నిరూపిస్తే రాజీనామా చేస్తా.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటావా..?

చంద్రబాబుకు మంత్రి అవంతి శ్రీనివాస్‌ సవాల్‌

విశాఖపట్నం: విశాఖలో గజం స్థలం అవినీతి జరిగిందని, భూకుంభకోణం జరిగిందని చంద్రబాబు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేదంటే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకంత బాధ అని ప్రశ్నించారు. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలల తరువాత రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు మహానాడులో ప్రజలను మభ్యపెడుతూ మాట్లాడుతున్నారని, ఆ వేదికను ఉపయోగించుకొని 2019 ఓటమిపై విశ్లేషించుకుంటే బాగుండేదన్నారు. ప్రజలు కరోనా కష్టకాలంలో ఉంటే చంద్రబాబు హైదరాబాద్‌లో కాలక్షేపం చేసిన చంద్రబాబు.. రెండ్రోజుల క్రితం ఏపీకి వచ్చి ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలనలోనే 90 శాతం హామీలు నెరవేర్చారని, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. విద్యతోనే పేదల జీవితాల్లో మార్పులొస్తాయని సీఎం గట్టిగా నమ్మారని, అందుకే అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారన్నారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో రూ.6,500 కోట్లు జమ చేశారన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దాలని ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. జగనన్న గోరుముద్ద పేరుతో విద్యార్థులకు పౌష్టికాహారంతో రోజుకో మెనూ, జగన్న వసతి దీవెన, విద్యా కానుక పేరుతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. అవినీతి రహిత పరిపాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. 
 

Back to Top