ఆక్రమించిన ప్రభుత్వ భూమిని తిరిగి తీసుకుంటే తప్పా..?

గీతం యూనివర్సిటీ పేదలకు ఫ్రీగా చదువు చెబుతుందా..?

ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోవాలా..?

గీతంవర్సిటీ, భరత్, మూర్తిలపై చంద్రబాబు, లోకేష్‌లకు ఏమాత్రం ప్రేమలేదు 

రాజకీయం కోసం నేడు వల్లమాలిన ప్రేమ వలకబోస్తున్నారు

సీఎం వైయస్‌ జగన్‌కి ఎవరిపైనా వ్యక్తిగతమైన విద్వేషాలు లేవు

ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయడమే సీఎం విధానం

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం: నిబంధనలకు విరుద్ధంగా బడ్డీకొట్టు పెట్టుకుంటేనే తీసేస్తున్నామని, అలాంటిది గొప్పోడు రూ.800 కోట్ల భూమి కబ్జా చేస్తే ఊరుకోవాలా..? చూస్తూ కూర్చోవాలా..? అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలుగుదేశం పార్టీ నేతలను ప్రశ్నించారు. చంద్రబాబుకు, లోకేష్‌కు గీతం యూనివర్సిటీ, భరత్, మూర్తిలపై ఏమాత్రం ప్రేమ లేదని, వాస్తవంగా అయితే గత ఎన్నికల్లో భరత్‌ గెలవకూడదనే చంద్రబాబు, లోకేష్‌ కోరుకున్నారన్నారు. రాజకీయం కోసం ఇవాళ లేనిపోని ప్రేమను వలకబోస్తున్నారన్నారు. రూ.800 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు. 

గీతం యూనివర్సిటీ ఆక్రమణల తొలగింపుపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తిప్పికొట్టారు. విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..  

‘గతంలో చాలా సందర్భాల్లో ఆక్రమణలకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే అప్పుడు మీడియా, రాజకీయ నాయకులు పట్టించుకోలేదు. కానీ, గీతం యూనివర్సిటీ ఆక్రమణలను తొలగిస్తే చాలా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. విశాఖలో సునామీ వచ్చినట్లుగా క్రియేట్‌ చేస్తున్నారు. పేదవాళ్లకు అన్యాయం జరిగిపోయిందన్నట్లుగా చెబుతున్నారు. 

గీతం యూనివర్సిటీ  ఆక్రమణ తొలగింపుపై రాద్ధాంతం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నా.. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు గీతం యూనివర్సిటీపై చిత్తశుద్ధి ఉంటే.. 5 సంవత్సరాల క్రితమే 40 ఎకరాల ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎందుకు రెగ్యులరైజ్‌ చేయలేదు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పుడు మంత్రులుగా పనిచేసినవారు ఎందుకు పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌ హైదరాబాద్‌లో కూర్చొని కక్షసాధింపు, విధ్వంసం అని మాట్లాడుతున్నారు. మీ బంధువులే కదా.. 40 ఎకరాలు గత ఐదు సంవత్సరాలు రెగ్యులరైజ్‌ ఎందుకు చేయలేదు. గీతం యూనివర్సిటీపై, మూర్తిపై మంచి ఉద్దేశం లేదు. ఉంటే అప్పుడే రెగ్యులరైజ్‌ చేసేవాళ్లు. 

గీతం యూనివర్సిటీ పేదలకు ఏమైనా చదువు చెప్పుతుందా..? ఒక్క సీటుకు రూ.2 లక్షలు తీసుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీలో, విద్యార్థులకు సీట్ల కేటాయింపులో కానీ  గీతం యూనివర్సిటీ ఏమైనా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఫాలో అవుతుందా..? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీ ఎడ్యుకేషన్‌ ఇస్తుందా..? గీతం యూనివర్సిటీని కూల్చేశారని రాద్ధాంతం చేసే నాయకులకు సిగ్గుండాలి. 40 ఎకరాల భూమి విలువ రూ.800 కోట్లు. 

వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది.. ప్రభుత్వానికి మంచిపేరు రాకూడదని, ఈ ఘటనను కక్షసాధింపుగా చూపించి ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కి  ఎవరిపైనా ఎలాంటి వ్యక్తిగతమైన విద్వేషాలు లేవు. టీడీపీ చేసే ప్రచారం పూర్తిగా అవాస్తవం. సీఎం వైయస్‌ జగన్‌ విధానం ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయడం.. చంద్రబాబు విధానం ప్రైవేట్‌ సంస్థలను బలోపేతం చేయడం. సీఎం వైయస్‌ జగన్‌ విధానం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం.. కానీ, చంద్రబాబు విధానం మాత్రం ఒక్క అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయడం. ప్రభుత్వం ఏపని చేసినా దానికి కులం, మతం రంగులు అద్దుతూ చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు’ అని అవంతి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top