ఏపీలో 2 లక్షల 62 వేల మంది వీధి వర్తకులకు రుణాలు

రాజ్యసభలో  విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆగస్టు 7:  ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద ఇప్పటి వరకు 2,62,811 మంది వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి  కౌశల్ కిషోర్ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైయ‌స్ఆర్‌సీపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2022-23లో 49,534 మందికి, 2023-24లో ఆగస్టు 2 నాటికి 12,097 మంది వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.
కోవిడ్ మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న వ్యాపారాలను  పునఃప్రాంరభించుకునేందుకు వీలుగా వీధి వర్తకులకు  కొలేటరల్ ఫ్రీ వర్కంగ్ కేపిటల్ రుణాలను అందించే లక్ష్యంతో కేంద్రం 2020 జూన్ 1న ప్రధానమంత్రి వీధి వర్తకుల అత్మనిర్బార్ నిధి (పీఎం స్వానిధి) పథకం ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో వర్తకుడికి  మొదటి ఏడాది రూ.10,000 రుణం అందించి, అది సకాలంలో తిరిగి చెల్లించిన పిదప రెండవ విడతలో రూ.20,000, మూడవ విడతలో 50,000 రుణం రూపంలో  ఆర్ధక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రుణ బకాయిలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వడ్డీలో సంవత్సరానికి 7 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ లావాదేవీలు జరిపిన వారికి సంవత్సరానికి రూ.1200 క్యాష్ బ్యాక్ ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు.
పీఎం స్వానిధి కింద వీధి వర్తకులకు మొదట్లో వర్కింగ్ క్యాపిటల్ రుణం  కింద రూ.10,000 అందించినట్లు మంత్రి తెలిపారు. వ్యాపార అవసరాల పరిగణలోకి తీసుకొని 2021 ఏప్రిల్ 9 నుండి రెండవ విడత లోన్ కింద రూ.20,000 అలాగే 2022 జూన్ 1 నుంచి మూడవ విడత కింద రూ.50,000 లోన్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్యాష్ బ్యాక్ స్కీంను 2023 ఫిబ్రవరి 1 నుంచి సవరించినట్లు మంత్రి తెలిపారు. వీధి వర్తకులు జరిపిన ప్రతి డిజిటల్ లావాదేవీకి  రూ.1 చొప్పున నెలకు అత్యధికంగా రూ.100, సంవత్సరానికి రూ.1200 క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తున్నట్ల తెలిపారు. డిజిటల్ లావాదేవీలు కింద అందిస్తున్న క్యాష్ బ్యాక్ ప్రోత్సాహాన్ని పెంచాలన్న ప్రతిపాదనేదీ తమకు అందలేదని అన్నారు.
పీఎం స్వానిధి స్కీం కింద అర్హులైన లబ్దిదారులను గుర్తించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలదేనని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం అనేక చర్యలు చేపడుతోందని అన్నారు.  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అర్బన్ లోకల్ బాడీలు, ఫైనాన్షియల్ సంస్థలతో తరచూ సమావేశాలు నిర్వహించడం, సమయానుసారం రేడియో, టెలివిజన్, వార్తా పత్రికలు మొదలగు ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు జారీ చేయడం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాంతీయ భాషల్లో ఐఈసీ (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) మెటీరియల్ అందించి, ప్రచారం విస్తృతం చేయడం ద్వారా అధిక సంఖ్యలో లబ్దిదారులను గుర్తించే విధంగా ప్రోత్సహిస్తున్నట్ల మంత్రి తెలిపారు. 

విజయనగరంలో 46 కోట్లతో అమృత్ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ, ఆగస్టు 7: విజయనగరం పట్టణంలో 46.96 కోట్ల రూపాయల వ్యంతో అమృత్ పథకం కింద రెండు నీటి సరఫరా ప్రాజెక్టులు, ఒక సెవేజ్, సెప్టేజ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుతో పాటు మూడు పార్కుల అభివృద్ధి చేపట్టగా అవి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని కేంద్ర హౌసింగ్ అర్బన్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం  విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 5.6 కోట్లతో చేపట్టిన ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు అమర్చడం అలాగే 23.81 కోట్ల వ్యయంతో చంపావతి నది నుంచి విజయనగరం పట్టణానికి త్రాగునీటి సరఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టు పూర్తయినట్లు మంత్రి తెలిపారు. పార్కుల అభివృద్ధి కింద 37 లక్షల రూపాయలతో చేపట్టిన గాంధీ పార్కు, అమృత్ పథకం 2016-17 తొలిదశ  కింద 1.02 కోట్లతో చేపట్టిన ప్రకాశం పార్కు అభివృద్ధి పనులు, రెండో దశ కింద 1.07 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయినట్లు మంత్రి తెలిపారు.
పట్టణంలో 14.91 కోట్లతో చేపట్టిన ఇంటర్ సెప్టింగ్ డ్రెయిన్స్‌తో  5 ఎంఎల్డీ సామర్థ్యం గల సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, పట్టణ వ్యాప్తంగా సెప్టేజ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు పనుల్లో కోవిడ్ ప్రభావం, ఇతర కారణాలరీత్యా  కాలయాపన జరిగినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు ఈ ప్రాజెక్టు 2024 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉందని మంత్రి తెలిపారు.
అమృత్ పథకం 2015-16 ఆర్థిక సంవత్సరం నుండి 2019-20 వరకు ఐదు సంవత్సరాల కాలానికి ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. అయితే  కోవిడ్ 19 మహమ్మారి కారణంగా జరిగిన లాక్‌డౌన్‌, ప్రకృతి వైపరీత్యాలు, భూ వివాదాలు, అనుమతులు పొందడంలో ఏర్పడ్డ జాప్యం వంటి కారణాల వలన ప్రాజెక్టుల అమల్లో తీవ్ర జాప్యం జరిగినట్లు మంత్రి తెలిపారు. అనంతరం అమృత్ పథకాన్ని ఉపసంహరించుకొని 2021 అక్టోబర్ 1న అమృత్ 2.0 ప్రవేశపెట్టినట్లు తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న అన్ని  ప్రాజెక్టులకు అమృత్ 2.0 కింద కేంద్రం  నుంచి నిధులు అందుతాయని మంత్రి తెలిపారు.
 
ఆ బావుల్లో గ్యాస్ వెలికితీత నిలిపివేత
  ఆంధ్రప్రదేశ్ కేజీ బేసిన్‌లోని తానెలంక, యెదురులంక ప్రాంతాల్లో ఆయిల్‌ ఇండియా సంస్థ సహజవాయువు నిక్షేపాలను  కనుగొన్నట్లు కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి  హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2018 - 19 మధ్య జరిపిన అన్వేషణలో ఈ రెండు ప్రాంతాల్లో సహజవాయు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొని వెలికితీసే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. సహవాయువు నిక్షేపాలు కనుగొన్న ప్రాంతంలో ఇసుక బిగువుగా ఉండి  తీవ్ర ఒత్తిడి, తీవ్ర ఉష్ణ్రోగ్రత ఉన్నట్లు తేలింది. రెండు బావుల్లోనూ సహజవాయువు తక్కువ మొత్తంలో, తక్కువ సమయం మాత్రమే ప్రవహిస్తున్నట్లు గుర్తించారు. ఇసుక స్వభావం కఠినంగా ఉండడంతో హైడ్రో-ప్రాక్ ఆపరేషన్స్ తరువాత కూడా ఉత్పత్తి కొనసాగలేకపోయిందని మంత్రి తెలిపారు. ఈ బావుల నుంచి సహజవాయువు వెలికితీయడం సాంకేతికంగా సవాలుగా నిలుస్తూ, ఆర్దికంగా లాభసాటిగా లేకపోవడంతో వెలికితీత కార్యక్రమాన్ని కొనసాగించలేదని మంత్రి తెలిపారు.

Back to Top