ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలు అర్థరహితం 

ఇరిగేషన్ శాఖ మంత్రి  పి. అనిల్ కుమార్ యాదవ్  

 అవి కొత్త ప్రాజెక్టులు కాదు.. కేటాయింపులకు మించి వాడటం లేదు

టాయింపులకు మించి చుక్క నీరు కూడా అధికంగా వాడటం లేదు

 మంచితనం అనేది బలహీనత కాదు. 
 
రాష్ట్రం విడిపోయినా.. తెలుగు ప్రజలు కలిసి ఉండాలని కోరుకునే కల్మషం లేని నాయకుడు వైయస్ జగన్ 

తాడేప‌ల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రాజెక్టుల‌పై తెలంగాణ రాష్ట్ర అభ్యంత‌రాలు అర్ధ‌ర‌హిత‌మ‌ని ఇరిగేషన్ శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. విభజన చట్టం ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ (రాజోలిబండ డైవర్షన్‌ స్కీం) కుడి కాలువ పనులను నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని  స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు కేటాయింపులకు లోబడే  ప్రాజెక్ట్‌లు ఉన్నాయని తెలిపారు.  కేటాయింపులకు మించి చుక్క నీరు కూడా ఎక్కువ వాడటం లేదన్నారు. గతంలో జరిగిన అపెక్స్‌ సమావేశాల్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశామన్నారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

 ఏది అక్రమ ప్రాజెక్ట్‌...! 
 తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు శ్రీశైలం జలాశయంలో 800 అడుగులకు దిగువనే ఉన్నాయి.  కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకున్నారు. పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోవాలంటే శ్రీశైలం నీటి మట్టం 848 అడుగుల కంటే దిగువకు చేరితే.. కాలువల్లోకి చుక్క నీరు చేరదు. నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టులో పంటలను రక్షించలేని దుస్థితి నెలకొంది. ఆర్‌డీఎస్‌ కుడి కాలువ ద్వారా ఏపీకి 4 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. నీళ్లు అక్రమంగా తరలిస్తున్నారనడం సమంజసం కాదు. ఏపీకి కేటాయించిన జలాలు తీసుకెళితే ఏవిధంగా తప్పవుతుంది...? ఎవరివి అక్రమ ప్రాజెక్టులు.. ఏది అక్రమ ప్రాజెక్టు..? 

 రాయలసీమ లిఫ్ట్‌, రాజోలిబండ ప్రాజెక్ట్‌లు విభజన చట్టానికి లోబడే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నీటిని వాడుకునేందుకు వీలుగానే కడుతున్నాం. ఏదీ కొత్త ప్రాజెక్ట్‌ కాదు. కృష్ణా బేసిన్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలం జలాశయంలో 881 అడుగుల నీటిమట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. వరద సమయం తక్కువగా ఉంది కాబట్టే ఉన్న సామర్థ్యం పెంచుకుంటున్నాం తప్ప, అధికంగా వాడటం లేదు. కేసీ కెనాల్‌కు సప్లిమెంటేషన్‌ కింద 10 టీఎంసీలు సరఫరా చేయాలి. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌, విభజన చట్టం ద్వారా.. ఈ ప్రాజెక్టులకు 114 టీఎంసీల కేటాయింపు ఉంది. కొత్త ప్రాజెక్టులు ఎక్కడా కట్టడం లేదు. పోతిరెడ్డిపాడు సప్లిమెంటేషనే ఇది.

 తెలంగాణలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్ట్‌లు 800 అడుగుల లోపు ఉన్నాయి. ఈ విధంగా రోజుకి 6.95 టీఎంసీ నీళ్ళు తీసుకుపోయే విధంగా లిఫ్ట్ లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. 

 మేమేమీ కొత్తగా రిజర్వాయర్‌ కట్టడం లేదు. మాకు కేటాయించిన నీటిలోనే తీసుకుంటున్నాం​. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పథకం గతంలో ఉన్నదే. ఏవిధంగా అది తప్పుడు ప్రాజెక్ట్‌ అవుతుందో తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి. 

 తెలంగాణ ప్రభుత్వం మాత్రం శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల కంటే దిగువ స్థాయి నుంచే ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కట్టుకునిపోతూ మమ్మల్ని అనడం ఎంతవరకూ సమంజసం..? 

 పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులు మీరు ఏర్పాటు చేసుకుంటే తప్పు కాదు.. మేము చేస్తే తప్పా..? 

 రాజోలిబండ ప్రాజెక్ట్‌కి నాలుగు టీఎంసీల కేటాయింపు ఉంది.  సుంకేశుల బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి 5.54 టీఎంసీలను తరలించేలా తుమ్మిళ్ల ఎత్తిపోతలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల అక్రమం కాదా..?

 కల్మషం లేని మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ 
 ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి కల్మషం లేకుండా మంచి మనసుతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతున్నారు. ఇరు రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. రోజూ గొడవ పెట్టుకుని రచ్చ చేసుకున్నంత మాత్రాన స్ట్రాంగ్‌గా ఉన్నారని అనుకోవడం సరికాదు. అలాగే ఎక్కడా కేటాయింపులకు మించి వెళ్లడం లేదు. తెలంగాణ వాళ్లు ధర్నాలు చేసుకుంటే చేసుకోనివ్వండి. మా వాదనతో మేము ముందుకు వెళ్తాం.  అపెక్స్‌ కౌన్సిల్‌లో కూర్చుని మాట్లాడుకుంటాం.

 ఇక వంశధార ట్రిబ్యునల్‌ నుంచి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నేరడీ ప్రాజెక్ట్‌ కట్టేందుకు అనుమతి వచ్చింది. త్వరలోనే ప్రారంభిస్తాం. 

 తెలుగు రాష్ట్రం విడిపోయినా.. తెలుగు ప్రజలంతా కలిసుండాలని కోరుకునే వ్యక్తి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక.. ఒక అడుగు ముందుకు వేసి స్నేహ హస్తం అందించిన నాయకుడు. ఏపీ ప్రయోజనాలు కాపాడుతూ ఇరు రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండాలన్నదే ముఖ్యమత్రి గారి ఆకాంక్ష. 

 మంచితనం అనేది బలహీనత కాదు. అది మనల్ని వీక్‌ చేయదు. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. మంచి వాతావరణం ఉండాలి, ఇద్దరు ముఖ్యమంత్రులు సోదరభావంతో వ్యవహరిస్తారు. మంచితనం కూడా ఎన్నో సాధిస్తుంది...  అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. 

Back to Top