో పాటు ఈ సంవత్సరంలోని మొదటి విడత ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు సుమారు రూ.2 వేల కోట్లు సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. అంతేకాకుండా గతంలో విద్యార్థుల నుంచి అదనంగా తీసుకున్న ఫీజులను తిరిగి ఇచ్చేయాలని, లేదంటే ఆ కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో నూతన విధానం తీసుకువస్తున్నాం. ఫీజురీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా విద్యార్థుల తల్లులకు ఇచ్చి ఫీజులు కట్టించే ఏర్పాట్లు చేయనున్నాం.

ఈ రోజు లాక్‌డౌన్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్రంలో మన ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగానికి సీఎం తగిన సూచనలు చేశారు. వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సూచనలు చేశారు. క్వారంటైన్ పూర్తయితే మరోసారి పరీక్షలు జరిపి నెగిటివ్‌ వచ్చిన తరువాతే ఇంటికి పంపించాలని సీఎం ఆదేశించారు. క్వారంటైన్‌లో ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే నిత్యావసర సరుకులతో పాటు రూ. 2 వేల ఆర్థిక సాయం చేయాలని చెప్పారు. ఈ ప్రభుత్వం మాది అని చెప్పుకునే విధంగా మన తీరు ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు ఆదేశించారని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. 

Back to Top