విశాఖ పరిపాలనా రాజధానికి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అనుకూలమా? వ్యతిరేకమా? 

 పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) 

విశాఖ రాజధాని విషయంలో దమ్ము, ధైర్యం ఉంటే బాబును ఒప్పించండి 
 
విభజన సమయంలో అనుసరించిన రెండు కళ్ళ సిద్ధాంతాన్నే.. మూడు రాజధానులపై బాబు అనుసరిస్తున్నాడు 
 
విశాఖ స్టీల్ ప్లాంట్ పై గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వైయ‌స్ఆర్సీపీది ఒకటే స్టాండ్. 
 
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే.. పరిపాలన రాజధానిని అడ్డుకోవద్దు. 
 
టీడీపీకి ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు, సీట్లు కావాలి తప్పితే.. అభివృద్ధి చెందితే ఓర్చుకోలేరు 
 
మూడు రాజధానులు, స్టీల్‌ప్లాంట్‌, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ స్పష్టత తెచ్చుకోవాలి 

విశాఖ‌: విశాఖ పరిపాలనా రాజధానికి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అనుకూలమా? వ్యతిరేకమో చెప్పాల‌ని  పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) డిమాండు చేశారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట ఈ ప్రాంత టీడీపీ నేతలు డ్రామాలు ఆడే బదులు.. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు విశాఖే పరిపాలనా రాజధానిగా కావాలని తీర్మానించి, ఆ తీర్మానాన్ని చంద్రబాబుకు పంపాలని పేర్కొన్నారు. విశాఖ పరిపాలనా రాజధానికి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది ప్రకటించిన తర్వాతే , ఈ ప్రాంత అభివృద్ధిపై చర్చలు జరపాలని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతలకు దమ్మూ, ధైర్యం ఉంటే విశాఖను పరిపాలనా రాజధానిగా చేసేందుకు చంద్రబాబును ఒప్పించాలని మంత్రి అవంతి సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..  పరిపాలనా రాజధానిగా విశాఖను అడ్డుకోవద్దని మంత్రి అవంతి హితవు పలికారు. సోమ‌వారం విశాఖ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడారు.

 మా ప్రభుత్వ విధానం మూడు ప్రాంతాల అభివృద్దే లక్ష్యం. అ‍న్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉండాలి. పరిపాలనా రాజధానిని విశాఖలో పెడితే అమరావతిని నిర్లక్ష్యం చేస్తామని కాదు... అమరావతి ప్రాంత రైతులను కానీ, మరెవర్నీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు.

  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మూడు ప్రాంతాలను సమగ్రాభివృద్ధి చేయాలని మూడు రాజధానులపై అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు అంత సానుకూలంగా స్పందించలేదు. కనీసం ఈరోజు అయినా ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరుతో చంద్రబాబు, లోకేష్‌ లేకుండా సమావేశం పెట్టుకోగలిగారు. 

 అచ్చెన్నాయుడు ఛాలెంజ్‌ లు విసిరేముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి.  విశాఖపట్నం పరిపాలనా రాజధానికి మీరు అనుకూలమా? వ్యతిరేకమా? ఈ విషయంలో మీకు చంద్రబాబునాయుడును ఎదిరించే దమ్ము,ధైర్యం ఉందా? సూటిగా మీ అభిప్రాయం వెల్లడించండి. రాష్ట్ర చరిత్ర చూస్తే గతంలో మద్రాస్‌, కర్నూలు, హైదరాబాద్ లు రాజధానులుగా ఉన్నాయి. విభజన తర్వాత 13 జిల్లాలతో కొత్త రాజధాని ఏర్పడింది. సంపద అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్లే మిగత ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. అదే రిపీట్ అయితే 25, 30 ఏళ్ల తర్వాత అయినా, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావలంటూ ఉద్యమం మొదలవుతుంది.
  మన సంపద అంతా ఒకేచోట కేంద్రకృతం చేయడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది మరోసారి ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే మూడు రాజధానుల అంశాన్ని తీసుకువచ్చాం.

 ఉత్తరాంధ్ర ప్రాంతం మనకు ఎన్నో ఇచ్చింది. రాజకీయ పదవులు, హోదాలు ఇచ్చింది. రాజధానిని కోరుకోవడం అత్యాశేమీ కాదు. రాజధాని కావడానికి విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి. విశాఖను రాజధానిగా ఏర్పాటు చేస్తే మిగతా ప్రాంతాలకు దూరం అని మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఆలోచించాలి. భ్రమల్లో ఉంటామంటే చేసేదేమీ లేదు. విశాఖ పరిపాలనా రాజధానిగా ఏర్పడితే ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంతో అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమలతో పాటు, స్థానికులకు 75శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రిగారు చట్టం తెచ్చారు. ఇటువంటి చట్టం తేవడానికి కూడా గట్స్‌ ఉండాలి. అటువంటి గొప్ప నిర్ణయాన్ని జగన్ మోహన్ రెడ్డిగారు చేశారు. 

 2019 ఎన్నికల్లో టీడీపీకి విశాఖ ప్రజలు నాలుగు అసెంబ్లీ స్థానాలను కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీకి విశాఖ ప్రజల ఓట్లు, సీట్లు కావాలి కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే వారి ఆటలు సాగవన్నదే మీ భయం. ఇటువంటి మీ విధానాన్ని ఏరకంగా మీరు సమర్థించుకుంటారు..? ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పష్టమైన వైఖరితో ఉండాలి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు, మా పార్టీ ఎమ్మెల్యులు, ఎంపీలు, మంత్రులు... మూడు రాజధానుల విషయంలో అందరమూ ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నాం. 

  కర్నూలులో హైకోర్టు కావాలన్న వారే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు పెట్టడానికి కర్నూలుకు అర్హత లేదా? టీడీపీలో ముందు క్లారిటీ లేదు. పార్టీలుగా ఎవరికి వారికి భేదాభిప్రాయాలు ఉన్నా... రాష్ట్ర ప్రజలంతా ఒకమాట మీద ఉండాలి. దీనిపై ఒక స్పష్టమైన అభిప్రాయం వెల్లడిస్తే... తర్వాత రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం.

 శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్య ఉంటే.. మిగతా అన్ని పార్టీల వారు పరామర్శలకే మిగిలిపోతే.. ఆచరణలో వారికి మేలు చేసిన నాయకుడు వైఎస్‌ జగన్‌ గారు. వారికి సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రిని కేటాయించారు. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పడమే కాకుండా వాటిని మంజూరు చేసి పనులు చేపట్టడం వాస్తవమా.. కాదా? చర్చా వేదికలు, సమావేశాలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తే... మిమ్మల్ని నమ్మరుగాక నమ్మరు. మిమ్మల్ని, మీ మాయ మాటల్ని నమ్మకపోవడంతోనే గత ఎన్నికల్లో మీకు 23 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోపెట్టారు. గోబెల్స్‌ ప్రచారంలా చెప్పినమాటే చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

  సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ఆనాడు జలయజ్ఞం పేరుతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు చేపట్టిన ప్రాజెక్టులపై, మీరు, మీ మీడియా అబద్ధపు ప్రచారాలు, విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయితే విశాఖకు తాగునీరు, ఉత్తరాంధ్రకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తిచేస్తాం. అందుకు కట్టబడి ఉన్నాం.

  ప్రభుత్వ స్కూళ్లు చూస్తే... చంద్రబాబు హయాంలో కార్పొరేట్‌ సూళ్లకు అండగా నిలబడ్డారు. వైయస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే నాడు-నేడు ద్వారా కొన్నివేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో వేకెన్సీ’ బోర్డులు పెట్టడం మనం చూస్తున్నాం. ప్రభుత్వ సూళ్లల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో లక్షల్లో అడ్మిషన్లు పెరిగాయి. ఎవరెన్ని మాటలు చెప్పినా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం... ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేయడమే.

  రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ, మరోవైపు అభివృద్ధి చేస్తుంటే వాటిని అడ్డుకోవడం కోసం కేసులు వేసి, టీడీపీ కోర్టులకు  వెళుతుంది. విశాఖలో పేదలకు ఇళ్ళపట్టాలు ఇస్తుంటే..  కోర్టుల్లో కేసులు వేసి, లక్షా 80వేలమందికి ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నది మీరు కాదా?.  మీకురాజకీయాల్లో అనుభవం ఉండొచ్చు, సీనియార్టీ ఉండవచ్చు. కానీ పాలు ఏంటో నీళ్లేంటో ప్రజలకు బాగా తెలుసు. పనిచేసేది ఎవరో.. పబ్బం గడుపుకునేది ఎవరో వారికి స్పష్టంగా తెలుసు.

 విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. 25 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశాం. కార్మికులు ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ తరపున పాల్గొన్నాం. పార్లమెంట్‌లోపల, బయటా పోరాటం చేశాం. ఈ విషయంలో ముఖ్యమంత్రిగారు స్వయంగా ప్రధానికి లేఖలు రాయడం జరిగింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైయస్సార్‌ సీపీ ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తోంది. కేంద్రం ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. దీనిపై కూడా మాపై బురద చల్లేలా, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మా ముఖ‍్యమంత్రి చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు.

  గంగవరం పోర్టు చూస్తే 90శాతం ప్రైవేటుది. పదిశాతమే ప్రభుత్వానికి ఈక్విటీ ఉంది. దానికి సంబంధించి గత అయిదేళ్లలో ప్రభుత్వానికి రూ.80 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది. వచ్చే అయిదేళ్లలో డివిడెంట్‌ ఒక్క రూపాయి కూడా రాదు. పోర్టు విస్తరణకు వెళితే షేర్‌ హోల్డర్‌ కూడా ఖర్చు పెట్టాల్సిందే. ఆ షేర్ ను అమ్మిస్తే అమ్మేశామని అంటున్నారు. చంద్రబాబు గారు హయాంలో ఇలాంటివి 58 సంస్థలను అమ్మేశారు. మీరు చేస్తే ఒప్పు... వేరేవాళ్లు చేస్తే తప్పా? 
- గంగవరం పోర్టు విషయంలో ప్రభుత్వానికి గానీ, మాకు గానీ ఎలాంటి దురాలోచన లేదు. నిబంధనల ప్రకారమే చేయడం జరిగింది. దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకుంటే మీ అమాయకత్వం కన్నా మరొకటి లేదు.

  గల్లీలో అయినా ఢిల్లీలో అయినా మా స్టాండ్‌ను స్పష్టంగా వెల్లడిస్తున్నాం. టీడీపీలోనే ఒక క్లారిటీ లేదు. మూడు రాజధానులు, స్టీల్‌ప్లాంట్‌, ఉత్తరాంధ్ర, విశాఖ గురించి... ముందుగా మీ పార్టీలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మీ విధానం ఏంటనేదానిపై స్పష్టత తెచ్చుకున్న తర్వాతే ప్రభుత్వాన్ని విమర్శించండి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి దగ్గరకు మేము ప్రజా సమస్యలు తీసుకువెళితే వెంటనే స్పందించి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్‌గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. 

  సింహాచలం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా అశోక్‌ గజపతిరాజుగారు ఉన్నప్పుడే 830 ఎకరాలు భూములు మాయం అయ్యాయి. అలాగే సింహాచలం దేవస్థానం భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. పంచగ్రామాలను పరిరక్షించాల్సి ఉంది. చెప్పుకుంటూ వెళితే చాలానే ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై మీకు చిత్తశుద్ది ఉంటే విశాఖను పరిపాలనా రాజధానిగా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ను ఒప్పించండి. 

 ఎంపీ విజయసాయిరెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు. రెండున్నరేళ్లలో ఆయన పేరు చెప్పి ఎక్కడైనా భూ ఆక్రమణలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయా? విమర్శలు, ఆరోపణలు చేసేముందే ఆలోచిస్తే బాగుంటుంది. నేనోదో మంత్రి పదవి కాపాడుకోవడానికి అలా మాట్లాడటం లేదు. 

 టీడీపీ నేతలు దయచేసి ఇప్పటికైనా రియాల్టీలోకి రావాలి. మాటలు కాదు చేతల ద్వారా చూపించండి. అవినీతిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రిగారు ముందే చెప్పారు. వ్యక్తిగత, ప్రాంతాల మధ్య విద్వేషాలు రేకెత్తించడం మంచి పద్ధతి కాదు. టీడీపీ కేవలం ఉత్తరాంధ్రకే పరిమితమా? కోస్తాంధ్ర, రాయలసీమలో ఏమైంది? రాష్ట్ర విభజన అప్పుడు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అనుసరించారు. ఒక కన్ను వెళ్లిపోయింది. ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారు.

 ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతలు మమ్మల్ని పొగడకపోయినా... దయచేసి అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు మూడు రాజధానుల విషయంలో న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకుంది మీరు కాదా? గత అయిదేళ్లలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు నోవాటెల్‌లో మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేసేవారు.  రూ.30 కోట్లు బిల్లులు చెల్లించిన మాట వాస్తవం కాదా? వాటన్నింటీని ప్రజలు మర్చిపోయారనుకోవడం మీ భ్రమ.
- 30,40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు...రాబోయే భవిష్యత్‌ తరాలకు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంత వాసులుగా ఉత్తరాంధ్ర పరిపాలన రాజధానిగా వస్తే అభివృద్ధి చెందుతుందని, చంద్రబాబు నాయుడు, లోకేష్‌ను ఒప్పించండి.

 మన ఆలోచనా విధానంలో మార్పు రాకపోతే.. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసుకోకపోతే.. మళ్లీ మద్రాసు, హైదరాబాద్‌ రాజధానుల తరహాలోనే అదే పొరపాటు పునరావతృం అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే పదవులు, రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా.. పరిపాలన రాజధాని విశాఖపట్నం కావాలని టీడీపీ నాయకులు ఓ తీర్మానం చేసి, చంద్రబాబు నాయుడుకు అందచేయండి. ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల చిత్తశుద్ధి ఉంటే.. దయచేసి పరిపాలన రాజధానిని అడ్డుకోవద్దు. - ఆ తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి, అవినీతి, భూదందాలపై దేనికైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.  ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనా రాజధానిని ఇస్తామంటే అడ్డుకోవడం సరికాదు. ఇప్పటికైనా చౌకబారు రాజకీయ కార్యక్రమాలను మానుకుని, అభివృద్ధిని అడ్డుకోవద్దని హితవు పలుకుతున్నాం.
 అభివృద్ధి గురించి కాకుండా నూటికి నూరు శాతం రాజకీయాల గురించి మాట్లాడే టీడీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేర‌ని  ప‌ర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top