యుద్ధం చేయలేకే టీడీపీ నీచ రాజకీయాలు

ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర జరుగుతోంది

ఒక మనిషి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం నేరం కాదా..?

తప్పు చేసినవారెవరైనా శిక్ష అనుభవించక తప్పదు

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో నేరుగా యుద్ధం చేయలేక దొడ్డిదారిన టీడీపీ కుట్ర, నీచ రాజకీయాలకు ఒడిగడుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తూ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రహస్యభేటీపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరం నుంచి బయటకు రాని వ్యక్తి, కరోనా విపత్తు సమయంలో ఓట్లేసిన ప్రజల బాగోగులు చూడని గంటా శ్రీనివాసరావు.. తన అనుచరుడిని సాక్షాధారాలతో సహా అరెస్టు చేస్తే గగ్గోలు పెడుతున్నాడన్నారు. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం నేరం కాదా..? మనుషులంటే మీరేనా..? ఇంకా ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉందనుకుంటే ఎట్లా..? అని నిలదీశారు. తప్పు చేసిన వారిని ఎవరినీ వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. 

మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తానని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. గోబెల్స్‌ ప్రచారంతో నాయకుల మనోస్థైర్యాన్ని, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇళ్ల పట్టాల్లో అవినీతి జరిగితే నిరూపించండి రాజీనామా చేస్తానని చాలెంజ్‌ చేస్తే.. దానిపై టీడీపీ నుంచి స్పందన లేదన్నారు. సోషల్‌ మీడియాను వేదిక చేసుకొని నాయకుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పతనమైపోయిందని.. ప్రభుత్వంపై బురదజల్లి పైశాచిక ఆనందం పొందినా తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ శిక్షించబడతారని హెచ్చరించారు.  
 

Back to Top