విశాఖ: సముద్ర తీరంలో హుద్‌హుద్ తుపాన్ వస్తే..ఎక్కడో దూరంగా ఉన్న తహశీల్దార్ కార్యాలయంలోని రికార్డులు ఎలా తడిసిపోయాయని మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబును ప్రశ్నించారు. విశాఖలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు. హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు విశాఖలో కూర్చుని అన్నీ బాగు చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. ఆనందపురం, పెందుర్తి, భీమిలి, పరవాడ ఎమ్మార్వో ఆఫీసుల్లో హుద్‌హుద్ తుపాను తర్వాత భూముల రికార్డులు ఎలా మారిపోయాయి?. భూములు, ఆస్తులకు సంబంధించిన యజమానుల వద్ద అసలు పత్రాలున్నప్పటికీ ఆయా ఎమ్మార్వో ఆఫీసుల్లోని రికార్డుల్లో మాత్రం పేర్లు ఎలా మారిపోయాయని నిలదీశారు. హుద్‌హుద్ తుపాను సముద్ర తీరంలో వస్తే, దూరంలో ఉన్న ఆయా ప్రాంతాల్లో అలా జరగడానికి కారణాలు ఏమిటి? ఆఫీసుల్లో రికార్డులు ఎలా తడిసిపోయాయి? అవి ఎలా తారుమారయ్యాయని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు, స్థానిక నేతలు అందుకు కారణం కాదా? ఆరోజు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న మాట వాస్తవం కాదా? అని మండిపడ్డారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా?: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పేదలకు ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. త్వరితగతిన పేదలకు ఇళ్లు ఇస్తామంటూ ఒక టెక్నాలజీని తీసుకువచ్చారు. 6 నెలల కాలంలోనే ఇళ్లు కడతామని చెప్పారు. కానీ అది జరగలేదు. 5 ఏళ్లలో కనీసం ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదు. విశాఖ ప్రజలు దాని గురించి ఆలోచించాలి’. ‘మరోవైపు పేదలకు ఇచ్చే ఇళ్లకు అప్పులు పెట్టారు. 300 ఎస్‌ఎఫ్‌టీ అయితే రూ.2.75 లక్షలు, 365 ఎస్‌ఎఫ్‌టీ అయితే రూ.3.75 లక్షలు, 430 ఎస్‌ఎఫ్‌టీ అయితే రూ.4.75 లక్షల అప్పు పెట్టిన మాట వాస్తవం కాదా? చెప్పండి’. ‘విశాఖ ఊరు చివర్లో ఆరోజు ఎస్‌ఎఫ్‌టీ ఖరీదు భూమి విలువతో సహా రూ.1800 నుంచి రూ.2 వేల వరకు, అనకాపల్లి వద్ద రూ.1200కు ఫ్లాట్లు దొరికేవి. కానీ చంద్రబాబు హయాంలో కాంట్రాక్టర్లకు ఒక్కో చదరపు అడుగుకు రూ.1600 నుంచి రూ.1800 కు ఇచ్చారు. ఆ విధంగా దోచుకున్నారు’. వైయస్సార్ హయాంలో..: ‘వైయస్సార్ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందింది. ఎస్‌ఈజడ్ (సెజ్), అయినా ఫార్మా సిటీ అయినా ఆయన హయాంలోనే వచ్చాయి. సెజ్‌లోని బ్రాండిక్స్ కంపెనీ చాలా మందికి ఉపాధి ఇచ్చింది. విదేశాలకు వెళ్లి మరీ ఆ సంస్థ వచ్చేలా కృషి చేశాము. కానీ టీడీపీ నాయకులు తామే సెజ్ తెచ్చామని అసత్యాలు చెబుతున్నారు’. ‘తాము 50 వేల ఇల్లు మంజూరు చేశామంటున్నారు. ఆ విధంగా వారిని కూడా దోచుకోవాలని చూశారు. కానీ మా సీఎం శ్రీ వైయస్ జగన్, పాదయాత్ర సమయంలోనే హామీ ఇచ్చారు. 300 చదరపు అడుగుల ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇస్తున్నారు. ఇది రాష్ట్రమంతా జరుగుతోంది. వాస్తవం కాదా?’. పేదల ఇళ్ల స్థలాలు అడ్డుకున్నారు: ‘రాష్ట్రంలో దాదాపు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తూ, విశాఖలో కూడా సుమారు 1.90 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించి, రైతులను ఒప్పించి ల్యాండ్ పూలింగ్‌లో భూసేకరణ చేస్తే, కోర్టులకు వెళ్లి ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఇది దుర్మార్గం కాదా?. ఇన్ని చేసిన చంద్రబాబు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. నిజానికి రాష్ట్రాన్ని దోచుకున్నది ఆయన’. విశాఖ భూగర్భ డ్రైనేజీ–కంపు: ‘విశాఖలో భూగర్భ డ్రైనేజీ గురించి కూడా చంద్రబాబు మాట్లాడుతున్నారు. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో మురుగునీటిని పరిశుభ్రం చేసి పరిశ్రమలకు ఇచ్చే ప్రాజెక్టు తెచ్చారు. కానీ దాంట్లో రూ.450 కోట్ల అప్పు. మరో రూ.50 కోట్లు బాండ్ల రూపంలో సేకరించారు. దానికి జీవీఎంసీ బిల్డింగ్‌లను తాకట్టు పెట్టారు తప్ప ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వలేదు. అందుకే దాన్ని రీస్ట్రక్చర్ చేసి రుణం తగ్గించి, ప్రభుత్వం రూ.200 కోట్లు ఇచ్చి పనులు చేస్తోంది. అదీ ప్రభుత్వ బాధ్యత అంటే. ప్రజలకు మేలు చేయాలి. అంతే తప్ప, కాంట్రాక్టులకు ఇచ్చి కిట్‌బాక్సులు తీసుకుంటామంటే ఎలా?’. మెట్రో రైలు ప్రాజెక్టు: ‘విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు. గాజువాక నుంచి మధురవాడ వరకు తొలుత ప్రతిపాదన. మా ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని భోగాపురం వరకు విస్తరించాలన్న ప్రతిపాదన వచ్చింది. మరోవైపు స్టీల్ ప్లాంట్ వరకు కూడా విస్తరించాలన్న డిమాండ్ రావడంతో డీపీఆర్ సిద్ధం చేశాం. మరి అంతకు ముందు చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో ఏనాడైనా మెట్రో రైలుపై ఆలోచన చేశారా?’. బీచ్ పక్కన 32 ఎకరాలు: ‘బీచ్ పక్కన 32 ఎకరాల స్థలాన్ని లులూ అనే సంస్థకు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం ఇచ్చింది. కానీ దాని వల్ల నగరానికి ఏం ప్రయోజనం? అందుకే ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని రద్దు చేసి, నగరానికి తలమానికంగా నిల్చేలా ట్విన్ టవర్లు నిర్మించబోతున్నాం. దానికి ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నాం. గ్లోబల్ టెండర్ల ద్వారా ఆ పనులు చేపట్టాలని నిర్ణయించాం. అంతేతప్ప చంద్రబాబు మాదిరిగా లాలూచీ పడి, ఈక్విటీలు పెట్టుకుని బ్యాక్‌డోర్ ద్వారా లాభం పొందాలన్నది మా లక్ష్యం కాదు. ఈ రాష్ట్రానికే కాదు, దేశానికే అది తలమానికంగా నిలవబోతుంది’. ఆయన గుండె చెరువా!: ‘చంద్రబాబు ఎక్కడికి పోతే అదే తన గుండెల్లో ఉందంటాడు. విశాఖలో, అమరావతిలో, హైదరాబాద్‌లో, పక్కనే విజయనగరం వెళ్లినా, అది తన గుండెల్లో ఉందంటాడు. ఆయన గుండె ఏమైనా చెరువా? ప్రజలు కనీసం నమ్ముతారా?’. ‘విశాఖ వచ్చి అమరావతి గురించి మాట్లాడుతున్నావు. అక్కడ విజయవాడలో మీ తమ్ముళ్లే కొట్టుకుంటున్నారు కదా? ఒక సామాజిక వర్గానికే పార్టీని పరిమితం చేయొద్దంటున్నారు’. ఏకవచనంతో సంబోధన: ‘ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడడం. ఏమిటా భాష?. అదేనా సంస్కారం?. గురివింద గింజ మాదిరిగా చంద్రబాబు వ్యవహారశైలి మారిపోయింది. విశాఖను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం’. కేంద్ర మంత్రి అర్ధం లేని విమర్శలు: ‘విశాఖకు అమృత్ పథకంలో రూ.1065 కోట్లు ఇచ్చామని ఓ కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు. మరి ఆ పథకం మొత్తం వ్యయం ఎంత? అందులో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందో తెలుసా? ఆ ప్రాజెక్టు వ్యయం రూ.3767 కోట్లు అయితే అందులో 28 శాతం కేంద్రం ఇచ్చింది. మిగిలిన 72 శాతం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆ విమర్శలు చేసిన మంత్రిగారే, అమృత్ పథకం అమలులో ఏపీ టాప్‌లో ఉందని అవార్డు ఇచ్చారు. మరి ఈ మాట కూడా చెప్పాలి కదా? అసలు ఏపీలో బలం ఎంత?’. స్మార్ట్ సిటీలు: ‘స్మార్ట్ సిటీ. ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో నాలుగు సిటీలను ఎంపిక చేశారు. రాష్ట్రంలో తొలుత విశాఖ, కాకినాడ, తిరుపతికి ఇచ్చారు. వాటికి రూ.1000 కోట్లు. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది చెరి సగం. మరోవైపు అమరావతికి మరో రూ.500 కోట్లు మంజూరు చేశారు. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చక్కగా వినియోగించింది. మరో రూ.500 కోట్లు ఖర్చు చేసి, పనులు చేశాం. అందుకే దేశంలోని టాప్ 100 నగరాల్లో చాలా విషయాల్లో ఏపీ టాప్‌లో ఉంది. స్మార్ట్ సిటీలకు సంబంధించి విశాఖ ఏకంగా మూడో స్థానంలో నిల్చింది. అందుకు అవార్డు కూడా ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? ఒకవైపు అవార్డులు. మరోవైపు విమర్శలు. మాకు ఇన్ని అవార్డులు ఇస్తున్నా, వస్తున్నా ఏనాడూ మేము ప్రచారం కోసం పాకులాడలేదు’. విప్లవాత్మక సేవలు: ‘గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి, సేవలందిస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీన ఇంటి తలుపుతట్టి పెన్షన్ అందిస్తున్నారు. అయినా వారిపైనా విమర్శలు చేస్తున్నారు’. ఫార్మా సిటీ–స్టీల్ ప్లాంట్‌పై అసత్యాలు: ‘ఫార్మా సిటీ తామే తెచ్చామని అంటున్నారు. దాని పేరు జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ. టీడీపీ హయాంలో వస్తే ఆ పేరు పెడతారా?. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ టీడీపీ హయాంలోనే ప్రారంభమైంది. అప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కేంద్రంలో మంత్రులుగా ఉండి కూడా ఆ పని చేయలేదు. ఇప్పుడు సీఎంను నిందిస్తున్నారు’. కొడుకు నోటికి తాళం వేయాలి: ‘ఇక చంద్రబాబు కొడుకు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ‘నీ అమ్మ మొగుడిదా’ అని అంటున్నాడు. కనీసం తండ్రి అయినా ఆ మాటలకు అడ్డుకట్ట వేయాలి. ఇదేనా సంస్కారం?. నేను గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసి ఫలానా ఫలానా పని చేశానని ఒక వేళ చేసి ఉంటే ధైర్యంగా చెప్పు. అందరూ స్వాగతిస్తారు. అంతేతప్ప నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కాదు. ఇవాళ మేము ఫలానా పని చేశామని «ధైర్యంగా చెప్పగలము. కానీ మీకు ఆ ధైర్యం లేదు’. బాధ్యతగా సేవలందిస్తాము: ‘మేము ప్రజల నుంచి గెల్చి వచ్చాము. అడ్డదారిలో రాలేదు. మాకు బాధ్యత ఉంది. అందుకే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాము. పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించి, మాపై బా«ధ్యతలు పెంచారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఫలితాలు వస్తాయి. మేము మరింత బాధ్యతగా పని చేస్తాము. ప్రజలకు ఇంకా ఇంకా సేవ చేస్తాము. అదే మా సీఎం శ్రీ వైయస్ జగన్ లక్ష్యం’. పన్నులపై అడ్డగోలు ఆరోపణలు: ‘మేము పన్నులు పెంచబోతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు తన హయాంలో 33 శాతం నీటి పన్ను 2018లో పెంచాడు. పన్నుల వసూళ్లలో కొత్త విధానం తెస్తున్నాం. ఎవరికీ ఇబ్బంది కలగకుండా కేంద్ర ఆర్థిక సంఘం సూచనల మేరకు ఆస్తి విలువపై పన్ను వసూలు చేసే విధంగా విధానాన్ని తీసుకువస్తున్నాం. ప్రస్తుత పన్నుపై 15 శాతానికి మించి పెంచొద్దని ఒక చట్టం కూడా చేశాం. ఇప్పుడు పన్ను ఖరారులో చాలా లోపాలున్నాయి. అందుకే ఈ సవరణలు. అయినా సరే, ప్రస్తుత పన్నుపై 15 శాతానికి మించకుండా కొత్త పన్ను వేసేలా చట్టం చేశాము. కానీ లేనిపోని అసత్య ప్రచారం చేస్తున్నారు’. ‘ఇది ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం. వారికి ఇబ్బంది కలిగితే పునరాలోచన కూడా చేస్తాం. ఏం చెప్పినా, ఏం చేసినా ఒక శాస్త్రీయ విధానం, దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే పని చేస్తాం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.