అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చకు టీడీపీ ఆటంకం

మంత్రి బొత్స సత్యనారాయణ
 

అమరావతి: అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా టీడీపీ ఆటంకం కల్పిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి మాట్లాడారు. ఇవాళ ప్రశ్నోత్తరా సమయంలో టీడీపీ సభ్యులు లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఎక్కడ వాస్తవాలు బయటకు వస్తాయోనని చంద్రబాబు డైరెక్షన్‌లో సభలో టీడీపీ సభ్యులు స్పీకర్‌ చైర్‌ వద్దకు దూసుకెళ్లి పేపర్లు చించేశారు.  సభను జరగనివ్వకుండా అంతరాయం కల్పిస్తూ స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి అసభ్యంగా పేపర్లు చించి విసిరారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. టీడీపీ ప్రశ్నలు గమనిస్తే..ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, ఈనాడు, టీవీ5 మీడియాలో వస్తున్న అంశాలు, చంద్రబాబు, ఆయన అనుచర గణం ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీలపై దుమ్మెత్తిపోస్తున్న అంశాల్లో 4 ప్రధాన అంశాలను టీడీపీ సభ్యులు ప్రశ్నలుగా అడిగారు. అందులో ఒకటి ఓటీఎస్‌ పథకం..ఈ పథకం ద్వారా లబ్ధిదారలకు ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పించేందుకు వైయస్‌ జగన్‌ సంకల్పించారు. ఓటీఎస్‌పై టీడీపీ నేతలు అపోహాలు సృష్టిస్తున్నారు.   సభ జరిగితే వాస్తవాలు ప్రజలు తెలుస్తాయని వీళ్లు అడ్డుపడ్డారు. శానిటరీ వర్కర్లకు రూ.18 వేలు వేతనం పెంచాం. రెగ్యులరైజేషన్‌పై కూడా ప్రశ్న వేశారు. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. సీఎం రైతు పక్షపాతిగా నిర్ణయం తీసుకుంటున్నారు. పండిన ప్రతి పంటకు మార్కెట్‌లో మద్దతు ధర కల్పించాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుంది. పత్రికలు, ప్రతిపక్షం ఒకేగాటికి చెందిన వారే కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అడ్డుకుంటున్నారు.  సభా సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సాంప్రదాయం కాదు. బాధ్యత గలప్రతిపక్షంగా ప్రజల తాలుకా ఆలోచనలపై చర్చించాలి. అల్లర్లు, గొడవలతో సభా సమయాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. సభలో టీడీపీ నేతల ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇకనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. 
 

Back to Top