తాడేపల్లి: దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని, ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సువర్ణ పాలన అందిస్తున్నారని చెప్పడానికి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా చేపట్టే మెగా పీపుల్స్ సర్వే మొదటి వారం ఫలితాలు సాక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మొదటి వారంలోనే అత్యంత అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, అన్ని వర్గాల నుంచి వైయస్ జగన్ ప్రభుత్వానికి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తోందన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు ప్రజల వద్దకు వెళ్లిన పార్టీయే లేదని, వైయస్ఆర్ సీపీ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పాలనను వివరిస్తోందన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. ‘రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ నిజమైన అభివృద్ధి చేశారని చెప్పేందుకు మెగా పీపుల్స్ సర్వే మొదటివారం ఫలితాలు సాక్ష్యం. నాలుగేళ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గణాంకాలతో ప్రజలకు వివరిస్తున్నాం. మొదటివారంలోనే ఇన్ని ఫలితాలు రావడం సంతోషంగా ఉంది. సంక్షేమ పథకాలు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, చివరకు మా పార్టీకి ఓటు వేయని వారిదగ్గరకు కూడా వెళ్లేందుకు సాహసం చేస్తున్నామంటే ఎంత పారదర్శకతతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామో గమనించాలి. రెండో వారం మెగా పీపుల్స్ సర్వే ప్రారంభిస్తున్నాం. ప్రధానంగా టీడీపీ కంచుకోటలు అని భావిస్తున్న నియోజకవర్గాలు, ప్రాంతాల్లో ఆ కోటలను బద్దలు కొట్టే విధంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం 7 లక్షల మంది గడప గడపకూ వెళ్లి ప్రజా మద్దతు కూడగట్టడంలో, వారి దగ్గర నుంచి స్పష్టమైన సమాధానాన్ని సేకరిస్తున్నారు. మీ కుటుంబంలో గతం కంటే ఇప్పుడు అభివృద్ధి జరిగిందా.. లేదా..? గతం కంటే ఇప్పుడు మీ సామాజిక వర్గానికి అభివృద్ధి జరిగిందా.. లేదా..? 30 పైచిలుకు నగదు బదిలీ పథకాలు, నాన్ డీబీటీ పథకాలు అందుతున్నాయా.. లేదా..? దీని వల్ల మీరు సంతోషంగా ఉన్నారా లేదా..? ఈ సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో అమలు జరగాలా.. వద్దా..? సీఎం వైయస్ జగన్ మీద విశ్వాసం ఉంచుతున్నారా.. లేదా..? అనే ప్రజా సర్వే కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. మెగా పీపుల్స్ సర్వే సర్వే పారదర్శకంగా చేపడుతున్నాం. కరోనా లాంటి మహమ్మారి వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ సర్వజనాభివృద్ధి కోసం, ప్రజల బాగు కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ఏ విధంగా ముందుకెళ్లిందో చెప్పేందుకు రాష్ట్ర తలసరి ఆదాయం నిదర్శనం. 2022–23 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.2,19,518. గత సంవత్సరం 2021–22తో పోల్చితే రూ.23,476 పెరిగింది. 2021–22లో రూ. 1.92 లక్షలు ఉన్న తలసరి ఆదాయం 2022–23లో రూ.2.19 లక్షలు అయ్యింది. దేశ తలసరి ఆదాయం 1.72 లక్షలతో పోల్చితే ఆంధ్రరాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ. సుమారు రూ.47.518 ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం అధికంగా ఉంది. జీఎస్డీపీ గ్రోత్‌లో దేశంలోనే నంబర్‌వన్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. గ్రోత్ రేట్ సుమారు 11.43 శాతం సాధించాం. దీనికి కారణం వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సువర్ణ పాలన. ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిపాలన సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో మెగా పీపుల్స్ సర్వే ద్వారా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి పరిపాలన సాగిన విధానాన్ని వివరించనున్నాం.