రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.28 వేల కోట్లు ఇచ్చాం

రాజ్యసభలో  విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ : ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు గ్రాంట్‌ కింద 2015-20 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో  ఆంధ్రప్రదేశ్‌కు 28 వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. సెంట్రల్‌ డివిజబుల్‌ పూల్‌ నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నుల విషయంలో జనరల్‌ కేటగిరీ రాష్ట్రాలు, స్పెషల్‌ కేటగిరీ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం నిర్దేశించలేదని మంత్రి తెలిపారు.
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు సాధారణ కేంద్ర సహాయం (ఎన్సీఏ), ప్రత్యేక ప్రణాళికా సాయం (ఎస్పీఏ), ప్రత్యేక కేంద్ర సాయం (ఎస్సీఏ) కింద ప్రధానంగా లబ్ధి చేకూరుతుందని మంత్రి చెప్పారు. అయితే సెంట్రల్ పూల్‌లో జమ అయ్యే టాక్స్‌లు, సెస్‌ల పంపిణీలో రాష్ట్రాల వాటాను 14వ ఆర్థిక సంఘం 32 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ సిఫార్సు చేసినందున ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పైన వివిధ రూపాలలో కేంద్రం చేసే సహాయాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ఇదే విధానాన్ని 15వ ఆర్థిక సంఘం కూడా తమ సిఫార్సులలో సమర్ధించినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను హేతుబద్దీకరించేందుకు నియమించిన ముఖ్యమంత్రుల ఉప సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్ర పథకాలలో రాష్ట్రాల వాటాను కూడా మార్పు చేసినట్లు తెలిపారు. ఉప సంఘం సిఫార్సులకు అనుగుణంగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు కేంద్ర పథకాలలో తమ వాటా కింద 10 శాతం చెల్లించాలి. జనరల్‌ కేటగిరీ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర పథకాలలో కేంద్రం 60 శాతం నిధులు భరిస్తే రాష్ట్రాలు 40 శాతం భరించాలని నిర్ణయించడం జరిగింది. 2016-17 నుంచి ఈ ఫార్ములా అమలులోకి వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ ఫండింగ్‌ విధానం ముఖ్యమంత్రుల ఉప సంఘం సిఫార్సులను అనుసరించి అమలు చేసింది తప్ప ప్రత్యేక హోదా కలిగినందుకు కాదని మంత్రి వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 ప్రకారం, ఆర్థిక సంఘాల సిఫార్సుల ప్రాతిపదికన కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రాయోజిత పథకాలలో 90:10 నిష్పత్తో 2015-16 నుంచి 2019-20 వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 20,557 కోట్ల రూపాయలను విడుదల చేసిందని చెప్పారు. 

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అత్యధిక టర్నోవర్‌ సాధించింది
  విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) 2020-21 ఆర్థిక సంవత్సరంలో 17,980 కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించినట్లు ఉక్కు శాఖ సహాయ మంత్రి రామ్‌ చంద్ర ప్రసాద్‌ సింగ్‌ రాజ్యసభకు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2020-21లో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ 789 కోట్ల రూపాయల నష్టాలను ప్రకటించిందని చెప్పారు. 2021-222 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌ఐఎన్‌ఎల్‌ పనితీరును తెలిపే ఆడిట్‌ చేసిన సమాచారం ఇంకా వెల్లడి కాలేదని తెలిపారు. దేశంలో ఉక్కు రంగం పనితీరు ఆధారంగా ప్రతి ఏటా ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఆర్థిక, భౌతిక పనితీరు ఆధారపడి ఉంటుందని తెలిపారు. 2011-12 నుంచి 2014-15 వరకు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ లాభాల బాటలోనే ఉన్నట్లు మంత్రి గణాంకాలతో సహా వివరించారు. అనంతరం 2015-2016 నుంచి 2020-21 వరకు (2018-19 ) మొత్తం మీద ఆర్‌ఐఎన్‌ఎల్‌కు 8,752 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top