పవన్‌కు నిజాలు, లెక్కలు తెలియకపోతే నేను చెప్తా..

మూడున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీల కోసం రూ.49 వేల కోట్లు ఖర్చు చేశాం

చంద్రబాబు డైరెక్షన్‌లోనే సబ్‌ప్లాన్‌పై పవన్‌ మీటింగ్‌

మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

విజయవాడ: రాష్ట్ర ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని అక్కసు, సంక్షేమ పాలనలను చూసి ఓర్వలేనితనంతో ఈనాడు రామోజీరావు తప్పుడు రాతలు రాస్తున్నాడని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మూడున్నరేళ్లుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని చెప్పారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాతే ఎస్సీ, ఎస్టీలకు అధిక లబ్ధి చేకూరిందన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో కంటే 45 శాతం అధికంగా ఎస్సీలకు ఖర్చు చేశామని చెప్పారు. సమాజంలోని అసమానతలు తొలగించేలా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీల కోసం రూ.49 వేల కోట్లను వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. దళిత, గిరిజన పిల్లలకు కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందిస్తున్నామన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే సబ్‌ప్లాన్‌పై పవన్‌ మీటింగ్‌ పెడుతున్నాడన్నారు. పవన్‌కు నిజాలు, లెక్కలు తెలియకపోతే తాను చెప్తానని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కాల పరిమితిని పదేళ్లు పొడిగించడం అభినందనీమ‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు. దళిత, గిరిజనుల అభ్యున్నతిపై సీఎం వైయ‌స్‌ జగన్‌ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమ‌ని చెప్పారు.  అన్ని రంగాల్లో దళితులు రాణించాలన్నదే వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వ లక్ష్యమ‌న్నారు. కొన్ని పత్రికలు టీడీపీకి కొమ్ము కాస్తూ వార్తలు రాస్తున్నాయని,  టీడీపీ అధికారంలోకి వస్తే లబ్ధి పొందాలన్నది వాళ్ల దురాశ. ఈనాడు రాతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. కడుపునిండా కుళ్లు, కుతంత్రాలున్నాయి కాబట్టే రామోజీరావు రాక్షసానందం పొందుతున్నాడని మంత్రి సురేష్ దుయ్యబట్టారు.

ఎస్సీల సంక్షేమం.. నాడు–నేడు
రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమం కోసం ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? ఈ మూడున్నర ఏళ్లలో మా ప్రభుత్వం ఎంత వ్యయం చేసిదంనేది ఒకసారి చూస్తే.. 2014–19 వరకు 5 ఏళ్లలో ఎస్సీలకు టీడీపీ ఖర్చు చేసింది కేవలం రూ.33,635 కోట్లు. అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–23 మధ్య ఈ మూడున్నర ఏళ్లలో ఎస్సీల సంక్షేమం కోసం చేసిన వ్యయం రూ.48,898 కోట్లు. అంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన ఖర్చు కంటే, మూడున్నర ఏళ్లలోనే మా ప్రభుత్వం రూ.15,274 కోట్లు అదనంగా వ్యయం చేసింది. గత ప్రభుత్వ హయాంలో కంటే 45.4 శాతం ఎక్కువ ఖర్చు చేశాం.

ఎస్టీల సంక్షేమం.. నాడు–నేడు
రాష్ట్రంలో ఎస్టీల సంక్షేమం కోసం ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? ఈ మూడున్నర ఏళ్లలో మా ప్రభుత్వం ఎంత వ్యయం చేసిందనేది ఒకసారి చూస్తే.. టీడీపీ ప్రభుత్వం 2014–19 మధ్య 5 ఏళ్లలో గిరిజనులకు చేసిన ఖర్చు రూ.12,487 కోట్లు. మా ప్రభుత్వ హయాంలో 2019–23 మధ్య ఈ మూడున్నర ఏళ్లలో గిరిజనుల సంక్షేమం కోసం చేసిన వ్యయం రూ.15,589 కోట్లు. అంటే గత ప్రభుత్వ 5 ఏళ్లలో చేసిన వ్యయం కంటే, ఈ మూడేళ్లలోనే మా ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం రూ.3101 కోట్లు ఎక్కువ ఖర్చు చేసింది. ఇది 25 శాతం అదనం.

ఇవీ వాస్తవాలు. సవాల్‌కు రెడీ..
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆ స్థాయిలో వ్యయం చేశామన్నది వాస్తవం. దీనిపై ఎలాంటి ఆడిట్‌కైనా మేము సిద్ధం. మీరు రెడీనా?. కానీ, ఈ గణాంకాలేవీ పరిశీలించకుండా మేము ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.20 వేల కోట్లు కోత పెట్టామంటూ.. ఈనాడులో అవాస్తవం రాశారు. రామోజీ మీరు ఇంతగా దిగజారి ఎందుకు రాస్తున్నారో తెలియడం లేదు. నిజానికి ఎస్సీ ఎస్టీ ప్లాన్, నాన్‌ సబ్‌ప్లాన్‌ బదులుగా ఎస్సీఎస్టీ స్పెషల్‌ కాంపొనెంట్‌గా మార్చింది కేంద్ర ప్రభుత్వమే. అయిదేళ్ల కాలంలో ఒక రంగాన్ని తీసుకుని, ఎంత ఖర్చు చేయాలో కూడా కేంద్రమే దిశా  నిర్దేశం చేసింది. 

పథకాల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట..
పథకాల అమలులో జనాభా దామాషాకు మించి ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు చేస్తున్నాం. ఉదాహరణకు గత మూడున్నర ఏళ్లలో మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కొన్నింటిలో వారు ఏ మేర ప్రయోజనం పొందారనేది చూస్తే.. అమ్మ ఒడి పథకంలో ఎస్సీల జనాభా దామాషా చూస్తే 16.4 శాతం అని ఈనాడే రాసింది. ఆ పథకంలో ఎస్సీలకు రూ.4007 కోట్లు వెచ్చించారు. అంటే ఎస్సీలకు వెచ్చించింది 20.3 శాతం కింద లెక్క. వాహనమిత్ర పథకాన్ని తీసుకుంటే ఎస్సీలకు ఖర్చు చేసింది రూ.244.91 కోట్లు. అంటే జనాభా దామాషాను మించి ఖర్చు చేసింది 23 శాతం. వసతిదీవెనలో 19.88 శాతం, విద్యాదీవెనలో 19.05 శాతం, విద్యాకానుకలో 19.84 శాతం వారి కోసం ఖర్చు చేశాం. అలా ఏ పథకంలో చూసినా 20 నుంచి 25 శాతం వరకు ఎస్సీ ఎస్టీలకు ఖర్చు చేస్తున్నాం. 

రామోజీ ఒకసారి చూడండి..
రామోజీ ఒక్కసారి ఇప్పుడు మీ సొంత ఊళ్లో కూడా అమలు అవుతున్న పథకాలు చూడండి. అలాగే గత ప్రభుత్వ హయాంలో 2014–19లో మీ ఊళ్లో ఎందరికి ఎన్ని పథకాలు అందాయో చూడండి. మేము గణాంకాలతో సహా వివరిస్తాం. అన్నీ పోల్చి చూపిస్తాం. అప్పుడు మీకే అర్ధం అవుతుంది.. మాకూ, టీడీపీకి హస్తిమశకాంతర మంత తేడా ఉంటుంది. రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 5.3 శాతం ఉంటే, మా ప్రభుత్వం పథకాల్లో 7 శాతం తగ్గకుండా వారికి అందజేస్తోంది. మరోవైపు ఎస్సీ ఎస్టీలకు ఇంకా భరోసా కల్పించే విధంగా సబ్‌ప్లాన్‌ను మరో 10 ఏళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటే ఈనాడు వక్రభాష్యాలు చేస్తోంది. 

ఆ నిధుల మళ్లింపు నీకు తెలియదా రామోజీ?:
టీడీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ నిధులను ఎలా పక్కదారి పట్టించారో జనం చూశారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి పెన్షన్లకు ఖర్చు చేస్తున్నామని మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరి 2014–19 కాలంలో టీడీపీ ప్రభుత్వం ఎన్ని పథకాలకు నిధులను ఆ ప్లాన్‌ నుంచి తీసుకుందో ఈనాడుకు, రామోజీకి తెలియదా?. పిల్లలకు, తల్లులకు ఇచ్చే పౌష్టికాహారం, చంద్రన్న రైతు క్షేత్రాలు,  పొలంబడి, జవహర్‌ నాలెడ్జి సెంటర్‌కు ఇచ్చే గౌరవ వేతనాలు, ఇంటి మహాలక్ష్మి, అన్న అమృతహస్తం, ఎన్టీఆర్‌ సుజల స్రవంతి, చంద్రన్న పెళ్లి కానుక, శానిటరీ న్యాప్‌కిన్స్‌.. వీటన్నిటికీ సబ్‌ప్లాన్‌ నిధుల నుంచే రూ.33 వేల కోట్లు ఖర్చు చేశారు. వారు చేసింది ఒప్పా. మేం చేసింది తప్పా? వారికొక న్యాయం. మాకొక న్యాయమా? ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి మా ప్రభుత్వం 45 శాతం అదనంగా ఖర్చు చేసిన సంగతి ఈనాడు గుర్తించలేదా? 

మరి చంద్రబాబు ఏం చేశారు?
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించి సీఎం వైయస్‌ జగన్, చంద్రబాబు ఆలోచనల మధ్య చాలా తేడా ఉంది. ఈ విషయంలో సీఎంగారు ప్రతి పని చిత్తశుద్ధితో చేస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున వేల కోట్ల విలువైన స్థలంలో వందల కోట్లు వెచ్చించి 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. అలాగే కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టారు. అలాగే అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాలు ఏర్పాటు చేశారు. మరి చంద్రబాబు ఏం చేశారు? దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, దళితులుగా పుట్టడం ఒక పాపం అన్నట్లు వ్యవహరించారు. ఇంతకన్నా ఆత్మ వంచన ఇంకా ఏమైనా ఉంటుందా?

సంక్షేమంలో రాష్ట్రం ముందంజ..
సంక్షేమంలో రాష్ట్రం ముందంజలో ఉంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖే దీన్ని ప్రకటించింది. ఆ శాఖ ఈనెల 11న విడుదల చేసిన పట్టికను చూస్తే.. దేశంలోని 22 రాష్ట్రాల్లోనూ కలిపి ఉన్న కుటుంబాలకు అందిన లబ్ధికి సమానంగా మన రాష్ట్రంలో అందింది. అది మన ప్రభుత్వ ఘనత అని కేంద్రమే కొనియాడినా, ఈనాడుకు మాత్రం కనిపించదు. ఆనాడు టీడీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన అనేక పథకాలను సంస్కరిస్తున్నాం. నాడు–నేడు కార్యక్రమంలో 44వేల ప్రభుత్వ పాఠశాలలను దాదాపు రూ.16 వేల కోట్లతో అన్ని వసతులు కల్పిస్తూ, పూర్తిగా మార్చివేస్తున్నాం. విదేశీ విద్య పథకం రూపురేఖలు మార్చి పక్కాగా అమలు చేస్తున్నాం. విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తున్నాం. వసతి దీవెన కింద వారికి బోర్డింగ్‌ ఖర్చులు కూడా ఇస్తున్నాం.

పవన్‌ దివాళాకోరుతనం..
ఈనాడు రాస్తున్న పిచ్చిరాతలను పట్టుకుని పవన్‌  రెండో ఎక్కం అప్పగించినట్లు మాట్లాడతాడు. పొంతన లేని గణాంకాలను రామోజీ వండి వారిస్తే.. వాటినే పవన్‌ మాట్లాడతాడు. ఇంతకన్నా దివాళాకోరుతనం మరొకటి ఉండదు. వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రగతికి కట్టుబడి ఉంది. ఈ చట్టం ఆధారంగా ఇంకా పటిష్టంగా ఏ విభాగంలో దామాషా ప్రకారానికి మించి ఖర్చు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే ఇకనైనా ఇలాంటి వక్రీకరణ కథనాలు రాయవద్దని ఈనాడుకు చెబుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

Back to Top