రాష్ట్రాన్ని ఇంటర్నేషనల్‌ టూరిజం మ్యాప్‌లో ఉంచేలా చర్యలు

వారం రోజుల్లో బోట్స్‌ ఆప‌రేటింగ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్స్‌ ప్రారంభిస్తాం

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఇంటర్నేషనల్‌ టూరిజం మ్యాప్‌లో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. బోట్‌ ఆపరేటింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 9 కమాండ్‌ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్స్‌ ద్వారా బోట్స్‌ను ఆపరేట్‌ చేయనున్నామన్నారు. వారం రోజుల్లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వివరించారు. 

విజయవాడలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంవత్సరకాలంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా 13 జిల్లాల్లో 13 రకాల టూరిజం ఫెస్టివల్స్‌ దిగ్విజయంగా ఆర్గనైజ్‌ చేశామన్నారు. స్థానిక కళాకారులను ప్రోత్సహించామన్నారు. అదే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ‘సీఎం కప్‌’ పేరుతో 13 జిల్లాల్లో 13 రకాల స్పోర్ట్స్‌ కండక్ట్‌ చేశామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 6 స్టేడియాలకు శంకుస్థాపనలు చేశామని, మిగిలిన జిల్లాల్లో కూడా క్రీడా మైదానాలకు శంకుస్థాపనలు చేసి త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేస్తామన్నారు.  

టూరిజం డిపార్టుమెంట్‌ను ఆదాయ వనరు సృష్టించే శాఖగా తయారు చేయాలనే తపనతో ముందుకెళ్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ చెప్పారు. ప్రపంచంలో 30 శాతం దేశాలు పూర్తిగా టూరిజంపై ఆధారపడ్డాయని, మన దేశంలో కూడా కేరళ రాష్ట్రానికి జీడీపీలో 11 శాతం టూరిజంపైనే వస్తుందన్నారు. 

ఆంధ్రరాష్ట్రానికి అతిపెద్ద తీర ప్రాంతం, మంచి బీచ్‌లు ఉన్నాయని, కృష్ణా,గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి వంటి సుందర నదులు..  టూరిస్టు స్పాట్లు ఉన్నాయన్నారు. అంతేకాకుండా శ్రీశైలంలోని నల్లమల్ల అడవులు, మారెడిమిల్లి, రంపచోడవరం, అరకు, పాడేరు ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టెంపుల్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ చేయనున్నామన్నారు. వనరులన్నింటినీ ఉపయోగించుకొని ఏపీని ఇంటర్నేషనల్‌ టూరిజం మ్యాప్‌లో ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.  
 

Back to Top