జీవో నంబరు 217 వల్ల లాభమే కానీ, నష్టం లేదు

రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి  సీదిరి అప్పలరాజు

 మత్స్యకారులకు ఎటువంటి సబంధం లేదన్న విషయం కూడా తెలియని అజ్ఞాని పవన్ కల్యాణ్ ఆ జీవోను చింపేశానంటాడు.

  217 జీవో వల్ల మత్స్యకారులకు మరింత లాభం, ఎందుకంటే, ఇంతకుముందు ఇన్ ల్యాండ్ వాటర్ బాడీస్ లో మత్స్యకారుల పేరు చెప్పి అధికార పార్టీ దోపిడీ చేసేది. వారికి ఏ రూపాయీ దక్కేది కాదు. 

 ఇప్పుడు అలా కాదు. ఈ జీవో ద్వారా ప్రయోజనాలు మత్స్యకారులకే నేరుగా దక్కుతాయి. 

 పవన్ కల్యాణ్ సభకు వచ్చిన వారు సినిమా అభిమానులే తప్ప, వారంతా మత్స్యకారులు కాదు
  
  కాబట్టి, ఇది ఓ సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్ ఫంక్షన్.

 మత్స్యకారులకు, దీనికి ఏ సంబంధమూ లేదు. 

   విడుదల కాబోయే తన సినిమాకు ప్రమోష్ ఫంక్షన్ లా పవన్ సభ నిర్వహణ

 మత్స్యకారుల నోటి కాడ తిండిని పెట్టుబడిదారులు, మధ్య దళారులు కొట్టేస్తున్నందుకే జీవో 217

అమరావ‌తి: జీవో నంబరు 217 వల్ల లాభమే కానీ, నష్టం లేదని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి  సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. తన సినిమాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సినిమాలు ప్రమోషన్ చేసుకోవడం పవన్ కల్యాణ్ కు కొత్తేమీ కాదు.  పవన్‌ కల్యాణ్‌ గతంలో ఒకసారి గుడివాడ వచ్చిన సందర్భంగా కూడా ఇదే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు వకీల్‌ సాబ్‌ సినిమాను ఆయన ప్రమోట్‌ చేసుకున్నారు. తాజాగా పవన్‌ మరోసినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా పేరు భీమ్లా నాయక్‌. ఆ సినిమా  ప్రీ రిలీజింగ్‌ త్వరలో హైదరాబాద్‌లో జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ సినిమా ప్రీ రిలీజింగ్‌ పెట్టాలనుకుని... ఇవాళ మత్స్యకారుల మీద ప్రేమ ఒలకపోసి, మత్స్యకారులను ఉద్దరిస్తానంటూ..  తన సినిమా కార్యక్రమాన్ని ప్రమోషన్ చేసుకునేలా సభను నిర్వహించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించారు. 

- చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సినిమా ప్రమోషన్‌ కోసం రాజకీయాలను వాడుకోవడం ఇవాళ చూస్తున్నాం. రాష్ట్రంలో సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన ఈవెంట్‌ అయిపోయింది. మళ్లీ ఇంకో సినిమా వస్తే, మరో కొత్త సమస్యను సృష్టించడమో, లేకుంటే చంద్రబాబు దానికి ఆజ్యం పోయడమో చేస్తే.. పవన్‌ కల్యాణ్‌ మళ్లీ రాష్ట్రానికి వస్తారు. ఇది పవన్ కల్యాణ్ రొటీన్ కార్యక్రమంగా మారింది. 

అక్కడ మత్స్యకారులు ఉన్నారా..?
- పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగంలో మత్స్యకారుల గురించి మాట్లాడారు. ఆ సమావేశంలో ఎవరైనా మత్స్యకారులు ఉన్నారా? మీరు మాట్లాడే మాటలు వాళ్లు వింటున్నారా? చేపల అమ్మకం గురించి, జీవో నెంబర్‌ 217 గురించి, జెట్టీల గురించి మాట్లాడారు. గంగమ్మ పూజలు గురించి కూడా మాట్లాడారు? అసలు మా మత్స్యకారుల బతుకుల గురించి నీకు ఏం తెలుసు?  గంగమ్మ పూజ గురించి నీకు అవగాహన వచ్చిందనే భ్రమలో ఉన్నావు. మా జీవితాల్లో మార్పు రావాలని, వెలుగులు నింపాలని, మా మత్స్యకారులు వలసల మీద ఆధారపడకూడదని, ఒక దీర్ఘకాల ప్రణాళికతో  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు పని చేస్తున్నారు. 

- ఎంతమంది మత్స్యకార మహిళలు చేపలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారో... బుట్టల్లో చేపలు మోసుకుని వెళ్లి, గ్రామగ్రామానికి వెళుతూ ఊరి చివర అపరిశుభ్రమైన వాతావరణంలో చేపలు అమ్ముతున్నారో పవన్ కు తెలుసా..? తోటి మత్స్యకారుల జీవనంపై ఆ దృశ్యాలు గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధపడుతున్నాం. మా బతుకుల్లో ఇంకా మార్పులు రావా అని? ఎవరో ఒకరు రాకపోతారా అని ఎదురు చూసిన బతుకులు మావి. ఇవాళ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు వచ్చారు, మా మత్స్యకారుల కష్టాలు తీర్చుతుంటే, ఓర్చుకోలేక మా బతుకులు మారకూడదన్నట్టు మీరు కుట్రలు చేస్తారా..?

ఆ అవుట్ లెట్లు పవన్ లాంటివాళ్ళు చేపలు అమ్ముకోవడం కోసం కాదు..
- ప్రభుత్వం ఇచ్చే రిటైల్‌ అవుట్‌ లెట్‌లు  పవన్ లాంటివాళ్లు చేపలు అమ్ముకోవడానికి కాదు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ ముందుగా అవగాహనకు వస్తే బాగుటుంది. ఎవరైతే ఈ రంగంలో ఇప్పటికే స్థిరపడి ఉన్నారో, ఔత్సాహికులుగా ముందుకు వస్తున్నారో వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి చక్కనైన పరిశుభ్రమైన వాతావరణంలో, బ్రహ్మాండమైన బ్రాండెడ్‌ అవుట్‌లుక్‌ ఇచ్చి వాల్యూ ఎడిసన్‌ చేసి, చేపలు పాడవకుండా స్టోరేజీ ఫెసిలిటీ ఏర్పాటు చేసి, మత్స్యకార మహిళలు, యువకుల్ని ఎంటర్‌ పెన్యూర్‌గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మీకు తప్పుగా అనిపిస్తుందా?

- మత్స్యకారులు ఎప్పటికీ బుట్టల్లో చేపలు మోసుకునే వెళ్లాలా? ఇప్పటికీ ఊరి చివర అంటరానివాళ్లలాగా ఈగలు తోలుకుంటూ చేపలు అమ్ముకోవాలా? మా బతుకులు మారకూడదా? మేము అలా ఉంటేనే మీకు నచ్చుతుందా? రిటైల్‌ అవుట్‌ లెట్‌లో చేపలు అమ్మితే మీకు ఇబ్బందా? ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ చేపల అమ్మకంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. మత్స్యకారులే మీ బట్టలు ఊడదీస్తారని చెబుతున్నాం. 2014-19 మధ్య మత్స్యకారులకు ఏం ఇచ్చారు, మత్స్యకార భరోసా ఉందా..?. నాడు బాబును ఎందుకు సమర్థించారు..?

- మత్స్యకార మహిళల జీవితంలో గొప్ప మార్పు తీసుకువచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వానిది. దయచేసి దీనిపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని మనవి. మీరు పాదయాత్ర చేశామని చెబుతున్నారు కదా.. మీ దగ్గర మంచి సలహా ఉంటే ఇవ్వండి. సబ్సిడీలు ఇచ్చి, మార్కెటింగ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చి వారిని ఎంటర్‌ పెన్యూర్లుగా తయారు చేస్తుంటే మీరు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయి. పవన్‌ వ్యాఖ్యలు మత్స్యకారులను చిన్నచూపు చూస్తున్నట్లు ఉన్నాయి. మీ వ్యాఖ్యలను  దయచేసి వెనక్కి తీసుకోవాలి.

ప్రభుత్వం చేపలు అమ్మదు.. మత్స్యకారులను ఎంటర్ పెన్యూర్లుగా చేస్తున్నాం..
- ఫిష్‌ రిటైల్‌ అవుట్‌లెట్‌లకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించి, ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇప్పించి ఎంటర్‌ పెన్యూర్‌గా తయారు చేస్తుందే తప్ప, ప్రభుత్వం ఎక్కడా కూడా చేపలు అమ్మదని స్పష్టం చేస్తున్నాం. ఫిష్‌ రిటైల్‌ అవుట్‌లెట్‌లను ప్రతి సచివాలయం పరిధిలోకి తీసుకురావాలని, తద్వారా మన రాష్ట్రంలో పట్టిన చేపలు, పండించిన ఆక్వా ఉత్పత్తులను స్థానికంగానే అమ్మే సౌకర్యాన్ని తయారు చేస్తుందని ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగారి సందేశాన్ని ఈ సందర్భంగా తెలియచేయాలనుకుంటున్నాను.

బాబు చెప్పాలనుకున్నవి మీతో చెప్పించారా..
- మత్స్యకారులు నొచ్చుకుంటే, వారి మనసులు చివుక్కుమంటే ఎలా ఉంటుందో.. చంద్రబాబును అడిగితే తెలుస్తుంది. దీనిపై ఆయన మాట్లాడేందుకు ముఖం చెల్లదు. చంద్రబాబుకు మత్స్యకారులంటే చులకన. చాలా చిన్నచూపు. మా సమస్య మీద వెళితే తొక్క, తోలు తీస్తామని, ఫినిష్‌ చేస్తామంటూ మత్స్యకారులను అవమానించిన పెద్దమనిషి ఆయన. ఇవాళ చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరుకాబట్టే ఆయన బయటకు రారు. చంద్రబాబు చెప్పాలనుకుంటున్నవి పవన్‌తో చెప్పిస్తారు. 

- పవన్‌ కల్యాణ్‌కు సినిమా మీద ఉన్నంత ఆసక్తి రాజకీయాల మీద లేదు. పార్టీ పెట్టాం కాబట్టి లాగించాలి. దానికి మద్దతు కావాలి కాబట్టే చంద్రబాబు ఏమి మాట్లాడితే పవన్‌ అది మాట్లాడతాడు. చంద్రబాబు స్క్రిప్ట్‌ను పవన్‌ బయటకు వచ్చి చదువుతాడు. జీవో నెం.217 గురించి పవన్‌కు ఏం తెలుసు అని అడుగుతున్నాం. నెల్లూరులో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా చేస్తున్నామని మేము అనేక సందర్భాల్లో చెప్పాం, మత్స్యకార సోదరులకు వివరించాం. వారికి ఉన్న సందేహాలను కూడా తీర్చడం జరిగింది. మత్స్యకారులు అర్థం చేసుకున్నారు. రాష్ట్రంలో సుమారుగా 27వేలుపైబడి ట్యాంక్‌లు ఉన్నాయి. 23,900 గ్రామ పంచాయతీ, 3,300 ఎంఐ ట్యాంకులు, 118 రిజర్వాయర్లు ఉన్నాయి. సుమారు 20వేల పైబడిఉన్న ఈ ట్యాంకుల్లో కేవలం 1436 ఎంఐ ట్యాంకులు, 90 రిజర్వాయర్లు మాత్రమే సంవత్సరానికి ఇంతంటూ ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో లీజ్‌కు ఇచ్చాం. మిగిలిన అన్ని ట్యాంకులను కూడా ఆక్షన్‌ బేసిస్ లో రన్‌ అవుతున్నాయి. ఇవి ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియ అయితే పవన్‌ మేమోదో కొత్తగా వేలం వేస్తున్నామని చెబుతున్నారు. ఆయనకు తెలియదు కాబట్టే చెబుతున్నాం.

దోపిడీని అరికట్టేందుకే..
- పెద్ద రిజర్వాయర్ల వద్ద లీజుకు తీసుకున్న సొసైటీల నుంచి కొంతమంది మధ్యవర్తులు, పెట్టుబడిదారులు సబ్‌ లీజ్‌ తీసుకుని అక్రమంగా, విపరీతమైన లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక సొసైటీలో ఉన్న మత్స్యకార సోదరులకు ఏడాదికి వెయ్యి నుంచి అయిదువేలు కూడా ఆదాయం రావడం లేదు. దీన్ని ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. ఈ దోపిడీని ఎవరూ నిరోధించలేకపోతున్నారు. దీనిపై ఒక ఆలోచన చేసి... మత్స్యకారులకు ఏడాదికి మినిమం ఇన్‌కమ్‌ రావాలనే ఉద్దేశంతో 217 జీవోను ఇవ్వడం జరిగింది. 

- దీనిమీద పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు నిద్ర లేచి మాట్లాడం సరికాదు. చంద్రబాబుకు ఎలాగూ మాట్లాడేందుకు మొహం చెల్లడం లేదు కాబట్టి, పవన్‌ను మాట్లాడాలని చెప్పగానే పరుగెత్తుకుంటూ వచ్చి ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా మీ పర్పస్‌ సర్వైవ్‌ అయ్యేలా సినిమా ప్రమోషన్‌ చేసుకునేలా ముహూర్తం చూసుకున్నారు.

- ఏపీలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లేకుండా సినిమాకు కావాల్సిన బ్రహ్మాండమైన పబ్లిసిటీ చేసుకోవడానికి మత్స్యకారులను రెచ్చగొట్టేవిధంగా, వారిని ఏదో ఉద్ధరించేలా మాట్లాడటం ఆశ్చర్యం, విడ్డూరంగా ఉంది. ఇప్పటివరకూ మా మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని, వలస వెళ్లిపోతున్నారని, ఇంతవరకూ, ఈ రాష్ట్రంలో జెట్టీలు కానీ, హార్బర్లు కానీ లేవని మీకు తెలియదా? ఇవాళే మీకు తెలిసిందా? ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? చంద్రబాబును గతంలో ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఇప్పటికీ ఆయనకు ఊడిగం ఎందుకు చేస్తూనే ఉన్నారని అడుగుతున్నాం. 

- 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో సుదీర్ఘమైన తీరప్రాంతంలో రెండే రెండు హార్బర్లు ఉంటే.. ఏరోజు మాట్లాడిని పవన్‌ కల్యాణ్‌ హార్బర్లు లేవు, జెట్టీలు లేవంటూ మొసలి కన్నీరు కారిస్తే మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఏమని అర్థం చేసుకోవాలి. మా సమస్యలు ఏంటనేవి  మా నాయకుడికి, ముఖ్యమంత్రిగారికి తెలుసు. ఆయన సుదీర్ఘ పాదయాత్రలో మా గుండె చప్పుడు ఆయన విన్నారు. ఏమి చేస్తే మాకు మంచి జరుగుతుందో, మా బతుకులు బాగుపడతాయో మా నాయకుడికి తెలుసు కాబట్టే... ఇవాళ ప్రతి జిల్లాలో కూడా హార్బర్‌ పెడుతున్నారు. హార్బర్ పనులు కూడా మొదలయ్యాయి. 

- తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్నమీరు ఉప్పాడ వెళ్లి చూస్తే హార్బర్‌ పనులు ఎలా జరుగుతున్నాయో తెలుస్తుంది. మీకు చేతనైతే వెళ్లి చూడండి. చూసినప్పుడే జగన్‌ మోహన్‌ రెడ్డిగారి లాంగ్‌ టర్మ్‌ విజన్‌ అనేది తెలుస్తుంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలోనూ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నంలోనూ బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. మరో నాలుగు హార్బర్లను త్వరలో ముఖ్యమంత్రిగారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ శంకుస్థాపన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాం. వచ్చేందుకు మీకు దమ్ముందా అని అడుగుతున్నాం. 2024లోపు హార్బర్లను ప్రారంభించి మీకు కూడా ఆహ్వానిస్తాం. ఆరోజు మాకు క్షమాపణ చెప్పగలరా?

పేమెంట్ రాజకీయాలు...
- నాయకుడికి ఉండాల్సింది లక్ష్యం. ఏం చేస్తే మత్స్యకారుల బతుకులు బాగుపడతాయనే సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఉన్న నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. మీలో ఏరోజూ అలాంటి లక్ష్యసాధన చూడలేదు. కేవలం ఆడుతూ పాడుతూ రాజకీయాలు చేస్తున్నారు. పేమెంట్స్ కు పేటెంట్‌ రాజకీయాలు మీవి. అమ్ముడపోయి, ఊడిగం చేసే రాజకీయాలు మీవి. మత్స్యకారులకు భరోసా కల్పిస్తూ, డీజిల్‌పై సబ్సిడీలు ఇస్తున్నాం. మత్స్యకారులు ప్రమాదశాత్తూ చనిపోతే పది లక్షలు పరిహారం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మాది. దేశంలోనే అత్యధికంగా హార్బర్లు నిర్మిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.

- ఇప్పుడిప్పుడే మారుతున్న బతుకులు మావి. మత్య్సకారులకు చాలా మంచి జరుగుతోంది. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, మత్స్యకార భరోసా, మధ్యాన్న భోజన పథకాల ద్వారా మా జీవన స్థితిగతులు మారాయి. ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని వారిని అభివృద్ధిలోకి తీసుకువస్తున్నారు. అది పవన్‌కు అర్థం కాని ఫిలాసపీ. ఆయన ట్రాన్స్‌లో, మాయలో ఉన్నారు. సినిమావాళ్లు కదా... రంగేసుకుంటే ఒకమాట, తీసేస్తే మరోమాట. ఆయన మాటలు కూడా అలాగే ఉంటాయి. సినిమా ప్రమోషన్లు లేనప్పుడు పవన్‌ ఎక్కడ ఉంటారో తెలియదు. 

- ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఆకాశం మీద ఉమ్ము వేస్తే..అది తిరిగి మీ మొహం మీద పడుతుందని పవన్‌ గ్రహించాలి. ఆకాశం మీద ఉమ్మువేయడం సాధ్యమా? జగన్‌ గారు ఆకాశం అంత మనిషి. పవన్‌కు ఇప్పటికైనా మంచి బుద్ధిరావాలని, చిత్తశుద్ధితో ప్రజల సమస్యలపై పని చేయాలని, చంద్రబాబు మాయ నుంచి బయటపడాలని, ప్యాకేజీ మాటలను మానాలని హితవు పలుకుతున్నాం.  ప్రశ్నిస్తామంటూనే పవన్‌ అమ్ముడుపోతారు. జన సైనికులందరి కష్టాన్ని, పోరాటాన్ని వేరేవారికి తాకట్టు పెడుతున్నారు. మీ ఆశయాల్ని వేరేవారి దగ్గర ఊడిగం చేసి, అమ్ముడుపోతున్నారు. ఆయన వలలో పడవద్దని జనసేన శ్రేణులకు హితవు పలుకుతున్నాం.

Back to Top