మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయం మాదే..

పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు 100 శాతం పన్నులు పెంచారు

ఇవాళ పన్నుల తగ్గిస్తామంటూ చంద్రబాబు మాయమాటలు

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం

అనంతపురం: పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమగ్రమైన ప్రణాళికను రూపొందించామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పంచాయతీ ఎన్నికల కంటే మిన్నగా మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని తాడిపత్రి, రాయదుర్గం, కల్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి మున్సిపాలిటీలు, అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లలోని వైయస్‌ఆర్‌ సీపీ ముఖ్యనేతలు, శాసనసభ్యులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్‌ నారాయణ, ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. 

సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభ్యర్థులను ఇవాళ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే ముఖ్య నేతలతో మాట్లాడామని, నాయకులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించడం జరిగిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం ఖాయమన్నారు. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. వలంటీర్లపై ఆంక్షలను ఎస్‌ఈసీ పునరాలోచించాలని సూచించారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు.  

చంద్రబాబు అధికారంలో ఉండగా 100 శాతం పన్నులు పెంచారని బొత్స సత్యనారాయణ చెప్పారు. 2018 డిసెంబర్‌లో నీటిపన్నును సుమారు 40 శాతం నుంచి 100 శాతం పెంచడానికి జీవో ఇచ్చారా..? లేదా..? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పన్నులు పెంచుతూ జీవో ఇచ్చి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగ్గిస్తామని మాట్లాడుతున్నారంటే.. ఇంతకంటే దారుణం ఉంటుందా..? ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని మంత్రి బొత్స మండిపడ్డారు. పన్నులు తగ్గిస్తామంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని, దయచేసి బాబు మాటలు విని ప్రజలెవరూ మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. 

 

Back to Top