50 శాతం టికెట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే

ఈ మాట సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీదే విజయం

ఎన్నికల్లో డబ్బు, మద్యం నిషేధం నిర్ణయం విప్లవాత్మకం

సీఎం నిర్ణయం రాబోయే రోజుల్లో దేశమంతా అమలవుతుంది

ఆర్థికంగా రాష్ట్రాన్ని దెబ్బతీయాలని టీడీపీ కుట్ర చేస్తోంది

బీసీలు బాగుపడడం చంద్రబాబుకు ఇష్టం లేదా..?

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని, పార్టీ పరంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 50 శాతం టికెట్లు ఇచ్చి గెలిపించుకొని మాట నిలబెట్టుకుంటామన్నారు. రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల్లో డబ్బు, మద్యం నిషేధం నిర్ణయం విప్లవాత్మకం అన్నారు. సీఎం నిర్ణయం రాబోయే రోజుల్లో దేశమంతా అమలవుతుందన్నారు. బలహీనవర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా బాగుపడడం చంద్రబాబుకు ఇష్టం లేదని, అందుకే స్థానిక సంస్థల రిజర్వేషన్‌ను కోర్టుకెళ్లి మరీ అడ్డుకున్నాడని మండిపడ్డారు. 

అనంతపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రిజర్వేషన్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా జారీ అయ్యింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్‌ స్థానాలకు, మిగతా ప్రక్రియ కూడా మొదలవుతుందని ఊహిస్తున్నాం. ఆ నేపథ్యంలోనే పట్టణ ప్రాంతాలకు సంబంధించి మున్సిపల్, కార్పొరేషన్‌కు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఈ నెల 30వ తేదీ లోపు ఎన్నికలు పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 30వ తేదీ లోపు ఎన్నికలు జరపాలని, నిధులు వృథా కాకుండా.. అభివృద్ధికి ఆటంకం కలగకుండా కార్యక్రమాలు జరగాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఎన్నికలు రెండున్నర నెలల కిందటే జరపాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రక్రియ కూడా ప్రారంభించి రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 59 శాతం రిజర్వేషన్‌ జనాభా ప్రతిపాదన ఉండాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకొని జీఓలు కూడా విడుదల చేశాం. ఎన్నికల కమిషన్‌కు కూడా జీఓలను పంపించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో బలహీనవర్గాలకు 34 శాతం రిజర్వేషన్‌ వస్తే వారు బలపడిపోతారే.. బాగుపడతారే.. అలా జరగకూడదని దుర్బుద్ధితో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులతో కోర్టులో చంద్రబాబు పిటీషన్‌ వేయించి ఎన్నికలను అడ్డుకున్నాడు. 

59 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా టీడీపీ వ్యవహరించింది. జనాభా ప్రాతిపదికన అందరికీ సమన్యాయం జరగాలని ప్రభుత్వం, సీఎం వైయస్‌ జగన్‌ కృతనిశ్చయంతో అధికారులకు ఆదేశాలిచ్చి కోర్టులో వాదించారు. టీడీపీ నేతలు సుప్రీం కోర్టుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అడ్డుకోవాలని, అభివృద్ధికి ఆటంకం కలిగించాలనే దుర్బుద్ధితో టీడీపీ ప్రయత్నించింది. 50 శాతం రిజర్వేషన్‌ మించకూడదని తీర్పు ఇవ్వడమే కాకుండా 30 రోజుల్లో ఎన్నికలు జరపాలని సూచించింది. 

బలహీనవర్గాల కోసం ఏ ప్రభుత్వాలు కూడా సీఎం వైయస్‌ జగన్‌లా ఆలోచన చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రతీ అంశంలో 50 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని పట్టుబట్టి సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేయిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఐదుగురు మైనార్టీలు, ముగ్గురు ఎస్సీ, ఇద్దరు ఎస్టీలకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవులు ఇచ్చేవాళ్లం. ఇవాళ 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవులు, వాటితో పాటు దేవాదాయ కమిటీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లు, యూనివర్సిటీల్లోని పాలక వర్గాలు, లీగల్‌ డిపార్టుమెంట్‌లో కూడా 50 శాతం బలహీనవర్గాలకు ఇవ్వడం ఒక చరిత్ర. ఈ అధ్యాయం సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ప్రారంభమైంది. ఇది రాబోయే కాలంలో చిరస్థాయిలో ఉండిపోతుంది. దీన్ని మార్పులు చేసే సాహసం ఎవరూ చేయలేరు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే బీసీలకు జరిగే మేలును టీడీపీ మోకాలడ్డుతుంది. పత్రికల ముందు ఒకలా.. చేసే చేష్టలు వేరేలా ఉన్నాయి. దళితుడిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఎస్సీలను కించపరిచేలా మాట్లాడాడు. బీసీలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. జరగబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్‌ చైర్మన్, కార్పొరేషన్‌ చైర్మన్‌లలో 50 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టికెట్లు ఇచ్చి గెలిపించి మాట నిలబెట్టుకుంటాం. 

రాజకీయ వ్యవస్థను మెరుగుపర్చాలని, బాగు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా కఠిన చట్టాన్ని అమలుపరచడం అభినందనీయమన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచుతూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష, అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందన్నారు. దేశంలోనే ఈ నిర్ణయం విప్లవాత్మకం. ఇది యావత్తు భారత్‌దేశంలో రాబోయే రోజుల్లో అమలవుతుంది. ఇటువంటి ఆలోచనలతో ముందుకువెళ్తున్నాం’ అన్నారు.
 

Back to Top