'అనంత' ఘటనపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం

విద్యార్థుల ముసుగులో దుండగులు చొరబడి రాళ్లురువ్వారు

పోలీసులు లాఠీచార్జ్‌ చేయలేదని బాధిత విద్యార్థినే తెలిపింది

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వద్దంటూ ఎస్‌ఎస్‌బీఎన్‌ విద్యా సంస్థ లేఖ ఇచ్చింది

ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతిపక్షం, పచ్చ మీడియా కుట్రలు

ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై చంద్రబాబు ఏనాడైనా శ్రద్ధపెట్టారా..?

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజం

విజయవాడ: అనంతపురంలో ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ ఘటనపై ఎల్లోమీడియా, ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. విద్యార్థులతో బలవంతంగా చేయించిన ధర్నాలు కొందరు దుండగులు చొరబడి రాళ్లు రువ్వి విద్యార్థులను గాయపరిచారని, పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని చెప్పారు. విద్యార్థి సంఘాల ముసుగులో కొందరు చేసిన దాడిలో విజయలక్ష్మి అనే విద్యార్థి గాయపడిందన్నారు. పోలీసులు మర్యాదగా ప్రవర్తించారని, లాఠీచార్జ్‌ చేయలేదని బాధిత విద్యార్థిని చెప్పిందన్నారు. రాయి వచ్చి తగిలింది కాబట్టే గాయమైందని ఆ విద్యార్థి స్పష్టంగా చెప్పిందన్నారు. 

విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ ఘటనకు సంబంధించిన రిపోర్టును రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌జేడీ) నుంచి తీసుకోవడం జరిగిందన్నారు. ఎస్‌ఎస్‌బీఎన్‌ అటానమస్‌ కాలేజ్‌ అని, ఆ కాలేజీ యాజమాన్యం మాకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వద్దు.. టీచర్ల జీతాల నిమిత్తం ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం విత్‌డ్రా చేసుకుంటున్నాం అని, హైస్కూల్‌లో 13 టీచింగ్, 3 నాన్‌ టీచింగ్‌ స్టాఫ్, జూనియర్‌ కాలేజీలో 6 టీచింగ్‌ స్టాఫ్, డిగ్రీ కాలేజీలో 13 టీచింగ్‌ స్టాఫ్, 17 మంది నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను సరెండర్‌ చేస్తూ లేఖను సంబంధిత అధికారులకు అందించారన్నారు. 

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌తో నడుస్తున్న కాలేజీలు, హైస్కూళ్ల పనితీరు మీద శాస్తీ్రయంగా అధ్యయనం చేసి వాటిని ఏ విధంగా బాగు చేయాలి.. ఉన్నత ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపర్చాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక కమిటీ వేశారన్నారు. కమిటీ రిపోర్టు ఆధారంగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కంటిన్యూ చేయాలా.. వద్దా..? యాజమాన్యాలు స్వచ్ఛందంగా సంస్థలను ప్రభుత్వానికి అప్పగిస్తారా..? ఆస్తులతో పాటు అప్పగిస్తారా..? సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించి.. అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ కింద నడుపుతారా..? లేక గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌తో ప్రభుత్వ సూచనల మేరకు బాగా నడుపుతారా అని మూడు ఆప్షన్లు చాలా స్పష్టంగా వారికి ఇవ్వడం జరిగిందని సీఎం పదే పదే చెప్పారని గుర్తుచేశారు.  

కొన్ని రాజకీయ పార్టీలు ఎయిడెడ్‌ విద్యా సంస్థలను రాజకీయాల్లోకి లాగాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ వారికి వత్తాసు పలికే మీడియా ద్వారా అసత్యప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.  బలవంతంగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను ఉపసంహరించుకుంటున్నారని గౌరవ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవపట్టిస్తున్నాయని మంత్రి ధ్వజమెత్తారు. 

ఎవరినీ బలవంతపెట్టే పరిస్థితి లేదు. ఇప్పటికైనా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పదే పదే చెబుతున్నా.. ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థి సంఘాలు, పేరెంట్స్‌ కమిటీ అనే ముసుగులో రాజకీయ నేతలు దూరి ప్లకార్డులు తయారు చేసుకొని ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ దగ్గరకు వచ్చి విద్యార్థులను తరగతులకు వెళ్లనివ్వకుండా గందరగోళ పరిస్థితులను సృష్టించారన్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని, రాష్ట్రంలో అలజడి సృష్టించాలని, ప్రభుత్వం మీద బురదజల్లాలనే దురుద్దేశం, కుట్రతో నిన్న వారు చేసిన ధర్నా పేరుతో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ ఘటనను ప్రభుత్వం దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. దాడిని ఖండిస్తుందన్నారు.  

దాడిలో గాయపడిన విద్యార్థి విజయలక్ష్మి  తానే స్వయంగా వీడియో రికార్డు చేసి పంపించారని, పోలీసులు మర్యాదగా ప్రవర్తించారని, లాఠీచార్జ్‌ చేయలేదని బాధిత విద్యార్థి తెలిపారన్నారు. తగుదునమ్మా అంటూ లోకేశ్‌ వీడియో కాల్స్‌ చేస్తూ పోరాటం చేస్తామని రాజకీయం చేస్తున్నాడని, సరస్వతి పుత్రులు అంటూ చంద్రబాబు సినిమా డైలాగులు చెప్తున్నాడని ధ్వజమెత్తారు. 

అధికారంలో ఉన్న 14 సంవత్సరాల్లో ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై శ్రద్ధపెట్టారా..? అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చంద్రబాబును ప్రశ్నించారు. 1999లో అధికారంలో ఉన్నది ఎవరు..? 2014–19 వరకు ఎవరు అధికారంలో ఉన్నారు..? ఎయిడెడ్‌లో పోస్టులు భర్తీ చేయడానికి వీల్లేదని జీఓలు విడుదల చేయలేదా..? కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ నోట్‌ ఫైల్‌ పెడితే రిజక్ట్‌ చేయలేదా..? ఎయిడెడ్‌ కాలేజీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసా..? అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చంద్రబాబును ప్రశ్నించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top