ఏపీలోని రహదారులపై 466 బ్లాక్‌ స్పాట్స్‌

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
 

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం 2016-2018 మధ్య రాష్ట్రంలోని జాతీయ రహదారులపై 466 ప్రమాదకరమైన స్థలాలు (బ్లాక్‌ స్పాట్స్‌) గర్తించినట్లు రాజ్యసభలో బుధవారం రహదారుల శాఖ మంత్రి  నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. జాతీయ రహదారులపై బ్లాక్‌ స్పాట్‌లను నిర్ధారించేందుకు తమ మంత్రిత్వ శాఖ ఒక ప్రోటోకాల్‌ను రూపొందించిందని మంత్రి తెలిపారు.
జాతీయ రహదారిపై 500 మీటర్ల భాగంలో మూడేళ్ళలో అయిదు రోడ్డు ప్రమాదాలు జరిగినా లేదా ఈ ప్రమాదాలలో 10 మంది మరణించినా ఆ ప్రాంతాన్ని బ్లాక్‌ స్పాట్‌గా గుర్తిస్తారు. ఆ విధంగా గుర్తించిన బ్లాక్‌ స్పాట్‌లను సరిదిద్దేందుకు తాత్కాలిక చర్యలతోపాటు శాశ్వత చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. జాతీయ రహదారులపై తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించడానికి ముందుగానే వాటిని ముందుగానే నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధింత ఉన్నతాధికారులందరికీ తమ మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్‌లో లేఖ రాసినట్లు తెలిపారు.
జాతీయ రహదారులు అభివృద్ధి చేయడానికి ముందుగానే రోడ్డు సేఫ్టీపై ఆడిట్‌ నిర్వహించి ఆయా నివేదికలను జాతీయ రహదారుల నిర్మాణంలో పాలుపంచుకునే సంస్థలతో పంచుకోవడం జరుగుతుందని అన్నారు. కొత్తగా చేపట్టబోయే రోడ్డు ప్రాజెక్ట్‌లు ఏవైనా ముందుగా రోడ్డు సేఫ్టీ ఆడిట్‌ పూర్తయిన తర్వాతే నిర్మాణం ప్రారంభించాలని కూడా మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన బ్లాక్‌ స్పాట్‌లలో దాదాపు 80 శాతం వరకు శాశ్వత ప్రాతిపదికన సరిదిద్దినట్లు మంత్రి వెల్లడించారు.

ఉపాధి పథకం కింద కాఫీ ప్లాంటేషన్‌ అనుమతించం
 మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కాఫీ ప్లాంటేషన్‌ కార్యకలాపాలను అనుమతించబోమని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి రాజ్యసభలో స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని పాడేరు ప్రాంతంలో నిరుపేద గిరిజన రైతుల ప్రయోజనం కోసం ఉపాధి హామీ పథకం కింద కాఫీ ప్లాంటేషన్‌ అభివృద్ధికి ప్రభుత్వం అనుమతిస్తుందా అని వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి ఈ విషయం చెప్పారు. ఉపాధి హామీ పథకం అనేది డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే కార్యక్రమం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల పేదలకు జీవనోపాధి భద్రత కల్పించాలన్నది ఉద్దేశం. ఈ పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రీమీణ పేదలకు వంద రోజులపాటు వేతనంతో కూడిన ఉపాధికి హామీ ఇవ్వడం జరుగుతుందని మంత్రి చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద తమ సొంత భూమిలో వ్యక్తిగత ఆస్తులు సృష్టించుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. అందులో భాగంగా భూమి అభివృద్ధి పనులు, సాగు చెరువుల తవ్వకం, వ్యవసాయ బావుల తవ్వకం, ఉద్యానవన పంటలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు, కోళ్ళు, మేకల షెడ్లు వంటి పనులను చేపట్టవచ్చని మంత్రి తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top