విజయవాడ:టెన్త్ ప్రశ్నపత్రాలు లీక్ కాలేదు. మాస్ కాపీయింగ్ లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏం చెప్పారంటే..: మనోస్థైర్యం దెబ్బ తీస్తున్నారు: టెన్త్ పరీక్షల్లో ఇప్పటికి 5 పరీక్షలు పూర్తి కాగా, బయాలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ రెండు పేపర్లు ఇంకా మిగిలి ఉన్నాయి. రెండు రోజుల్లో పూర్తవుతాయి. దాదాపు 6.22 లక్షల విద్యార్థులు ఆ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే అక్కడో, ఇక్కడో ఏదైనా జరిగితే, కొన్ని పార్టీలు అనవసరంగా స్పందిస్తూ, అతిగా ప్రచారం చేస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. నిజానికి గత ప్రభుత్వ హయాంలో పేపర్లు ముందే లీక్ అయినా, యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరిగినా, ఎక్కడా ఎవరిపైనా ఏ చర్య తీసుకోలేదు. 60 మందిపై క్రిమినల్ కేసులు: కానీ మేము పరీక్ష ప్రారంభం తర్వాత ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయని తెలియగానే పోలీసు సిబ్బందిని కూడా ఇన్‌వాల్వ్ చేసి, చాలా వేగంగా స్పందించాం. అందుకు బాధ్యులైన 60 మందిపై చర్యలు తీసుకోవడం జరిగింది. వారిలో 36 మంది టీచర్లు కాగా మరో ఇద్దరు ఆఫీస్ స్టాఫ్. ఇక ప్రైవేటు విద్యా సంస్థలు.. నారాయణ, చైతన్య సంస్థల్లో పని చేస్తున్న వారు 22 మంది, ఇంకా ఏడుగురు మాజీ విద్యార్థులు ఉన్నారు. వారిలో నారాయణ సంస్థ వైస్ ప్రిన్సిపల్ కూడా ఒకరున్నారు. అందరిని అదుపులోకి తీసుకుని గతంలో ఏనాడూ జరగని విధంగా క్రిమినల్ కేసులు నమోదు చేశాం. అయినప్పటికీ ప్రతిపక్షం అనవసరంగా అల్లరి చేస్తోంది. నిజానికి గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించి, ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేశారు. విద్యా రంగంలో సమూల మార్పులు: కానీ మా ప్రభుత్వం వచ్చాక, ప్రభుత్వ విద్యా సంస్థలలో సమూల మార్పులు చేస్తున్నాం. పరీక్షల నిర్వహణలో ఎక్కడా మాస్ కాపీయింగ్ లేకుండా చూస్తున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఒక స్కూల్‌లో 5గురు టీచర్లు పేపర్లు తీసుకొచ్చి, సమాధానాలు సిద్దం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. అంత పకడ్బందీగా అధికారులు పని చేస్తున్నారు. మేము పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నామనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రులే చెబుతారు. అయినా విపక్షం ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊర్కుంటారా? ఉపాధ్యాయులూ చూస్తూ ఉండరు కదా? ‘ఈనాడు’లో అసత్య కధనం: ఇవాళ ఈనాడులో ‘గురువులకే పరీక్ష’ అంటూ కధనం వచ్చింది. టీచర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు. నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని వారికి టార్గెట్ పెట్టారు. అంటూ ద్వంద్వ ప్రమాణాలతో ఆ స్టోరీ రాశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రమణాలు పెంచాలని అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అంతేకానీ, ఎక్కడా నూటికి నూరు శాతం ఫలితాలు రావాలని టార్గెట్ పెట్టలేదు. కానీ ఈనాడు స్టోరీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. దానిపై కొందరు నాయకులు మాట్లాడుతూ, నన్ను రాజీనామా చేయమంటున్నారు. నవ్వేస్తోంది. నాకు మంత్రి పదవి కొత్త కాదు. మంత్రిగా 13 ఏళ్ల అనుభవం. అంతకు ముందు 5 ఏళ్లు పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించాను. తప్పుడు పనులు చేసే వాడికి అన్నీ తప్పులే కనిపిస్తాయి. కానీ మేము తప్పులను ఉపేక్షించబోము. విద్యార్థుల భవిష్యత్తే మా సీఎంగారికి, మా ప్రభుత్వానికి ప్రాధాన్యం. అందుకే తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశలోనే స్కూళ్లను సమూలంగా మారుస్తూ, అన్ని సదుపాయాలు కల్పిస్తూ, విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. అంతేతప్ప మాస్ కాపీయింగ్ చేసైనా, నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని, లేకపోతే ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని ఎక్కడైనా చెప్పామా? అసలు ఆ పత్రిక ఈ సమాజానికి ఏం చెప్పబోతుంది? లీక్ కాలేదు. మాస్ కాపీయింగ్ లేదు: మళ్లీ చెబుతున్నా ఇప్పటి వరకు జరిగిన 5 పరీక్షల్లో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదు. అలాగే ఎక్కడా పరీక్షకు ముందు పేపర్లు లీక్ కాలేదు. పరీక్షలు మొదలైన తర్వాత మాత్రమే కొందరు స్వార్థంతో, స్వప్రయోజనాలు ఆశించి, ప్రలోభాలకు లొంగి, ప్రభుత్వంపై నింద వేయడం కోసమో.. పేపర్లు ఫోటో తీశారు. అయితే దాన్నీ ప్రభుత్వానికి అంటగట్టి విమర్శలు చేస్తున్నారు. నిజానికి మా సీఎంగారు విద్యార్థుల భవిష్యత్తు కోసం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. విద్య, వైద్య రంగాలను ఆయన అభివృద్ధి చేస్తున్నారు. టెన్త్ ప్రశ్న పత్రాలు బయటకు రావడంలో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన 22 మందికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. నంద్యాలలోని సీఆర్పీ హైస్కూల్‌లోనో లేదా శ్రీకాకుళంలోని కేరళ స్కూల్‌లోనా అన్నది కూడా తెలుసుకుంటున్నాం. ఇంకా ఎక్కడైనా ఈ వ్యవహారంలో ప్రైవేటు స్కూళ్ల ప్రమేయం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ స్కూళ్ల అనుమతి రద్దు చేయడంతో పాటు, వాటిని బ్లాక్‌లిస్టులో కూడా పెడతాం. ఏ చర్య తీసుకున్నా పక్కాగా సాక్ష్యాలు ఉంటేనే తీసుకుంటాం. పేపర్లు బయటకు వచ్చిన ఘటనల్లో నారాయణ స్కూల్ పేరు బయటకు వచ్చింది. అయినా టీడీపీ స్పందించలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తగుదునమ్మా అంటూ లోకేశ్, అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. లోకేశ్ అర్ధం లేకుండా మాట్లాడుతున్నారు. పీఆర్సీకి, దీనికి ఏం సంబంధం? ప్రతిదీ రాజకీయం చేస్తే విద్యార్థులు, తల్లిదండ్రులు ఛీకొడతారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు: ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు. 6వ తేదీ నుంచి 24 వరకు జరుగుతాయి. అందులో ప్ర«ధాన పరీక్షలు 19 వరకు జరుగుతాయి, ఫస్ట్, సెకండ్ ఇయర్లకు కలిపి దాదాపు 10 లక్షల విద్యార్థులు హాజరవుతున్నారు. వాటికి కూడా తగిన ఏర్పాట్లు చేశాం. పరీక్షలు ఇంకా పకడ్బందీగా నిర్వహించే దిశలో పలు ఆలోచనలు చేస్తున్నాం. అవసరమైతే పరీక్ష హాళ్లలో సీపీ కెమెరాలు కూడా పెడతాం. స్కానింగ్ ఏర్పాట్లు కూడా చేస్తాం. పరీక్ష అంటే నమ్మకం. కాబట్టి ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఇంటర్ పరీక్షలు పక్కాగా నిర్వహించేందుకు ఇప్పటికే జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించాం. పరీక్షలు జరుగుతున్న ప్రతిరోజూ ఉదయం నుంచి స్వయంగా నేను మానిటర్ చేస్తున్నాను. మా బాధ్యతలు, మా కర్తవ్యం నాకు తెలుసు. లక్షలాది పిల్లల భవిష్యత్తుతో ఆడుకోబోము. మేము ఏదైనా చిత్తశుద్దితో చేస్తాం. ఎక్కడా రాజకీయ ప్రయోజనాలు ఆశించం. ప్రతి పనీ కర్తవ్య దీక్షతో పూర్తి చేస్తాం అని మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.