చంద్రబాబే ఈ రాష్ట్రానికి శత్రువు

రాష్ట్రంలో ఎక్కడా పెన్షన్లు తగ్గించలేదు

నిబంధనల ప్రకారం అర్హులందరికీ పింఛన్లు ఇచ్చాం

గత ప్రభుత్వం కంటే 2 లక్షలకు పైగా పెన్షన్లు అదనంగా ఇచ్చాం

6,44,724 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశాం

పింఛన్లు అందని వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు

అధికారం కోల్పోవడంతో చంద్రబాబులో అసహనం పెరిగింది

చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి నిరోధకుడు

రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా నష్టపోవాలని బాబు దుర్భుద్ధి

మంత్రి బొత్స సత్యనారాయణ

సచివాలయం: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా నష్టపోవాలని చంద్రబాబు దుర్భుద్ధితో వ్యవహరిస్తున్నారని, ఈ రాష్ట్రానికి అసలు శత్రువు ఆయన, టీడీపీనే అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని చంద్రబాబు ఆలోచన అన్నారు. చంద్రబాబు కుతంత్రాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజలు ఏరి కోరి ముఖ్యమంత్రిని చేసుకున్నారని, వారికి మంచి చేసేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని స్పష్టం చేశారు. పింఛన్లు తొలగించామని, రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయన్న టీడీపీ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. సచివాలయంలో శుక్రవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 
ప్రతిపక్షాలు, మాజీ సీఎం చంద్రబాబు తనకున్న గుణంతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. దానిపై మంత్రులుగా వాస్తవాలు చెప్పాం. ముఖ్యమంత్రి కూడా పింఛన్ల పంపిణీపై వాస్తవాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ప్రభుత్వం 52.17 లక్షల పింఛన్లు పంపిణీ చేస్తే..మా ప్రభుత్వం వచ్చాక ఈ పింఛన్లను పెంచింది. ప్రస్తుతం 53,75,210 పింఛన్లు లబ్ధిదారులకు ఇచ్చాం. సుమారు లక్ష 75 వేల పింఛన్లు అదనంగా ఇచ్చాం. ఇవి కాకుండా దీర్ఘకాలిక పింఛన్లు కలిపి రెండు లక్షలు కొత్తగా ఇచ్చాం. సుమారు 6,46,724 కొత్తవాళ్లకు ఇచ్చాం. పాత పింఛన్లలో 4,16,034  అనర్హులుగా ప్రకటించాం. వీరందరిని కూడా మళ్లీ పరిశీలన చేసి, నిబంధనల మేరకు పింఛన్లు పునరుద్ధరిస్తాం. ఐదు రోజుల్లో నిర్ధారణ చేసి పోయిన పింఛన్‌ కలిపి వచ్చే నెలలో రెండు నెలల పింఛన్‌ సొమ్ము ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్కరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం పేదల కోసం ఉంది. సంఖ్యను తగ్గించుకోవాలని గత ప్రభుత్వం మాదిరిగా ఆలోచన చేయం. 
300 యూనిట్లు కరెంటు వినియోగించిన కుటుంబాన్ని పింఛన్‌కు అనర్హులుగా ప్రకటించాం. ఆ సంఖ్య సుమారు 8,009 మంది ఉన్నారు. అవి కూడా పరిశీలిస్తాం. ఒక ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు ఇంటి యజమాని, అద్దెకు ఉన్న వారు కూడా కలిసి ఒకే మీటర్‌ వినియోగిస్తుంటారు. అలాగే ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటారు. వాళ్లకు ఒకే మీటర్‌ ఉంటుంది. అలాంటి వాళ్లకు కూడా 300 యూనిట్లు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారిని కూడా పరిశీలిస్తారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, ఎవరికీ నష్టం జరుగకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పేదవారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. గత నెలలో పింఛన్‌ తీసుకొని ఇప్పుడు అందని వారికి రీ వెరిఫై చేసి అర్హులందరికీ రెండు నెలల పింఛన్‌ ఒకేసారి ఇస్తాం. అధికారం కోల్పోయి అసహనంతో ఉన్న చంద్రబాబు ప్రతి రోజు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు మాటలు నమ్మొద్దు. ఈ రాష్ట్ర ప్రజలు ఏరికోరి వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకున్నారు. కాబట్టి అందరికీ మంచి చేస్తారు.
రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతున్నాయని, కియా మోటర్స్‌ పక్కరాష్ట్రాలకు వెళ్లుందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కియా మోటర్స్‌పై మా మంత్రులు, కియా యాజమాన్యం వివరణ ఇచ్చింది. చంద్రబాబుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని గత ఐదేళ్లు భగవంతుడు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు హయాలో సుమారు రూ.2 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. రాష్ట్రాన్ని దివాళ తీయించారు. రోడ్డు పక్కన వెళ్తున్న వారికి సూట్‌ బూట్‌ వేసి సమ్మిట్లు అంటూ ఇచ్చిన పేపర్లే  ప్రతి ఏటా ఇచ్చారు. దావోస్‌కు వెళ్లి ఆంధ్ర భోజనం పెట్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. చంద్రబాబు దుబారా అందరికీ తెలిసిందే. ప్రజలు అందుకే చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారు. ఈ రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా నష్టపోవాలన్న దుర్భుద్ధి, దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు, టీడీపీనే. ఈ రాష్ట్రానికి శత్రువు చంద్రబాబు, తెలుగు దేశం పార్టీనే. బాధ్యత కలిగిన వ్యక్తి ఇలాంటి ఆలోచన చేస్తారా? ఎంతసేపు రాజకీయ లబ్ధి తప్ప రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. రోజు గ్లోబెల్‌ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ధర్మం, న్యాయం గెలుస్తాయి. అధర్మం ఎప్పటికీ నిలకడగా ఉండదు. గత ఎనిమిది నెలల్లో సీఎం వైయస్‌ జగన్‌ అద్భుతమైన పాలన అందిస్తుంటే..ఓర్వలేక చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. 4 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు సృష్టించారు. సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే తీసుకెళ్తుండం చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మొద్దని మంత్రి బొత్ససత్యనారాయణ  కోరారు.

Back to Top