చంద్రబాబు మెప్పు కోసం సీపీఐ రామకృష్ణ ఆరాటం

బాబు అజెండా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నావా రామకృష్ణా..? 

ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు

పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించే ప్రసక్తే లేదు

దయచేసి ప్రజల్లో అపోహలు సృష్టించవద్దు 

2021 డిసెంబ‌ర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తాం

ప్రారంభోత్సవం రోజున ఆహ్వానిస్తాం.. టేపుతో కొలత వేసుకోవచ్చు

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ 

తాడేపల్లి: వామపక్ష పార్టీలు గతంలో పేద ప్రజలు, ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేవి. కానీ, సీపీఐ రామకృష్ణ చంద్రబాబు అజెండా కోసం, ఆయన మెప్పుకోసం పనిచేస్తున్నాడని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. 3 వేల మందితో పోలవరం పనులు జరుగుతుంటే.. వారి పనులకు ఆటంకం కలిగించేలా 200 మందితో పోలవరం వెళ్లి ఏం చేస్తారని సీపీఐ రామకృష్ణను ప్రశ్నించారు. ముఖ్యనాయకులు, మేధావులు పది మంది వెళ్లి పోలవరం పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకోవచ్చు కదా అని మంత్రి సూచించారు. కావాలంటే అన్ని పార్టీల నుంచి ఇద్దరిద్దరిని పిలుచుకెళ్లి పోలవరం ప్రాజెక్టు గురించి అధికారులతో వివరణ ఇప్పిస్తామన్నారు. చంద్రబాబు ఆదేశాలతో పనిచేస్తూ.. దయచేసి ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగించొద్దని సీపీఐ రామకృష్ణను కోరారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రామకృష్ణకు పోరాటాలు గుర్తురాలేదా..? కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును తాను కడతానని చంద్రబాబు 2017లో కేబినెట్‌లో ఒప్పందం చేసుకున్నప్పుడు రామకృష్ణ ఎందుకు పోరాటం చేయలేదు. గత ఐదు సంవత్సరాల్లో లక్ష ఇళ్లు కట్టాలంటే కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ గురించి  ఎందుకు బాబును ప్రశ్నించలేదు. ప్రాజెక్టు నిర్వాసితులతో ఎందుకు మాట్లాడలేకపోయావ్‌..? 

పోలవరం మెయిన్‌ డ్యామ్‌ పనులు ఫిబ్రవరి నెల నుంచి మొదలవుతాయి. ప్రస్తుతం స్పిల్‌వే, గేట్లు, కాఫర్‌ డ్యామ్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మెయిన్‌ డ్యామ్‌ పనులే ఫిబ్రవరి నుంచి స్టార్ట్‌ అవుతాయంటే ఇప్పుడెళ్లి ఏం కొలుస్తారు రామకృష్ణా..? కొంతమంది మాజీలు పోలవరంపై తప్పుడు ప్రచారం చేస్తుంటే గతంలో స్పష్టంగా చెప్పాం. 2021 డిసెంబర్‌ 20 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. పూర్తయిన తరువాత ప్రారంభోత్సవానికి అందరినీ పిలుస్తాం.. టేపు తెచ్చుకొని బంగారంగా ఎత్తు కొలుచుకోవచ్చు. అంగుళం కూడా తగ్గించే ప్రసక్తే లేదు. ప్రాజెక్టు  రామకృష్ణ కూడా రావొచ్చు.. ఎత్తు కొలుచుకోవచ్చు. 

పోలవరం ప్రాజెక్టు 150 అడుగుల నుంచి 130 అడుగులకు తగ్గిస్తున్నారు.. మనందరం ఏకమై రౌండ్‌ టేబుట్‌ సమావేశం పెట్టాలని రామకృష్ణ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు అజెండా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నావా రామకృష్ణా..? గత ఐదేళ్లు చంద్రబాబు చేసిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదు. చంద్రబాబు చేసిన దరిద్రాన్ని మా ప్రభుత్వం కడుగుతుంటే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలవరం ఒక్క అంగుళం కూడా తగ్గించే ప్రసక్తే లేదు. దయచేసి ప్రజల్లో అపోహలు సృష్టించవద్దు. ప్రాజెక్టు పనులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చంద్రబాబు, రామకృష్ణ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మీ ప్రవర్తన మానుకోండి’. అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సూచించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top