పేదలకు సొంతిల్లు ఉండాలనేది సీఎం సంకల్పం

224 ఎస్‌ఎఫ్‌టీ ఇల్లు పిచ్చుకగూడా..? 340 ఎస్‌ఎఫ్‌టీ ఇల్లు పిచ్చుక గూడా..?

ప్రతిపక్ష నేత చంద్రబాబు సమాధానం చెప్పాలి..

టీడీపీని జాకీలు, క్రెయిన్‌లతో లేపాలని ఎల్లోమీడియా తాపత్రయం 

300 ఎస్‌ఎఫ్‌టీ టిడ్కో ఇళ్లను రూపాయికే లబ్ధిదారులకు అందించనున్నాం

వైయస్‌ఆర్‌ హయాంలో 21.89 లక్షల ఇళ్లు కడితే.. చంద్రబాబు పాలనలో 6 లక్షలే..

పేదల కోసం సీఎం వైయస్‌ జగన్‌ 17 వేల కాలనీలను నిర్మిస్తున్నారు

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: పేదలకు కట్టిస్తున్న ఇళ్లపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజల చేత తిరస్కరించబడిన చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని జాకీలు, క్రెయిన్‌లతో పైకిలేపాలని ఎల్లోమీడియా తాపత్రయపడుతోందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తున్నామన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో 21,89,274 ఇళ్లు కట్టించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఐదేళ్లలో సుమారు 6 లక్షల ఇళ్లు మాత్రమే కట్టాడన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ 28.30 లక్షల ఇళ్లను పేదలకు కట్టిస్తున్నారని చెప్పారు. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లను అడ్డుపెట్టుకొని చంద్రబాబు పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నాడని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

‘‘ఈనాడు పత్రిక ‘గూడుకట్టిన నిర్లక్ష్యం’ అనే కథనాన్ని రెండు పేజీల్లో ప్రచురించింది. చంద్రబాబు చెప్పిన అవాస్తవాలను ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో 300 ఎస్‌ఎఫ్‌టీలో ఉన్న 1.43 లక్షల ఇళ్లను ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగానే రూపాయికే లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు.  365, 430 ఎస్‌ఎఫ్‌టీ ఉన్న ఇళ్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. రివర్స్‌టెండరింగ్‌లో రూ.400 కోట్లు ఆదా చేశాం. దానికి తగ్గట్టుగానే అసెంబ్లీలోనే 365, 430 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్ల లబ్ధిదారులు కట్టాల్సిన దాంట్లో ప్రభుత్వమే రాయితీ ఇచ్చింది. ఇవన్నీ జరిగిపోతాయనే ఉద్దేశంతో, ఒక దుర్బుద్ధితో ఈనాడు పత్రిక ఒక కథనాన్ని రాసింది. 

గత ప్రభుత్వం అట్టహాసంగా షేర్‌వాల్‌ టెక్నాలజీని తీసుకువచ్చి సంవత్సరకాలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆర్భాటం చేసి టిడ్కో హౌసింగ్‌ స్కీమ్‌ను తీసుకువచ్చింది. 7 లక్షల ఇళ్లను కడతామని కేంద్రం నుంచి అనుమతి తీసుకువచ్చి.. 4లక్షల 54 ఇళ్లకే జీఓ విడుదల చేసి.. అందులో 3.13 లక్షల ఇళ్లను ప్రారంభించి.. అందులో 51,616 ఇళ్లను గ్రౌండ్‌ లెవల్‌ చేసి.. మిగతావి వివిధ దశల్లో ఉంచారు. వాటికి మౌలిక సదుపాయాలు రోడ్డు, కరెంట్, నీరు ఏవీ చేయకుండా ఉంచారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వాటన్నింటినీ పూర్తిచేసి దాంట్లోని 300 ఎస్‌ఎఫ్‌టీ గల 1.43 లక్షల ఇళ్లను రూపాయికే లబ్ధిదారుడికి అందించాలని ఆలోచన చేశారు. గ్రౌండింగ్‌ లెవల్‌లో ఉన్న 51 వేల ఇళ్లను కూడా లబ్ధిదారుల అంగీకారం మేరకే క్యాన్సిల్‌ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని సంకల్పంతో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఈ 51 వేల లబ్ధిదారులకు ఆప్షన్‌ ఇచ్చాం. 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు కావాలనుకుంటే.. గత ప్రభుత్వం రూ.5.65 లక్షలు పెట్టారు. వాటిని నిర్మించి రూపాయికే ఇస్తాం. లేదా సెంట్‌ స్థలాన్ని ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తాం అని లబ్ధిదారులకు ఆప్షన్‌ ఇస్తే.. ఇండిపెండెంట్‌ ఇల్లు కావాలని లబ్ధిదారులు కోరారు. ఆ నేపథ్యంలోనే క్యాన్సిల్‌ చేయడం జరిగింది. 

టిడ్కో ఇళ్లు 163 ప్రాంతాల్లో ఉన్నాయి. సుమారు 90 వేల ఇళ్లను 3–6 నెలలలోపు మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిన్నటి రోజున అధికారులను ఆదేశించారు. నేటి నుంచి 100 నుంచి 180 రోజుల్లో ఇళ్లను లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. మరో 90 వేల ఇళ్లను 12 నెలల కాలంలో పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తాం. మిగిలిన ఇళ్లను 18 నెలల్లో పూర్తిచేసి ఇవ్వడం జరుగుతుంది. 

వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు ఇళ్లను అందించేస్తుంది.. ముఖ్యమంత్రికి, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వస్తుందోనని ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనాడు పత్రిక, చంద్రబాబు ఏ ప్రయత్నం చేసుకున్నా ప్రభుత్వ చిత్తశుద్ధి, సంకల్పాన్ని ప్రజలు గుర్తిస్తారు. 

పిట్టగూడులాగా ఇళ్లు కడుతున్నారని చంద్రబాబు అంటున్నాడు. ఈ రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ హయాంలో సుమారు 21,89,274 ఇళ్లు కట్టారు. చంద్రబాబు హయాంలో  సుమారు 6 లక్షల ఇళ్లు మాత్రమే కట్టాడు. సీఎం వైయస్‌ జగన్‌ 28.30 లక్షల ఇళ్లను కడుతున్నారు. వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో 215 ఎస్‌ఎఫ్‌టీ ఇల్లు యూనిట్‌ కాస్ట్‌ రూరల్, అర్బన్‌ కలుపుకొని రూ.20 నుంచి రూ.40 వేలు. చంద్రబాబు ఐదు సంవత్సరాల్లో కట్టిన 6 లక్షల ఇళ్లను 224 ఎస్‌ఎఫ్‌టీలో కట్టాడు. యూనిట్‌ కాస్ట్‌ రూ.1.50 లక్షలు. జగనన్న కాలనీల్లో వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ప్రభుత్వం కట్టేది 340 ఎస్‌ఎఫ్‌టీ ఇల్లు. యూనిట్‌ కాస్ట్‌ రూ.1.84 లక్షలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు మరో రూ.50 నుంచి రూ.70 వేలు వెచ్చిస్తున్నాం. మొత్తం ఒక ఇంటికి రూ.2.25 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 

224 ఎస్‌ఎఫ్‌టీ ఇల్లు పిచ్చుకగూళ్లా.. లేక 340 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు పిచ్చుక గూళ్లా..? దీనికి చంద్రబాబు, అప్పటి హౌసింగ్‌ మినిస్టర్‌ సమాధానం చెప్పాలి. వాస్తవం ఏంటో ప్రజలకు తెలుసు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం 17 వేల కాలనీలను నిర్మిస్తోంది. కొత్త గ్రామాలను సృష్టిస్తోంది. మొదటి విడతలో భాగంగా 15 లక్షల పైచిలుకు ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. సుమారు రూ.10 వేల కోట్లు భూసేకరణకు సీఎం వైయస్‌ జగన్‌ కేటాయించారు. ఇది వాస్తవం కాదా..? జాకీలు, క్రెయిన్‌లతో చంద్రబాబును, టీడీపీని పైకిలేపాలనుకుంటే ఎలా..?’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 

 

తాజా వీడియోలు

Back to Top