కర్నూలు : కృష్ణానదికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కరకట్టపై నిర్మించిన అక్రమ నివాసాన్ని వదిలివెళ్లాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోరారు. అక్రమంగా కరకట మీద ఇళ్ళు కట్టుకుని, ప్రభుత్వం ఏలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించడం సరైనది కాదని అన్నారు. శుక్రవారం కర్నూలులో తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి అనిల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వరదలు, వర్షాలపై ఈ ప్రభుత్వంలో అప్రమత్తంగా పని చేస్తోందని స్పష్టం చేశారు. లోకేష్, చంద్రబాబు, పర్యాటకుల మాదిరిగా రాష్ట్రానికి వస్తూ పోతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడు కూడా వర్షాలు కురవలేదని, ఆయన పాలనలో కరువు తాండవించిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తుఫాన్లు వచ్చి రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. ‘చంద్రబాబు పాలనలో శ్రీశైలం పవర్ ప్రాజెక్టును వరద నీటితో ముంచేశారు. చంద్రబాబు తప్పిదాల కారణంగా హైదరాబాద్‌లో కూడా వరదలు వచ్చాయి. బాబు, లోకేష్ ఎప్పుడూ అబద్దాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 23 ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేకపోతున్నారు. వరదల నివారణకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. తమది రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి దేవుడు కూడా సహకరిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. 210 కోట్ల రూపాయల నిధులను తుంగభద్ర పుష్కరాలకు విడుదల చేశామని మంత్రి అనిల్ తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం తుంగభద్ర పుష్కరాలను నిర్వహిస్తాం. రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి రెడ్డి కృషి చేశారు. అదే రీతిలో ముందుకు సాగుతున్నారు. 40 వేల కోట్ల రూపాయల నిధులను రాయలసీమ ప్రాజెక్టులకు ప్రణాళికలను సిద్ధం చేశామని మంత్రి అనిల్ పేర్కొన్నారు.