రైలు ప్రమాద బాధితులకు చెక్కుల పంపిణీ

క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విజ‌య‌న‌గ‌రం: కంట‌కాప‌ల్లి రైలు ప్ర‌మాద బాధితులను మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. వారికి నష్ట పరిహారం చెక్కులను మంత్రి అందజేశారు. ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వారి వ‌ద్ద‌కు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కుదుట పడే వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని సూచించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో మృతి చెందిన 13 మందికి, 30 మంది గాయ‌ప‌డిన వారికి క‌ల‌సి మొత్తం 43 మందికి రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.2.59 కోట్లు ప‌రిహారంగా అంద‌జేస్తోందని మంత్రి బొత్స తెలిపారు.  మంగ‌ళ‌వారం 8 మందికి ప‌రిహారం అందించామని, ఈ రోజు 12 మందికి ప‌రిహారం అంద‌జేశామని, రేప‌టిలోగా అంద‌రికీ ప‌రిహారం అందిస్తామని మంత్రి వెల్లడించారు.

గాయాలపాలైన వారు జీవితాంతం బాధ‌ప‌డ‌కుండా వారికి తోడ్పాటు అందించేందుకు ముఖ్య‌మంత్రి.. శాశ్వ‌త అంగ‌వైక‌ల్యం పాలైన వారికి రూ.10 ల‌క్ష‌ల స‌హాయం ప్ర‌క‌టించారు. నెల రోజుల‌కు మించి ఆసుప‌త్రిలో చికిత్స అవ‌స‌రమయిన వారికి రూ.5 ల‌క్ష‌లు, నెల రోజుల్లోపు చికిత్స పూర్త‌యి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన వారికి రూ.2 ల‌క్ష‌లు స‌హాయం అందిస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.

Back to Top