ఎన్ని కుతంత్రాలు ప‌న్నినా.. ఇళ్ల పట్టాల పంపిణీ ఆగదు

 ఆగస్ట్‌ 15న  పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ

టిట్కో  పేరుతో పెద్ద అవినీతి జరిగింది

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

  విజయవాడ : ఎన్ని కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ ఆగ‌ద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. ఆగస్ట్‌ 15న  పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  
మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ప్ర‌భుత్వం మంచి చేస్తుంటే బాబు అడ్డుప‌డుతున్నారు
ఇళ్లులేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. సుమారు 30 లక్షలమంది లబ్దిదారులను గుర్తించాం. జులై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 26,034 ఎకరాల భూమిని సేకరించి లే అవుట్లు వేశాం. లబ్ధిదారులు అందరూ ఇళ్ల స్థలాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. లోక కల్యాణం కోసం యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఎలా అడ్డుకున్నారో పురాణాల్లో సినిమాల్లో చూశాం. ఈ ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు అడ్డుకుంటున్నారు. 

ఆ సొమ్మును లబ్ధిదారులకు పంచుతాం
 గత ప్రభుత్వంలో టిట్కో (టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్ర్ఫాస్ట్రక్చరల్‌ కార్పొరేషన్‌) పేరుతో పెద్ద అవినీతి జరిగింద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.  300 చదరపు అడుగుల లోపు పూర్తి చేసే ఇళ్లకు లబ్ధిదారులు ఒక్క  రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. 345, 430 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి మాత్రం లబ్దిదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. 345, 430 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళాం. రూ.400కోట్లు ఆదా అయ్యాయి. ఆ సొమ్మును లబ్ధిదారులకు పంచుతాం. మిగిలిన సొమ్మును లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. వీరిలో ఎవరైనా ఇల్లు అవసరం లేదనుకుంటే  డబ్బులు వెనక్కు ఇచ్చేస్తాం. అలాగే వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Back to Top