విజయనగరం: 2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేశారని, ఆయన నయవంచకుడని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గణపతినగరంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పుష్పశ్రీవాణి, తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల నుంచి సామాజిక సాధికార యాత్రను ప్రారంభించామన్నారు. సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనలో ఏ విధంగా సామాజిక న్యాయం చేశారన్నది ప్రజలు తెలియజేప్పేందుకు బస్సు యాత్రను ప్రారంభించామన్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు.మొదటి రోజు బస్సు యాత్రను ప్రజలు విజయవంతం చేశారని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నామన్నారు. చంద్రబాబు మాదిరిగా మేం మోసం చేయడం, వంచించడం మాకు అలవాటు లేదు. వైయస్ జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలను పుణికిపుచ్చుకున్నారు. ఆయన ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. చెప్పింది చేస్తున్నారు. మాట తప్పని నాయకుడు సీఎం వైయస్ జగన్. టీడీపీది మాట తప్పిన పార్టీ, అన్ని వర్గాలను గత ప్రభుత్వం మోసం చేసింది. మేం ఈ నాలుగున్నరేళ్లలో ఎలా పాలించామో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. టీడీపీ చేసిన వంచన, అవినీతిని ఎండగడుతున్నామన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వం ఎలా వాగ్ధానాలు చేసిందో మీ అందరికీ తెలుసు అన్నారు. 600 వాగ్ధానాలు వారి మేనిఫెస్టోలో పెట్టారు. చంద్రబాబు సీఎం అయ్యాక మొదటి రోజు ఐదు సంతకాలు చేశారు. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. రూ.87 వేల కోట్లు రైతు రుణాలు మాఫీ చేస్తానని నట్టేట ముంచారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని దగా చేశారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించారన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తామని మోసం చేశారు. మళ్లీ తగుదునమ్మా అంటూ ఎన్నికల సమయంలో వస్తున్నారు. ఇలాంటి వంచకుల మాటలు నమ్మాలా?. సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన వైయస్ జగన్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తూచ తప్పకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన వైయస్ జగన్ తాలుకా విధానం, అభిమతం, ఆయన లక్షణం, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నైజాన్ని ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్ర ద్వారా బయలుదేరామన్నారు.గతంలో విజయనగరం జిల్లాను టీడీపీ ఎలా మోసం చేసిందో ప్రజలక వివరిస్తున్నామన్నారు. సామాజిక సాధికార యాత్రను విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. చంద్రబాబు ఎన్ని లేఖలైనా రాసుకోవచ్చు అని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే కోర్టు ఎందుకు రిమాండుకు పంపిందని, ప్రభుత్వం ఆయనకు శిక్ష వేయలేదన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నాం: మంత్రి బూడి ముత్యాలనాయుడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తున్నామని మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. రెండో రోజు బస్సు యాత్ర గజపతినగరం నియోజకవర్గంలో ప్రారంభమైంది. విజయనగరంలో మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పుష్పాశ్రీవాణి, పార్టీ నాయకులతో కలిసి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడారు. అవినీతికి చోటు లేకుండా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించామన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని, నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారన్నారు. జరిగిన అభివృద్ధిని బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. అవినీతికి చోటు లేకుండా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారు. మా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను బస్సు యాత్రలో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. తమ పిల్లలు చదువుకుంటేనే వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయన్న ఉద్దేశంతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు ఆర్థిక చేయూతనందించారన్నారు. సమన్యాయంతో అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. సామాజిక సాధికారత అనే మాటకు సీఎం వైయస్ జగన్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అన్ని పథకాలను అర్హతే ప్రమాణికంగా అమలు చేస్తున్నామన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మెడికల్ కాలేజీల ఏర్పాటు, పరిశ్రమల ఏర్పాటుతో అనేక మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును ప్రజలకు వివరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర ద్వారా బహిరంగ సభలు ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రజలను ఏవిధంగా మోసం చేసిందో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరిస్తున్నామని మంత్రి ముత్యాలనాయుడు తెలిపారు. సీఎం వైయస్ జగన్ పాలనలో సామాజిక విప్లవం విరాజిల్లుతోందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. అన్ని వర్గాలకూ న్యాయం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమే అన్నారు. చేసిన అభివృద్ధిని ప్రతీ ఒక్కరికీ వివరించడమే బస్సు యాత్ర ఉద్దేశమన్నారు. సంక్షేమ పాలనను అందిస్తున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అండగా నిలుస్తున్నారని మాజీ మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. పేద,బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా సీఎం వైయస్ జగన్ నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయన్నారు. రూ.2.83 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి జమ చేశారన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి వైయస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైయస్ జగన్ చేసిన పాదయాత్రలో అందరి కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చాక అందరికీ మేలు చేశారన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక ఆయన పరిపాలన విధానం చూస్తే..సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం. గతంలో ఎస్సీలను, ఎస్టీలను చంద్రబాబు అవమానించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చంద్రబాబు చూశార ని గుర్తు చేశారు. ఇవాళ వైయస్ జగన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని చెప్పారు. సుమారుగా 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికే ఖర్చు చేశారన్నారు. ఈ రోజు కేబినెట్‌లో 18 మంది ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు మంత్రులుగా ఉన్నారు. ఇదీ సామాజిక న్యాయమంటే అన్నారు. నామినెటెడ్ పదవుల్లో 50 శాతం ఇస్తూ చట్టాన్నే తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమే అన్నారు. సామాజిక న్యాయం సాధికారత దిశగా వందశాతం ముందుకు వెళ్తుందని పుష్పశ్రీవాణి ఉద్ఘాటించారు.