చావు పరామర్శకు వెళ్ళి.. యుద్ధంలో గెలిచినట్టు లోకేష్ చేష్టలేంటి.. ? 

 పర్యాటక శాఖ మంత్రి  అవంతి శ్రీనివాస్ 

 పెళ్ళికీ, చావుకీ ఒకే మంత్రం వేస్తే ఏమవుతుందో తెలుసుకో లోకేష్

  బూతులు మాట్లాడటమే లోకేష్ మార్క్ కొత్త ట్రెండ్.. 

  తలకిందులుగా తపస్సు చేసినా టీడీపీని దళితులు నమ్మరుః ఎమ్మెల్యే గొల్ల బాబూరావు 

విశాఖ‌:  గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు.  హోం మంత్రి సుచరిత నిన్ననే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి, వారికి సాయాన్ని అందించి, ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.  ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థినిని ఈ విధంగా హత్య చేయడం చాలా బాధాకరమ‌న్నారు. సోషల్ మీడియా ద్వారాగానీ, ప్రత్యక్షంగా కానీ మహిళలు, యువతులపై  ఎవరైనా  బెదిరింపులకు పాల్పడితే.. పోలీసులకు ఫిర్యాదు చేయండి. లేకపోతే దిశ యాప్ ద్వారా కంప్లైంట్ చేయండి. దిశ యాప్ ను ప్రతి ఒక్క మహిళ, యువతి డౌన్ లోడ్ చేసుకోవాల‌ని సూచించారు. చావు పరామర్శకు వెళ్ళి.. యుద్ధంలో గెలిచినట్టు టీడీపీ నేత నారా లోకేష్ చేష్టలేంట‌ని మంత్రి మండిప‌డ్డారు.  మంగ‌ళ‌వారం విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు.

 మహిళలపై అఘాయిత్యాలకు  పాల్పడితే.. ఈ ప్రభుత్వం ఏ కులమైనా, మతమైనా, ఎవర్నీ ఉపేక్షించదు. పక్క రాష్ట్రంలో ఓ మెడికోపై అఘాయిత్యం జరిగితే.. ముఖ్యమంత్రి జగన్ గారు స్పందించి, అసెంబ్లీలో దిశ బిల్లు చేసి, చట్టం కోసం కేంద్రానికి పంపించాం. అది చట్టమైతే ఇటువంటి ప్రేమోన్మాదులకు, అల్లరిమూకలకు మరింత వేగంగా శిక్షలు పడతాయి. రమ్య హత్య కేసులో.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్టు చేశారు. 

 పనిలేని ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు కుమారుడుగా తప్పితే.. ఏ అర్హతా లేని లోకేష్ ఈ మధ్య వెయిట్ తో పాటు విచక్షణ కూడా కోల్పోయి ముఖ్యమంత్రిగారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. రమ్యను కోల్పోయి వారి కుటుంబం బాధలో ఉంటే.. ఓదార్చాల్సిందిపోయి, గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళకుండా అడ్డుకోవడం, పోలీసులపై  టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం బాధాకరం. ముఖ్యమంత్రి జగన్ గారిని వ్యక్తిగతంగా దూషించినంత మాత్రాన జీరోగా ఉన్న లోకేష్ ఎప్పటికీ హీరో కాలేడు అన్నది గుర్తుంచుకోవాలి. 

  ప్రజల మన్ననలు, సంపూర్ణ విశ్వాసంతో ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత రెండేళ్ళలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అప్రతిహాతంగా విజయ దుంధుభి మోగించారు. నాయకుడు అంటే జగన్ గారిలా ఆదర్శంగా ఉండాలి తప్పితే.. చిల్లర రాజకీయాలు చేయకూడదు.  లోకేష్ గ్రామ స్థాయి నాయకుడి కంటే హీనంగా మాట్లాడుతున్నాడు. అమెరికాలో చదివిన లోకేష్.. ఇటువంటి భాషను మాట్లాడటం ఎంతవరకు సబబో తనకు తానే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ముఖ్యమంత్రిగారిని ప్రస్తావిస్తూ.. వ్యక్తిగతంగా దూషణలు చేయడం లోకేష్ మానుకోవాలి. లోకేష్ వచ్చిన తర్వాతే.. రాజకీయాల్లో ఇటువంటి బూతుల ట్రెండ్ ను కొత్త ట్రెండ్ గా తెచ్చాడు. 

 యుద్ధంలో జయించిన హీరో మాదిరిగా నిన్న రమ్య కుటుంబ సభ్యుల పరామర్శకు వెళ్ళిన లోకేష్.. నుదుటున పెద్ద బొట్టుపెట్టుకుని, కారు దగ్గర పిడికిలి బిగించి చూపిస్తూ సంకేతాలు ఇస్తూ, పోలీసులపై దౌర్జన్యం చేస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటి...?.  పెళ్ళికి, చావుకీ ఒకే మంత్రం అన్నట్టుగా లోకేష్ చేష్టలు ఉన్నాయి. 

  ప్రతిదాన్నీ టీడీపీ  రాజకీయం చేయాలని చూడటం తగదు. దళితుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకిగానీ, లోకేష్ కు గానీ లేదు. ఎవరైనా దళితులుగా పుడతారా.. అని మాట్లాడిన చంద్రబాబు దళితుల గురించి మాట్లాడటమా.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు. 

  దళితులు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి ఆత్మ లాంటి వారు. ఇకనైనా టీడీపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ను మానుకుంటే మంచిది. ప్రతిదానికీ కులాన్ని ముడిపెట్టి, కుల రాజకీయాలు చేయటం మానాలి. రమ్య హత్య ఘటనలో...  ప్రభుత్వంగానీ, పోలీసుల నిర్లక్ష్యంగానీ ఉంటే.. దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటన. రమ్య దారుణ హత్యను.. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన బాధ్యత సమాజంలో అందరిపైనా ఉంది. 

లోకేష్‌వి శ‌వ రాజ‌కీయాలు: వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు  

 సందట్లో సడేమియాలా దళితుల గురించి ఏమీ తెలియని వ్యక్తి, అధికారంలో ఉన్నన్ని నాళ్ళు దళితులపై దాడులు చేయించిన వ్యక్తి లోకేష్ పరామర్శకు వెళ్ళి..  రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేస్తున్నాడు. రెండేళ్ళుగా సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న పథకాలు, ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు యావత్తు దళిత వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకువెళుతున్నాయి. 

 దళితులను మభ్య పెట్టే విధంగా టీడీపీ నేతలు మాట్లాడినంత మాత్రాన.. దళితులు ఎవరూ నమ్మరు. వాస్తవాలను లోకేష్  తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. టీడీపీ హయాంలో దళితులపై జరిగినన్ని అరాచకాలు, అన్యాయాలు ఎప్పుడూ జరగలేదు. దళితులకు సాయం చేయాలనే ఉద్దేశమే మీకు ఉంటే.. మీరు బాధిత కుటుంబానికి సాయం చేయండి తప్పితే.. చావులను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు. దళితులపై కపట ప్రేమ చూపించినంత మాత్రాన.. ఈ వర్గాలు మీ వైపు రానే రావు. మీరు తలక్రిందులుగా తపస్సు చేసినా..  బడుగు, బలహీనవర్గాలు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు. ఎందుకంటే అధికారంలో ఉంటే... మీరు మాటలు చెప్పి మభ్య పెడతారు తప్పితే.. ఏనాడూ ఈ వర్గాల మేలు కోసం పనిచేసిన దాఖలాలు లేవు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top