విశాఖ అభివృద్ధిని అడ్డుకోవద్దు బాబూ

మంత్రి ముత్తంశెట్టి హితవు

 రాష్ట్రానికి ఒక తండ్రిలా వైయ‌స్ జ‌గన్ గారు ఆలోచిస్తున్నారు

చంద్రబాబుకు వయసైపోయిది... బుద్ధి మందగించింది. 

 నాయకుడికి ఉండాల్సింది 40 ఏళ్ళ అనుభవం కాదు... పెద్ద మనసు, అది జగన్ గారికి ఉంది. 
 
పేదలకు మంచి చేసే ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడం ఇకనైనా ఆపండి బాబూ.. 

 పేదలకు లక్షలు విలువ చేసే ఇళ్ళ స్థలాలు ఇచ్చి.. జగనన్న కాలనీల ద్వారా ఊళ్ళే నిర్మిస్తున్నాం 

 మూడు రాజధానులు, మూడు ప్రాంతాల అభివృద్ధే మా విధానం 

 విశాఖలో పేదల ఇళ్ళ పంపిణీ కార్యక్రమానికి అనుకూలంగా వచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం 

  
 విశాఖ:  విశాఖ అభివృద్ధిని అడ్డుకోవ‌ద్ద‌ని మంత్రి అవంతి శ్రీనివాస్  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు హిత‌వు ప‌లికారు. పేదలందరికీ ఇళ్ళ పథకం కింద.. విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని మంత్రి స్వాగ‌తించారు. విశాఖ జిల్లాలో మొత్తం లక్షా 84 వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామ‌నితెలిపారు. అనకాపల్లి, భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్ తో పాటు గాజువాక  ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామ‌ని చెప్పారు. మొత్తం 6,116 ఎకరాల్లో ఒక్కొక్కరికీ 70 గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామ‌ని వివ‌రించారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆలోచనల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం. పేదల నోటి కాడ కూడు కొట్టవద్దని మనవి చేస్తున్నాం. పేదలకు మంచి చేసే పథకాలను అడ్డుకోవద్దని కోరుతున్నాం. ఆదివారం విశాఖ‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

 ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇచ్చే పేదలందరూ మా పార్టీ వాళ్ళే కాదు కదా. టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారూ ఉన్నారు. గతంలో మాదిరిగా ఇళ్ళ పట్టాలు అంటే ఊరి బయట కాకుండా, జగనన్న కాలనీలను ఊళ్ళల్లోనే కట్టిస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం 31 లక్షలమందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చి, ఇళ్ళు నిర్మిస్తున్నాం. అంటే, కోటి 20 లక్షల మందికి సొంత ఇల్లు ఏర్పడుతుంది. వారికి రోడ్లు, డ్రైనేటీ, తాగునీరు, విద్యుత్.. ఇలా మౌలిక సదుపాయాలు అన్నీ అక్కడ ఏర్పడతాయి. ఇది అభివృద్ధి కాదా.. అభివృద్ధి ఎక్కడ కుటుపడింది.
  వెల్లంకి గ్రామంలో... గజం 30 వేలు ఉన్న ప్రాంతాల్లో 70 గజాలు ఇస్తే.. దాని విలువ రూ. 20 లక్షలు, అన్ని లక్షల ఖరీదు చేసే ఇళ్ళ స్థలాలను ఈరోజు పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. 
  ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు, టిడిపి ఎన్ని కుట్రలు చేసినా.. జగన్ గారు ఎక్కడా వెనకడుగు వేయకుండా అభివృద్ధి-సంక్షేమంలో ముందుకు దూసుకువెళుతున్నారు. కోర్టులకు వెళ్ళి మళ్ళీ అడ్డుకోవద్దు అని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు, మేధావులు గమనించాలి.  పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ చేసి, జగనన్న కాలనీల నిర్మాణం వల్ల ఈరోజు ఏకంగా ఊళ్ళకు ఊళ్ళే నిర్మితమవుతున్నాయి. అభివృద్ధి ఎక్కడ అని విమర్శలు చేసే ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నిస్తున్నాం.. ఇదంతా అభివృద్ధి కాక మరేమిటీ అని..?

 మరోవైపు విద్య, వైద్యానికి వైయస్సార్సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో సీట్లు దొరక్క రికమండేషన్ లేఖలు వచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఎప్పుడైనా ఇలా జరిగిందా..?. పేద విద్యార్థులు కూడా ఇంగ్లీషు మీడియం చదువులు చదివాలని, ఇంగ్లీషు మీడియం పెడితే హేళన చేశారు. ఈరోజు పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతున్నారు. ముందు చూపు అంటే ఇదీ. 40 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలి. 

  గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ తీసుకురావడం వల్ల కొవిడ్ కష్టకాలంలోనూ అతి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడ్డాం. ఏ గ్రామం వెళ్ళినా సచివాలయం.. ఆర్బీకే కేంద్రం, ఆరోగ్య కేంద్రం, మిల్క్ కేంద్రం.. ఇవన్నీ ఎప్పుడైనా చూశామా..ఇప్పుడు చూస్తున్నాం. గతంలో పది లక్షల రూపాయలతో ఒక పంచాయతీ భవనం కడితే గొప్పగా చెప్పుకునేవారు. ఈరోజు గ్రామంలో ప్రజలకు అవసరమైనవన్నీ అక్కడే అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రంలో జరిగే సంక్షేమం.. దేశంలో ఏ రాష్ట్రంలో జరగటం లేదు.
- రైతు భరోసా దగ్గర నుంచి అమ్మ ఒడి, ఆసరా, చేయూత... ఇలా ఏ పథకం తీసుకున్నా, ఆఖరికి ఆరోగ్యశ్రీలో చంద్రబాబు ఎగ్గొట్టిపోయిన బకాయిలను కూడా మేం చెల్లించాం. 
- నాయకుడికి కావాల్సింది 40 ఏళ్ళ అనుభవం కాదు.. నాయకుడికి కావాల్సింది పెద్ద మనసు. అది జగన్ గారికి ఉంది. 

  గతంలో సంపదనంతా హైదరాబాద్ లో పెట్టడం వల్ల.. మిగతా ప్రాంతాలు నష్టపోయాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయ్యాయి. అందుకే, గతంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకూడదని, మూడు ప్రాంతాలు సమగ్రాభివృద్ధి కావాలనే ముందు చూపుతో జగన్ గారు మూడు రాజధానుల విధానం తెచ్చారు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. అంతకంటే, గొప్ప ప్రజా న్యాయ స్థానం ఉంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన అవసరం మాకు ఉంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. 
- అమరావతిని తీసేస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. అమరావతితో పాటు మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధే మా విధానం. 
- ముఖ్యమంత్రిగారికి ఎలాంటి స్వార్థం లేదు. స్వార్థం ఉంటే ఎగ్జిక్యూటివ్ రాజధానిని తీసుకువెళ్ళి రాయలసీమలో పెట్టేవారు కదా.. విశాఖలో ఎందుకు పెడతారు. రాష్ట్రానికి ఒక తండ్రిలా జగన్ గారు ఆలోచిస్తున్నాడు. 

 ఏ పథకం తీసుకున్నా శాచురేషన్ పద్ధతిలో అమలు చేస్తున్నారు. కులం చూసో, మతం చూసో.. పార్టీ చూసో, ప్రాంతం చూసో అమలు చేయడం లేదు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని... ఒక పార్టీకి కాదు అని జగన్ గారు అనేక సందర్భాల్లో స్పష్టంగా తన విధానం ఏమిటో చెప్పారు. నిన్న బడ్జెట్ లో ప్రకటించినట్టుగా.. ఎమ్మెల్యేలకు రూ. 2 కోట్ల అభివృద్ధి నిధులను కూడా అన్ని నియోజకవర్గాలకు ఇస్తామని చెప్పారు. మా పార్టీ వారికే ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. 

  దేశానికే మార్గదర్శకంగా జగన్ గారి పరిపాలన ఉంది. కర్ణాటక, జార్ఖండ్ ముఖ్యమంత్రులు కూడా మూడు రాజధానుల విధానం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలానే, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం అభినందించారు. కొవిడ్ సమయంలో వాలంటీర్లు ప్రాణాలకు సైతం తెగించి, ఆరు సార్లు సర్వేలు చేసి, ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచారు.

 చంద్రబాబుకు వయసైపోయిది. అతని బుద్ధి మందగించింది. "నాకు రావే మంచి ఆలోచనలు. జగన్ గారికే ఎందుకు వస్తున్నాయన్నదే ఆయన ద్వేషం, ఈర్ష్యా..."
- విశాఖలో ఆర్థిక రాజధాని పెడితే.. తుపానులు వస్తే మునిగిపోతుందని టీడీపీకి వత్తాసు పలికే మీడియాలో వార్తలు రాశారు. మరి, చెన్నై, ముంబై సముద్రం పక్కన లేవా..?
- మూడు రాజధానులు, మూడు ప్రాంతాల అభివృద్ధే మా విధానం. విశాఖపట్నం మీద జగన్ గారికి ఎనలేని ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. 
- విశాఖకు భౌగోళికంగా చాలా వనరులు ఉన్నాయి. పోర్టులు, భోగాపురం ఎయిర్ పోర్టు.. రైల్వే సదుపాయం.. అన్నీ ఉన్నాయి. విశాఖ అభివృద్ధిని అడ్డుకోవద్దు అని చంద్రబాబుకు హితవు పలుకుతున్నాం.

జిల్లాల విభజనకు చంద్రబాబు అనుకూలమా.. వ్యతిరేకమా.. అంటే ఎందుకు చెప్పడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కనీసం, కుప్పంకు రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేకపోయి, ఈరోజు అడుగుతున్నాడు. అలానే, బాబు బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని కోరుతున్నాడు. చంద్రబాబుకు చెప్పకుండానే అడుగుతున్నాడా..?

  అప్పులు చేస్తున్నామని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కేంద్ర అప్పులు చేయలేదా.. అప్పులు లేకుండానే దేశాన్ని పరిపాలిస్తుందా.. ?. బీజేపీ పాలిత ప్రాంతాలపైనే ప్రేమ చూపించకుండా, బీజేపీ ఏతర రాష్ట్రాల అభివృద్ధికి కూడా పాటు పడాలి. 
- విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలి. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రవేటీకరణ చేయకూడదు. బీజేపీ నేతలకు అంత చిత్తశుద్ధి ఉంటే.. ఈ రెండూ ఎందుకు నెరవేర్చలేదు..?
- విభజన హామీలు అమలు పై బీజేపీ నాయకులు చేసున్న కృషి ఎంటి..?
- పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పవన్ కళ్యాణ్ కు ఏపీపై శ్రద్ధ ఉంటే.. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై  పోరాటం చేయవచ్చు కదా అని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ ప్ర‌శ్నించారు.
 

Back to Top