ఆ సచివాలయం.. గ్రామ సచివాలయాలు వేరు బాబూ

చంద్రబాబు కంటి చూపు మందగించినట్లుంది

విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసింది బాబు, ఆయన కోటరీ

రాష్ట్ర ఖజానాను దోపిడీ చేసి దివాళా తీయించింది వాస్తవం కాదా..?

టీడీపీ హయాంలో బహిర్భూమికి కూడా పసుపు రంగు

తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం చూసి సచివాలయ వ్యవస్థను నేనే తీసుకువచ్చానని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, ఆ సచివాలయం వేరు.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ వేరు బాబూ అని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. కంటి వెలుగు, సచివాలయ వ్యవస్థను నేనే తీసుకువచ్చానని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, బహుశా చంద్రబాబు బుద్ధి, కంటి చూపు మందగించి ఉంటుందన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం స్ఫూర్తితో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజల గుమ్మం ముందుకు తీసుకువెళ్లాలనే సీఎం వైయస్‌ జగన్‌ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రజారంజక పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక సమయాన్ని అంతా అవినీతితో, అలసత్వంతో చంద్రబాబు వృథా చేసుకున్నాడు. ఈ రోజు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని చేస్తుంటే అది సహించలేని చంద్రబాబు ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమాన్ని మేమే తీసుకువచ్చాం. గ్రామ సచివాలయం వ్యవస్థను 2003లో నేనే పెట్టా. మేము పెట్టిన కార్యక్రమాన్ని మార్చుతున్నారని అంటున్నాడు. గ్రామ సచివాలయ వ్యవస్థను చంద్రబాబు తెచ్చాడా..? గాంధీజీ స్ఫూర్తితో ప్రభుత్వ పథకాలు అన్నీ గుమ్మం ముందుకు రావాలని సీఎం వైయస్‌ జగన్‌ సచివాలయ వ్యవస్థకు అంకురార్పన చేశారు. అమరావతిలో కట్టిన శాశ్వత సచివాలయం చూసి అనుకుంటున్నాడేమో.. ఆ సచివాలయం వేరు గ్రామ సచివాలయాలు వేరు చంద్రబాబూ.. అర్థం చేసుకోండి. 

కంటి చూపు నేనే తెచ్చాను అంటున్నాడు. బాబు చూపు ఏమైపోయిందో తెలియదు కానీ.. ఆయన తాలూకా ఆలోచన సరళి బాగాలేదు. ఏదో లోపం ఉన్నట్లుంది. 
పేర్లు మార్చారని చంద్రబాబు అంటున్నాడు. ఆరోగ్యశ్రీ పథకం ఎవరు తెచ్చారు. ఎందుకు చంద్రబాబు పేరు మార్చాడు. 108 పథకాన్ని ఎవరు తీసుకువచ్చారు. ఏంటీ మాటలు చంద్రబాబూ..? ఏమైనా అంటే ఖబడ్దార్‌ అంటూ బెదిరింపులు. ఎవరిని బెదిరిస్తారు.
 
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ శాసనసభ్యుడిపై అభియోగం వస్తే చర్యలు తీసుకోవాలని వెంటనే ప్రభుత్వం ఆదేశించింది. డీజీపీ పర్సనల్‌గా స్టేట్‌మెంట్లు ఇవ్వలేదు. మీ హయాంలో ఎంతమంది అధికార పార్టీ శాసనసభ్యుల మీద కేసులు పెట్టారు. ఒక్కరినైనా తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారా..? చింతమనేనిపై ఒక్క కేసు అయినా రిజిస్టర్‌ చేయించారా..? కాల్‌మనీ కేసులో ఒక్కరినైనా అరెస్టు చేశారా..? 
ఐపీఎస్‌ అధికారిపై టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దాడికి దిగితే కేసులు పెట్టించారా..? కనీసం చర్యలు తీసుకోని చంద్రబాబు ఇంటికి పిలిచి సెటిల్‌మెంట్లు చేశాడు. 

చంద్రబాబు మాట్లాడుతుంటే మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి భయపడేవారని, నోటికి ఏది వస్తే అది స్థాయి మరిచిపోయి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. బాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బెదరకుండా చిరునవ్వుతో ఎదురుకున్న నాయకుడు మహానేత వైయస్‌ఆర్‌. 

అప్పుకోసం ఎస్‌బీఐ దగ్గరకు వెళ్తే మీరు అప్పు తీర్చగలరా అని అడిగారంట. రూ. 20 వేల కోట్లు ట్రాన్స్‌కో బకాయిలు ఉంటే చంద్రబాబు సకాలంలో తీర్చకపోవడం వల్ల, ఈఎంఐలు కట్టకపోవడంతో వచ్చిన అనర్థం అది. బాబు చేసిన అడ్డగోలు కార్యక్రమానికి ఈ ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. రాష్ట్ర విభజన జరిగిన నేరం కంటే. గత ఐదేళ్లలో జరిగిన దోపిడీ, నేరాలు, అస్తవ్యస్థ పాలన వల్ల ఈ రోజు 13 జిల్లాలు నష్టపోతున్నాయి. వాటిని చక్కదిద్దడమే ఈ ప్రభుత్వానికి సరిపోతుంది. ప్రభుత్వాలు మారినప్పుడు రూ. 5 వేల కోట్ల అప్పు ఉంటే అదే ఎక్కువ. కానీ ఇవాళ చంద్రబాబు రూ. 50 వేల కోట్ల అప్పు చేసి వెళ్లాడు. రూ. 2.50 లక్షల కోట్ల అప్పు కాకుండా ఎం బుక్కులు రికార్డు చేయకుండా రూ. 50 వేల కోట్ల అప్పు చేసింది వాస్తవం కాదా..? 

తల్లితండ్రిని చంపేసి ఎవరూ లేనివాడిని మన్నించండి అని జడ్జి ముందుకు వచ్చి వేడుకున్నాడంట ఒకడు. అలా ఉంది చంద్రబాబు తీరు. విశాఖ బ్రాండ్‌ను చెడగొట్టారని మాట్లాడుతున్నాడు. గత ఐదేళ్లు విశాఖను చంద్రబాబు, కోటరీ దోచుకుని తిన్నారు. హుద్‌హుద్‌ తుపాను వస్తే ఆనందపురం, పెందుర్తి మండలంలో రికార్డులు మారిపోయాయి. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసింది చంద్రబాబు. వందల ఎకరాల భూములను చంద్రబాబు, ఆయన కోటరీ కాజేశారు. 

గ్రామ సచివాలయాల కార్యాలయాలన్నింటికీ వైయస్‌ఆర్‌ సీపీ రంగు వేశారని మాట్లాడుతున్నారు. మరి టీడీపీ హయాంలో బహిర్భూమికి వెళ్లే గదికి కూడా పసుపు రంగు వేశారే.. ఆ హక్కు ఎవరిచ్చారు మీకు. చరిత్ర మరిచిపోయారా చంద్రబాబూ..? నవరత్నాలు అమలు జరగకూడదు. నవగ్రహాలుగా మిగిలిపోవాలి, వైయస్‌ఆర్‌ సీపీ నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెడుతున్నాడు. గ్రామాల్లో ప్రజలు మాట్లాడడం చేతగాక ఆక్రోశం వచ్చి తిట్టి వెళ్లిపోయినట్లుగా చంద్రబాబు శాపాలు పెడుతున్నాడు. ఎన్ని శాపాలు పెట్టినా.. ఆక్రోశించినా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మా విధానం. ఒక సామాజిక వర్గానికి, స్నేహితుడి కోసం, చుట్టం కోసం ప్రభుత్వం పనిచేయదు. ఆంధ్రుల అభివృద్ధి కోసం సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారు. చంద్రబాబులా సొల్లు చెప్పి, ఉన్నవి లేనివి చెప్పి. లోన ఒకటి మాట్లాడం, బయట ఒకటి చేయడం సీఎం వైయస్‌ జగన్‌కు అలవాటు లేదు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 
 

Back to Top