ప్రజా ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

మాది చేతల ప్రభుత్వం, మా ప్రభుత్వానికి పబ్లిసిటీ అవసరం లేదు

కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు అమలు చేస్తున్నాం

ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి

వలంటీర్ల ద్వారా ఇంటింటిని జల్లెడపట్టి సర్వే చేయిస్తున్నాం

ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లినవారు స్వచ్ఛందంగా ముందుకురావాలి

హైదరాబాద్‌లో కూర్చొని అనవసర ఆరోపణలు చేయడం తగదు

మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలను చిత్తశుద్ధితో ప్రభుత్వం అమలు చేస్తోందని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రతి రోజు వైద్య, ఆరోగ్య శాఖతో సమీక్షలు జరుపుతున్నారని మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. ఆస్పత్రుల్లో బెడ్‌ల సంఖ్యను పెంచారన్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు సీఎం వైయస్‌ జగన్‌ సూచనలు ఇస్తున్నారన్నారు. నిత్యావసరాల కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు బజార్లను, మొబైల్‌ మార్కెట్ల సంఖ్యను పెంచామని, సామాజిక దూరం పాటిస్తూనే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని సీఎం సూచించారన్నారు. వైద్య, ఆరోగ్య శాఖకు నిధుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అదే విధంగా రైతులు ఎవరూ నష్టపోకుండా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని వివరించారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 'నిన్న అర్థరాత్రి వరకు 44 కేసులు ఉంటే ఈ రోజు ఉదయం పశ్చిమ గోదావరిలో 14 కేసులు నమోదయ్యాయని అధికారులు అంటున్నారు. రెండ్రోజుల క్రితం మన రాష్ట్రంలో 24 కరోనా కేసులు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశం మొత్తంలో ఇదే పరిస్థితి.  

లాక్‌డౌన్‌కు సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక దూరం పాటించాలి. ప్రతి ఒక్కరూ సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తే వైరస్‌ ప్రబలకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దయచేసి ప్రజలంతా ప్రభుత్వ చర్యలు పాటించాలని, సీఎం చేతులు జోడించి మరీ కోరారు. 

దేశ మొత్తం మీద ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. దయచేసి అందరూ ఆరోగ్య దృష్టితో చూస్తూ స్వచ్ఛందంగా ముందుకువచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాం. 

కుటుంబంలో ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నా.. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలన చేయాలని, ప్రతి రోజు వారి పరిస్థితిని తెలుసుకోవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారమే అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. ఆరోగ్యశాఖతో పాటు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు పాల్గొంటున్నారు. వలంటీర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరిస్తున్నారు. సలహాలు, సూచనలు మేరకు జాగ్రత్తలు పాటించాలి.

పట్టణ ప్రాంతాల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే సమాచారం అందించాలి. వలస కార్మికులు, నిరుపేదలకు భోజన సదుపాయం, ఆశ్రయం కల్పించాలని సీఎం ఆదేశించారు. భిక్షాటన చేసేవారికి కూడా భోజన సదుపాయం, షెల్టర్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించే పరిస్థితి రాకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మెనూతో భోజనం పెట్టాలని, దానికి తగ్గట్లుగా నిధులు కూడా మంజూరు చేశారు. 

ప్రజలకు ఇబ్బందులు లేకుండా 950 రైతు బజార్లను ఏర్పాటు చేశాం. మొబైల్‌ మార్కెట్లను కూడా 17 వందలకు పెంచాం. ఇంటికే  నిత్యావసరాలు అందించేలా మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో ఒక యాప్‌ను కూడా రూపొందించామని, ఈ రోజు ప్రారంభిస్తాం. 

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయదారుడు నష్టపోకూడదని సీఎం గంట గంటకు సమాచారం సేకరిస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. 

15 రోజుల వరకు రేషన్‌ ఇస్తారు.. తొందరపడి ఎవరూ గుంపులు గుంపులుగా రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక రేషన్‌ డీలర్‌ మూడు ప్రాంతాల్లో సరుకులు ఇచ్చేట్లుగా చూడాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. రెండో దఫలో అమలు చేస్తాం. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం వెంట వెంటనే చర్యలు చేపడుతోంది. 

వలంటీర్ల ద్వారా ఇంటింటికే పెన్షన్‌ అందజేస్తున్నాం. ఎవరైనా వేరొక ఊర్లలో ఉండిపోతే అక్కడ కూడా రేషన్‌ తీసుకోవచ్చు. పెన్షన్‌ లబ్ధిదారులు వేరే ఊర్లలో ఉండిపోతే పెన్షన్‌ తాలూకా సమాచారం వలంటీర్లకు తెలిపి డబ్బులు తీసుకోవచ్చు. 

విమర్శలు చేసే పెద్దలు వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడాలి. ఇది విమర్శలు చేసే సమయం కాదని కూడా తెలుసుకోవాలి. 40 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి హైదరాబాద్‌లో కూర్చొని సీఎంకు లేఖకు రాశారు. ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రభుత్వంపై బురదజల్లాలని అనుకోవడం దురదృష్టం. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి పబ్లిసిటీ అవసరం లేదు. పని చేసుకొని వెళ్లడమే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం. పబ్లిసిటీ వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదు. వాస్తవాలను ప్రజలకు చూపించాలనేది ప్రభుత్వ ఉద్దేశం' అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top